విశాఖలో సునామీ

పదకొండేళ్లు పదిలంగా ఉన్న ఐపీఎల్‌ అత్యధిక స్కోరు రికార్డును సన్‌రైజర్స్‌ బద్దలు కొట్టి వారమే అయింది. ఇంతలోనే కోల్‌కతా నైట్‌రైడర్స్‌ అదే స్థాయిలో రెచ్చిపోయి రికార్డు స్కోరుకు అత్యంత చేరువగా వచ్చింది.

Updated : 04 Apr 2024 06:56 IST

రెచ్చిపోయిన నరైన్‌, రసెల్‌,రఘువంశీ
కోల్‌కతా 272/7.. దిల్లీ చిత్తు

పదకొండేళ్లు పదిలంగా ఉన్న ఐపీఎల్‌ అత్యధిక స్కోరు రికార్డును సన్‌రైజర్స్‌ బద్దలు కొట్టి వారమే అయింది. ఇంతలోనే కోల్‌కతా నైట్‌రైడర్స్‌ అదే స్థాయిలో రెచ్చిపోయి రికార్డు స్కోరుకు అత్యంత చేరువగా వచ్చింది. గత వారం హైదరాబాద్‌ను ముంచెత్తిన పరుగుల సునామీ.. ఈసారి విశాఖపట్నాన్ని తాకింది. తెలుగు క్రికెట్‌ ప్రియులు మరోసారి పరుగుల వర్షంలో తడిసి ముద్దయ్యారు. ఈసారి స్పిన్నరైన సునీల్‌ నరైన్‌ విధ్వంసాన్ని ముందుండి నడిపించడం విశేషం. కొత్త కుర్రాడు రఘువంశీతో పాటు రసెల్‌, రింకు కూడా రెచ్చిపోవడంతో కోల్‌కతా ఏకంగా 272 పరుగుల భారీ స్కోరు సాధించింది. దిల్లీ పోరాడినా నైట్‌రైడర్స్‌ స్కోరుకు చాలా దూరంలో ఆగిపోయింది.

పీఎల్‌-17లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ దూకుడు కొనసాగుతోంది. గత మ్యాచ్‌లో బెంగళూరును చిత్తు చేసిన ఆ జట్టు.. బుధవారం దిల్లీ క్యాపిటల్స్‌ను మట్టికరిపించింది. విశాఖలో ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో నైట్‌రైడర్స్‌ 106 పరుగుల తేడాతో నెగ్గింది. మొదట సునీల్‌ నరైన్‌ (85; 39 బంతుల్లో 7×4, 7×6), రఘువంశీ (54; 27 బంతుల్లో 5×04, 3×6), రసెల్‌ (41; 19 బంతుల్లో 4×4, 3×6) చెలరేగడంతో కోల్‌కతా 7వికెట్లకు 272 పరుగుల భారీ స్కోరు సాధించింది. దిల్లీ బౌలర్లలో నోకియా (3/59), ఇషాంత్‌ (2/43) వికెట్లు తీసినా భారీగా పరుగులిచ్చుకున్నారు. అనంతరం డీసీ 17.2 ఓవర్లలో 166 పరుగులకే ఆలౌటైంది. ఇంపాక్ట్‌ ప్లేయర్‌ వైభవ్‌ అరోరా (3/27), వరుణ్‌ చక్రవర్తి (3/33) మిచెల్‌ స్టార్క్‌ (2/25) ఆ జట్టును దెబ్బ తీశారు. రిషబ్‌ పంత్‌ (55; 25 బంతుల్లో 4×4, 5×6), ట్రిస్టియన్‌ స్టబ్స్‌ (54; 32 బంతుల్లో 4×4, 4×6) పోరాడారు. 4 మ్యాచ్‌ల్లో దిల్లీకిది మూడో ఓటమి. కోల్‌కతా ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ నెగ్గింది.

పోటీలోనే లేదు..: ఛేదనలో దిల్లీ ఏ దశలోనూ పోటీలో లేదు. హైదరాబాద్‌ రికార్డు స్కోరు సాధించినపుడు ముంబయిలాగా ఆ జట్టు తెగించి ఆడలేదు. ఆ జట్టు ఆరంభమే పేలవం. వైభవ్‌ అరోరా వేసిన రెండో ఓవర్లోనే పృథ్వీ షా (10) వెనుదిరిగాడు. మిచెల్‌ మార్ష్‌ ఖాతా తెరవకుండానే స్టార్క్‌కు వికెట్‌ ఇచ్చేశాడు. ఇంపాక్ట్‌ ప్లేయర్‌ పోరెల్‌ కూడా డకౌటయ్యాడు. వార్నర్‌ (18) సైతం వెనుదిరగడంతో 33/4తో దిల్లీ ఘోర పరాభవం దిశగా అడుగులు వేసింది. అయితే దాదాపు ఓటమి ఖరారయ్యాక పంత్‌, స్టబ్స్‌ జోడీ ఎదురుదాడి మొదలుపెట్టింది. పంత్‌ స్వేచ్ఛగా షాట్లు ఆడాడు. వెంకటేశ్‌ అయ్యర్‌ వేసిన 12వ ఓవర్లో పంత్‌ వరుసగా 4, 6, 6, 4, 4, 4 బాదేశాడు. కానీ వరుణ్‌ వేసిన తర్వాతి ఓవర్లో పంత్‌ ఔటైపోవడంతో ఇన్నింగ్స్‌ మళ్లీ గాడి తప్పింది. స్టబ్స్‌ పోరాటానికి కూడా వరుణే తెరదించడంతో డీసీ కథ ముగియడానికి ఎంతో సమయం పట్టలేదు.

నరైన్‌ విధ్వంసం: కోల్‌కతా ఇన్నింగ్స్‌లో తొమ్మిది బంతులు పడ్డాయి. 5 బంతులాడిన నరైన్‌, 4 బంతులెదుర్కొన్న సాల్ట్‌ ఖాతానే తెరవలేదు. ఇన్నింగ్స్‌ను ఇలా ఆరంభించిన జట్టు.. ఐపీఎల్‌ చరిత్రలోనే రెండో అత్యధిక స్కోరు సాధిస్తుందని ఎవరైనా అనుకుంటారా? చకచకా నాలుగు ఫోర్లు కొట్టి ఇన్నింగ్స్‌లో కదలిక తెచ్చిన సాల్ట్‌ ఎంతోసేపు నిలవలేదు కానీ.. ఎప్పుడెప్పుడు ఔటవుతాడా అన్నట్లు కనిపించే స్పిన్‌ ఆల్‌రౌండర్‌ సునీల్‌ నరైన్‌ అనూహ్యంగా చెలరేగిపోయాడు. అతను ఇషాంత్‌ వేసిన ఇన్నింగ్స్‌ నాలుగో ఓవర్లో మూడు సిక్సర్లు, రెండు ఫోర్లు కొట్టడంతో నైట్‌రైడర్స్‌ ఇన్నింగ్స్‌ స్వరూపమే మారిపోయింది. ఆ ఓవర్‌ నుంచి అతను ఎలా కొట్టినా బంతి బౌండరీ చేరింది. ప్రమాదకర సాల్ట్‌ను ఔట్‌ చేశామని దిల్లీ సంబరపడేలోపే.. అతడి స్థానంలో వచ్చిన అండర్‌-19 కుర్రాడు రఘువంశీ వినూత్న షాట్లతో చెలరేగాడు. ఐపీఎల్‌లో ఆడిన తొలి ఇన్నింగ్స్‌లోనే స్విచ్‌, స్కూప్‌ షాట్లతో అతను అలవోకగా బౌండరీలు రాబట్టాడు.  ఇద్దరూ పోటీ పడి సిక్సర్లు బాదడంతో స్కోరు బోర్డు రాకెట్‌ వేగంతో దూసుకెళ్లింది. నరైన్‌ 21 బంతుల్లోనే 6 ఫోర్లు, 6 సిక్సర్లతో అర్ధశతకం పూర్తి చేశాడు. తర్వాత కూడా అతడి జోరు తగ్గలేదు. 12 ఓవర్లకే స్కోరు 162కు చేరుకుంది. నరైన్‌ 80ల్లోకి వచ్చేశాడు. దీంతో అతను సెంచరీ కూడా చేస్తాడనిపించింది. అయితే మార్ష్‌.. అతడి ఇన్నింగ్స్‌కు తెరదించాడు. అర్ధశతకం పూర్తి చేశాక రఘువంశీ కూడా ఔట్‌ కావడం స్కోరు వేగం కొంచెం తగ్గింది. కొంత విరామం తర్వాత మళ్లీ మెరుపులు మొదలయ్యాయి. ఈసారి రసెల్‌ అందుకున్నాడు. శ్రేయస్‌ సైతం దూకుడు పెంచడంతో పరుగుల వరద పతాక స్థాయికి చేరుకుంది. శ్రేయస్‌ ఔటయ్యాక వచ్చిన రింకు (26; 8 బంతుల్లో 1×4, 3×6) సైతం చెలరేగడంతో కోల్‌కతా ఐపీఎల్‌ రికార్డు స్కోరుకు చేరువైంది. కానీ చివరి ఓవర్లో ఇషాంత్‌ 8 పరుగులే ఇవ్వడంతో రికార్డు దక్కలేదు.

కోల్‌కతా ఇన్నింగ్స్‌: సాల్ట్‌ (సి) స్టబ్స్‌ (బి) నోకియా 18; నరైన్‌ (సి) పంత్‌ (బి) మార్ష్‌ 85; రఘువంశీ (సి) ఇషాంత్‌ (బి) నోకియా 54; రసెల్‌ (బి) ఇషాంత్‌ 41; శ్రేయస్‌ (సి) స్టబ్స్‌ (బి) ఖలీల్‌ 18; రింకు సింగ్‌ (సి) వార్నర్‌ (బి) నోకియా 26; వెంకటేశ్‌ అయ్యర్‌ నాటౌట్‌ 5; రమణ్‌దీప్‌ (సి) షా (బి) ఇషాంత్‌ 2; స్టార్క్‌ నాటౌట్‌ 1; ఎక్స్‌ట్రాలు 22 మొత్తం: (20 ఓవర్లలో 7 వికెట్లకు) 272; వికెట్ల పతనం: 1-60, 2-164, 3-176, 4-232, 5-264, 6-264, 7-266; బౌలింగ్‌: ఖలీల్‌ అహ్మద్‌ 4-0-43-1; ఇషాంత్‌ 3-0-43-2; నోకియా 4-0-59-3; రసిక్‌ సలామ్‌ 3-0-47-0; సుమిత్‌ కుమార్‌ 2-0-19-0; అక్షర్‌ పటేల్‌ 1-0-18-0; మిచెల్‌ మార్ష్‌ 3-0-37-1

దిల్లీ ఇన్నింగ్స్‌: వార్నర్‌ (బి) స్టార్క్‌ 18; పృథ్వీ షా (సి) వరుణ్‌ (బి) అరోరా 10; మిచెల్‌ మార్ష్‌ (సి) రమణ్‌దీప్‌ సింగ్‌ (బి) స్టార్క్‌ 0; అభిషేక్‌ పోరెల్‌ (సి) నరైన్‌ (బి) అరోరా 0; పంత్‌ (సి) శ్రేయస్‌ అయ్యర్‌ (బి) వరుణ్‌ 55; స్టబ్స్‌ (సి) స్టార్క్‌ (బి) వరుణ్‌ 54; అక్షర్‌ పటేల్‌ (సి) పాండే (బి) వరుణ్‌ 0; సుమీత్‌ కుమార్‌ (సి) పాండే (బి) నరైన్‌ 7; రసిఖ్‌ సలమ్‌ (సి) సాల్ట్‌ (బి) అరోరా 1; నోకియా (సి) శ్రేయస్‌ అయ్యర్‌ (బి) రసెల్‌ 4; ఇషాంత్‌ శర్మ నాటౌట్‌ 1; ఎక్స్‌ట్రాలు 16 మొత్తం: (17.2 ఓవర్లలో ఆలౌట్‌) 166; వికెట్ల పతనం: 1-21, 2-26, 3-27, 4-33, 5-126, 6-126, 7-159, 8-159, 9-161; బౌలింగ్‌: స్టార్క్‌ 3-0-25-2; వైభవ్‌ అరోరా 4-0-27-3; రసెల్‌ 1.2-0-14-1; నరైన్‌ 4-0-29-1; వరుణ్‌ చక్రవర్తి 4-0-33-3; వెంకటేశ్‌ అయ్యర్‌ 1-0-28-0


అప్పటి నరైన్‌ మళ్లీ..

గౌతమ్‌ గంభీర్‌ కెప్టెన్‌గా ఉండగా 2017 ఐపీఎల్‌లో సునీల్‌ నరైన్‌ను ఓపెనర్‌గా పంపడం ఓ సంచలనం. లోయరార్డర్లో బ్యాటింగ్‌ చేసే నరైన్‌ ఓపెనర్‌ ఏంటి అని అప్పుడందరూ ఆశ్చర్యపోయారు. అయితే క్రిస్‌ లిన్‌తో కలిసి కొన్ని మ్యాచ్‌ల్లో జట్టుకు మెరుపు ఆరంభాలందించి ఆ పాత్రకు న్యాయం చేశాడు నరైన్‌. కానీ తర్వాతి సీజన్లో గంభీర్‌ కోల్‌కతాను వీడాక నరైన్‌ మళ్లీ బ్యాటింగ్‌ ఆర్డర్లో దిగువకు వెళ్లిపోయాడు. ఇప్పుడు గంభీర్‌ మెంటార్‌గా తిరిగి నైట్‌రైడర్స్‌ జట్టులోకి రాగా.. అతను మళ్లీ నరైన్‌ను ఓపెనర్‌ను చేశాడు. ఈసారి అతను అంచనాలను మించి రాణిస్తున్నాడు. తొలి మ్యాచ్‌లో విఫలమైనప్పటికీ.. రెండో మ్యాచ్‌లో బెంగళూరుపై మెరుపు ఇన్నింగ్స్‌ (22 బంతుల్లో 47)తో జట్టును గెలిపించాడు. ఇక బుధవారం దిల్లీపై అతను ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.


చిక్కినట్లే చిక్కి..

పీఎల్‌లో బెంగళూరు 2013లో 263 పరుగులతో నెలకొల్పిన అత్యధిక స్కోరు రికార్డు 11 ఏళ్ల పాటు నిలిచింది. ఈ సీజన్లో ముంబయిపై సన్‌రైజర్స్‌ 277 పరుగులతో ఆ రికార్డును బద్దలు కొట్టింది. కానీ కొన్ని రోజులకే ఈ రికార్డును కోల్‌కతా అధిగమించేలా కనిపించింది. బుధవారం ఆ జట్టు ఊపు చూస్తే.. కొత్త రికార్డు నమోదవడం ఖాయమే అనిపించింది. 2 ఓవర్లు మిగిలుండగా నైట్‌రైడర్స్‌ స్కోరు 239/4. హైదరాబాద్‌ స్కోరును అధిగమించాలంటే ఇంకో 39 పరుగులు చేయాలి. ఈ స్థితిలో 19వ ఓవర్లో (నోకియా) బ్యాటింగ్‌కు వచ్చిన రింకు సింగ్‌ 5 బంతుల్లో మూడు సిక్సర్లు, ఒక ఫోర్‌ బాదేశాడు. 7 బంతులుండగా రికార్డు స్కోరుకు ఇంకో 14 పరుగులే అవసరమయ్యాయి. కానీ చివరి ఓవర్లో ఇషాంత్‌ తొలి మూడు బంతుల్లో 2 వికెట్లు తీశాడు. మొత్తంగా ఈ ఓవర్లో 8 పరుగులే రావడంతో రికార్డు కోల్‌కతా చేజారింది.


పంత్‌.. తగ్గేదేలే

రోడ్డు ప్రమాదం కారణంగా 15 నెలల విరామం తర్వాత పోటీ క్రికెట్లోకి వచ్చిన రిషబ్‌ పంత్‌పై ఎన్నో అనుమానాలు! మైదానంలో చురుగ్గా కదలగలడా? ఒకప్పటిలా బ్యాటింగ్‌ చేయగలడా? తనదైన షాట్లు ఆడగలడా? అని అభిమానుల్లో ఎన్నో ప్రశ్నలు. కానీ వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ ఐపీఎల్‌లో చెలరేగిపోతున్నాడు రిషబ్‌. ఆరంభ మ్యాచ్‌ల్లో పంత్‌కు ఇబ్బందులు తప్పవని సునీల్‌ గావస్కర్‌ సైతం అభిప్రాయపడగా.. తొలి రెండు మ్యాచ్‌ల్లో మాత్రం కొంత తడబడ్డాడు పంత్‌. కానీ మూడో మ్యాచ్‌లో చెన్నైపై స్వేచ్ఛగా బ్యాటింగ్‌ చేస్తూ అర్ధశతకం (51) సాధించాడు. ఇక బుధవారం కోల్‌కతాపై అతను మరింతగా రెచ్చిపోయాడు. తనదైన శైలిలో భారీ షాట్లు ఆడుతూ 25 బంతుల్లోనే 55 పరుగులు చేశాడు. 23 బంతుల్లోనే అతడి అర్ధశతకం పూర్తయింది. పంత్‌ ఒకప్పటిలా  చెలరేగడం టీ20 ప్రపంచకప్‌ ముంగిట భారత క్రికెట్‌ అభిమానులకు ఎంతో ఉత్సాహాన్నిచ్చేదే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని