ఇప్పుడు హైదరాబాద్‌ వంతు.. అంతా మహేంద్రుడి మయం

మహేంద్ర సింగ్‌ ధోని.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే నామస్మరణ. భారత్‌కు రెండు ప్రపంచకప్‌లు అందించిన దిగ్గజ క్రికెటర్‌ బహుశా ఆఖరిసారి ఐపీఎల్‌ ఆడుతున్న నేపథ్యంలో అతడి ఆట చూసేందుకు అభిమానులు ఎగబడుతున్నారు.

Updated : 05 Apr 2024 14:21 IST

టికెట్ల కోసం అభిమానుల పాట్లు

ఈనాడు, హైదరాబాద్‌: మహేంద్ర సింగ్‌ ధోని.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే నామస్మరణ. భారత్‌కు రెండు ప్రపంచకప్‌లు అందించిన దిగ్గజ క్రికెటర్‌ బహుశా ఆఖరిసారి ఐపీఎల్‌ ఆడుతున్న నేపథ్యంలో అతడి ఆట చూసేందుకు అభిమానులు ఎగబడుతున్నారు. ధోని ఏ నగరానికి వెళ్లినా స్టేడియాలు కిక్కిరిసిపోతున్నాయి. ఇప్పుడు హైదరాబాద్‌ వంతు వచ్చింది. శుక్రవారం ఉప్పల్‌ స్టేడియంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఢీకొననుంది. అయిదేళ్ల తర్వాత ధోని హైదరాబాద్‌లో మ్యాచ్‌ ఆడుతుండటంతో ఈ మ్యాచ్‌ కోసం విపరీతమైన డిమాండ్‌ ఏర్పడింది. సాధారణ వ్యక్తి నుంచి అత్యున్నత స్థాయి అధికారుల వరకు టికెట్ల కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. సాధారణంగా ఉన్నతాధికారులకు ఐపీఎల్‌ నిర్వాహకులు కాంప్లిమెంటరీ పాసులు అందజేయడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ధోని రాకతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది.

చెన్నై మ్యాచ్‌ టికెట్ల కోసం పోటీని ముందే ఊహించిన సన్‌రైజర్స్‌ ఫ్రాంచైజీ చాలా తక్కువ సంఖ్యలో ఆన్‌లైన్‌లో టికెట్లను అమ్మినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. సుమారు 40 వేల సామర్థ్యమున్న స్టేడియం టికెట్లు గంటలోనే అమ్ముడైనట్లు ఆన్‌లైన్‌ సంస్థ, ఫ్రాంచైజీ చెప్తున్నాయి. కానీ పెద్ద సంఖ్యలో టికెట్లను బ్లాక్‌ చేసినట్లు విమర్శలు వస్తున్నాయి. వీటిని కాంప్లిమెంటరీ పాసులుగా ముద్రించి బ్లాక్‌లో అధిక ధరకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ఉప్పల్‌ స్టేడియం సమీపంలో బ్లాక్‌లో విక్రయిస్తున్న కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బ్లాక్‌ టికెట్ల వ్యవహారంపై మీడియాలో కథనాలు వస్తున్నా పట్టించుకున్న నాథుడే లేడు. మ్యాచ్‌ కోసం ఎన్ని టికెట్లు అమ్మారు? ఎవరు కొన్నారు? అనే వివరాలు ఆన్‌లైన్‌ సంస్థ, సన్‌రైజర్స్‌, హెచ్‌సీఏ దగ్గర ఉంటాయి. కానీ ఇప్పటి వరకు టికెట్ల విక్రయాల గురించి ఎవరూ ప్రకటన చేయలేదు.

ఇటీవల ఉప్పల్‌ స్టేడియంలో భారత్‌, ఇంగ్లాండ్‌ మధ్య టెస్టు మ్యాచ్‌ సందర్భంగా హెచ్‌సీఏ అధ్యక్ష, కార్యదర్శులు, మిగతా ఎపెక్స్‌ కౌన్సిల్‌ సభ్యులు ప్రచారం కోసం పోటీపడ్డారు. పాఠశాలల చిన్నారులకు ప్రతిరోజూ ఉచితంగా 10 వేల పాసులు పంచినట్లు గొప్పలు చెప్పుకున్నారు. ఐపీఎల్‌ మ్యాచ్‌కు వేల సంఖ్యలో కాంప్లిమెంటరీ పాసులు తీసుకుంటున్న హెచ్‌సీఏ.. విద్యార్థులకు పంచుతున్న దాఖలా లేదు. కనీసం డబ్బులు పెట్టి కొనేందుకైనా అవకాశం ఇవ్వడం లేదు? ఇక మ్యాచ్‌ విషయానికొస్తే.. చెన్నై, హైదరాబాద్‌లో ఎవరు గెలుస్తారు అన్న దానికంటే.. ధోని ఎలా ఆడతాడన్న దానిపైనే ఎక్కువ చర్చ సాగుతోంది. విశాఖపట్నంలో దిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో ధోని మెరుపు ఇన్నింగ్స్‌ (37 నాటౌట్‌; 16 బంతుల్లో 4×4, 3×6) ఆడాడు. మరోసారి అతడి నుంచి అభిమానులు ధనాధన్‌ ఇన్నింగ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని