విదేశీ శిక్షణ శిబిరానికి జ్యోతిక

ప్రపంచ రిలే ఛాంపియన్‌షిప్స్‌ నేపథ్యంలో నిర్వహిస్తున్న విదేశీ శిక్షణ శిబిరానికి ‘‘ఈనాడు’’ సీఎఆర్‌ కార్యక్రమం ‘‘లక్ష్య’’ అథ్లెట్‌ దండి జ్యోతిక శ్రీ ఎంపికైంది.

Published : 04 Apr 2024 02:36 IST

ఈనాడు, హైదరాబాద్‌: ప్రపంచ రిలే ఛాంపియన్‌షిప్స్‌ నేపథ్యంలో నిర్వహిస్తున్న విదేశీ శిక్షణ శిబిరానికి ‘‘ఈనాడు’’ సీఎఆర్‌ కార్యక్రమం ‘‘లక్ష్య’’ అథ్లెట్‌ దండి జ్యోతిక శ్రీ ఎంపికైంది. బహమాస్‌లో గత నెల 26నే ప్రారంభమైన ఈ శిబిరం కోసం జ్యోతిక అక్కడికి వెళ్లింది. మే 2 వరకు ఈ శిక్షణ జరుగుతోంది. 400 మీటర్ల విభాగంలో జ్యోతిక ఎంపికైంది. పురుషులు, మహిళలు కలిపి 17 మంది అథ్లెట్లు ఈ శిబిరంలో పాల్గొంటున్నారు. గత కొద్దికాలంగా వివిధ స్థాయి టోర్నీల్లో జ్యోతిక నిలకడగా రాణిస్తోంది.


ఆమె ఆరోపణలపై విచారణ జరపండి

ముంబయి: క్రికెటర్‌ పృథ్వీ షా తనను లైంగికంగా వేధించాడంటూ సప్న గిల్‌ అనే సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ చేసిన ఆరోపణలపై విచారణ జరపాలని ముంబయిలోని కోర్టు పోలీసులను ఆదేశించింది. జూన్‌ 19 లోపు నివేదిక సమర్పించాలని మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ ఎస్‌.సి.తయ్‌డే పేర్కొన్నారు. అయితే తన ఫిర్యాదు ఆధారంగా షాపై కేసు నమోదు చేయనందుకు పోలీసులపై చర్యలు తీసుకోవాలన్న సప్న అభ్యర్థనను న్యాయస్థానం తోసిపుచ్చింది. తనపై వచ్చిన ఆరోపణలను షా ఇంతకుముందే తిరస్కరించాడు. నిరుడు ఫిబ్రవరిలో ఓ హోటల్‌లో షా, సప్నల మధ్య గొడవ జరిగింది. షాపై దాడి చేసినందుకు అప్పుడు సప్నను పోలీసులు అరెస్ట్‌ చేశారు. షాపై ఆమె ఆరోపణలు అసత్యాలని చెప్పారు. సప్న బెయిలుపై విడుదలైంది.


బంగ్లాదేశ్‌ మహిళలతో భారత్‌ టీ20 సిరీస్‌

ఢాకా: అయిదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కోసం భారత మహిళల జట్టు.. బంగ్లాదేశ్‌లో పర్యటించనుంది. ఈ సిరీస్‌ ఈ నెల 28 నుంచి మే 9 వరకు జరుగుతుంది. భారత్‌ ఈ నెల 23న బంగ్లాదేశ్‌కు చేరుకుంటుంది. మే 10న తిరిగి స్వదేశానికి వస్తుంది. మ్యాచ్‌లన్నీ సిల్‌హెట్‌లో జరుగుతాయి.


కివీస్‌ కెప్టెన్‌గా బ్రాస్‌వెల్‌

అక్లాండ్‌: అయిదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో పాకిస్థాన్‌తో తలపడే న్యూజిలాండ్‌ జట్టుకు ఆల్‌రౌండర్‌ మైకెల్‌ బ్రాస్‌వెల్‌ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. పాక్‌ ఆతిథ్యమిచ్చే ఈ సిరీస్‌ ఈ నెల 17న ఆరంభం కానుంది. ఐపీఎల్‌లో ఆడుతున్న బౌల్ట్‌, ఫెర్గూసన్‌, మ్యాట్‌ హెన్రీ, మిచెల్‌, ఫిలిప్స్‌, రచిన్‌ రవీంద్ర, శాంట్నర్‌, కేన్‌ విలియమ్స్‌లు ఈ సిరీస్‌కు అందుబాటులో లేరు. అన్ని ఫార్మాట్లలో తీరికలేని షెడ్యూలు ఉండడం వల్ల టిమ్‌ సౌథీని ఎంపికకు పరిగణనలోకి తీసుకోలేదు. ఇద్దరు కొత్త ఆటగాళ్లు.. బ్యాటర్‌ టిమ్‌ రాబిన్సన్‌, పేసర్‌ విల్‌ ఒరౌర్కెలకు జట్టులో చోటు దక్కింది. 33 ఏళ్ల బ్రాస్‌వెల్‌ ఇప్పటివరకు 16 టీ20 మ్యాచ్‌లు ఆడాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని