వేగాన్ని తగ్గించుకోవద్దన్నారు

అదనపు నైపుణ్యాల కోసం బౌలింగ్‌ వేగాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం లేదని ఇషాంత్‌ శర్మ సహా దిల్లీ బౌలర్లు సలహా ఇచ్చారని నయా పేస్‌ సంచలనం మయాంక్‌ యాదవ్‌ వెల్లడించాడు.

Published : 04 Apr 2024 02:43 IST

బెంగళూరు: అదనపు నైపుణ్యాల కోసం బౌలింగ్‌ వేగాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం లేదని ఇషాంత్‌ శర్మ సహా దిల్లీ బౌలర్లు సలహా ఇచ్చారని నయా పేస్‌ సంచలనం మయాంక్‌ యాదవ్‌ వెల్లడించాడు. ఈ సీజన్‌లోనే ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ బౌలర్‌ మయాంక్‌.. బుల్లెట్‌ లాంటి బంతులతో ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆర్సీబీపై గంటకు 156.7 కిలోమీటర్ల వేగంతో అతను వేసిన బంతి.. ఈ సీజన్‌లో అత్యధిక వేగవంతమైన బంతిగా నిలిచింది.  దేశవాళీ టోర్నీల్లో దిల్లీకి ఆడే ఈ 21 ఏళ్ల ఫాస్ట్‌బౌలర్‌ తన వేగం గురించి చెప్పాడు. సాధారణంగా బౌలింగ్‌లో మరింత వైవిధ్యం కోసం అవసరమైతే వేగాన్ని తగ్గించుకోమని చెప్పేవాళ్లు ఉంటారు. కానీ ఇషాంత్‌, సందీప్‌ సైని లాంటి సీనియర్లు మాత్రం తన వేగం విషయంలో మాత్రం తగ్గొద్దన్నారని మయాంక్‌ తెలిపాడు. ‘‘ఇషాంత్‌, సైనితో పాటు నేను మాట్లాడిన దిల్లీ బౌలర్లందరూ నా వేగాన్ని తగ్గించుకోవద్దనే చెప్పారు. ఏదైనా కొత్తగా ప్రయత్నిస్తే ఫర్వాలేదు కానీ అది వేగంపై ప్రభావం చూపొద్దని అన్నారు. కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాలనుకున్నా వేగాన్ని మాత్రం కొనసాగించమన్నారు. అందుకే వేగాన్ని తగ్గించే ఏ నైపుణ్యాన్ని అవసరం లేదనుకున్నా. నా దృష్టి కేవలం వేగం మీదే కాదు వికెట్లు తీసి జట్టుకు విజయాలు అందించడంపైనా ఉంటుంది’’ అని మయాంక్‌ పేర్కొన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని