పంజాబ్‌ లాగేసుకుంది

199.. కెప్టెన్‌ గిల్‌ చెలరేగడంతో సొంత మైదానంలో గుజరాత్‌ టైటాన్స్‌ మొదట చేసిన స్కోరిది. ఆ జట్టు బలమైన బౌలింగ్‌ను దాటి.. పంజాబ్‌ గెలుస్తుందనే అంచనాలు అంతంతమాత్రమే! అందుకు తగ్గట్లే ధావన్‌, బెయిర్‌స్టో, ప్రభ్‌సిమ్రన్‌, కరన్‌, సికందర్‌.. ఇలా ప్రధాన బ్యాటర్లందరూ పెవిలియన్‌కు వెళ్లిపోయారు.

Updated : 05 Apr 2024 07:04 IST

ఉత్కంఠ పోరులో గుజరాత్‌పై విజయం
గిల్‌ అర్ధసెంచరీ వృథా

శశాంక్‌ సంచలన బాటింగ్‌
అహ్మదాబాద్‌

199.. కెప్టెన్‌ గిల్‌ చెలరేగడంతో సొంత మైదానంలో గుజరాత్‌ టైటాన్స్‌ మొదట చేసిన స్కోరిది. ఆ జట్టు బలమైన బౌలింగ్‌ను దాటి.. పంజాబ్‌ గెలుస్తుందనే అంచనాలు అంతంతమాత్రమే! అందుకు తగ్గట్లే ధావన్‌, బెయిర్‌స్టో, ప్రభ్‌సిమ్రన్‌, కరన్‌, సికందర్‌.. ఇలా ప్రధాన బ్యాటర్లందరూ పెవిలియన్‌కు వెళ్లిపోయారు. కానీ ఎవరూ ఊహించని విధంగా శశాంక్‌ సింగ్‌ విధ్వంసం సృష్టించాడు. ఇంపాక్ట్‌ ప్లేయర్‌ అశుతోష్‌ రెచ్చిపోయాడు. ఈ ఇద్దరు కలిసి.. గుజరాత్‌ చేతుల్లో నుంచి మ్యాచ్‌ లాగేసుకున్నారు. ఉత్కంఠను దాటి సీజన్‌లో పంజాబ్‌కు రెండో విజయాన్ని అందించారు. నాలుగు మ్యాచ్‌లే ఆడిన టైటాన్స్‌కు ఇది రెండో ఓటమి.

పంజాబ్‌ కింగ్స్‌ అదుర్స్‌. శశాంక్‌ సింగ్‌ (61 నాటౌట్‌; 29 బంతుల్లో 6×4, 4×6) సంచలన బ్యాటింగ్‌తో ఆ జట్టు గురువారం 3 వికెట్ల తేడాతో గుజరాత్‌ టైటాన్స్‌ను ఓడించింది. ఇంపాక్ట్‌ ప్లేయర్‌ అశుతోష్‌ శర్మ (31; 17 బంతుల్లో 3×4, 1×6) జట్టు విజయంలో గట్టి ప్రభావం చూపాడు. మొదట టైటాన్స్‌ 20 ఓవర్లలో 4 వికెట్లకు 199 పరుగులు చేసింది. శుభ్‌మన్‌ గిల్‌ (89 నాటౌట్‌; 48 బంతుల్లో 6×4, 4×6) సత్తాచాటాడు. సాయి సుదర్శన్‌ (33; 19 బంతుల్లో 6×4), రాహుల్‌ తెవాటియా (23 నాటౌట్‌; 8 బంతుల్లో 3×4, 1×6) కూడా మెరిశారు. రబాడ (2/44) రెండు వికెట్లు తీశాడు. అనంతరం ఛేదనలో పంజాబ్‌ 7 వికెట్లు కోల్పోయి మరో బంతి మిగిలి ఉండగా లక్ష్యాన్ని చేరుకుంది. టైటాన్స్‌ స్పిన్నర్‌ నూర్‌ అహ్మద్‌ (2/32) ఆకట్టుకున్నాడు.

ఆ ఇద్దరు అదుర్స్‌

భారీ లక్ష్య ఛేదనలో పంజాబ్‌ వికెట్లు పడుతున్నా.. మరోవైపు పరుగులూ వచ్చాయి. నూర్‌ అహ్మద్‌ పక్కా ప్రణాళికతో లెగ్‌స్టంప్‌ లక్ష్యంగా బెయిర్‌స్టో (22)కు బౌలింగ్‌ చేసి బౌల్డ్‌ చేశాడు. అదే లెగ్‌స్టంప్‌ లక్ష్యంగా గూగ్లీతో ప్రభ్‌సిమ్రన్‌ (35)ను బుట్టలో వేసుకున్నాడు. 9 ఓవర్లకు 73/4తో పంజాబ్‌ కష్టాల్లో పడింది. కానీ శశాంక్‌ రూపంలో టైటాన్స్‌ను తుపాన్‌ ముంచెత్తింది. అహ్మద్‌ బౌలింగ్‌లో సిక్సర్‌తో తన బౌండరీల వేట మొదలెట్టిన అతను.. ఏ దశలోనూ ఆగలేదు. పేసర్‌ ఎవరైనా తగ్గలేదు. ఉమేశ్‌ బౌలింగ్‌లో వరుసగా 4, 6, 4 బాదేశాడు. బ్యాక్‌ఫుట్‌ను గొప్పగా వాడుకుంటూ అలవోకగా భారీ షాట్లు ఆడాడు. బౌలింగ్‌కు వచ్చిన మోహిత్‌.. సికందర్‌ (15)ను ఔట్‌ చేశాడు. కానీ శశాంక్‌ ఊచకోతను ప్రమాదకర రషీద్‌ ఖాన్‌నూ అతను లెక్కచేయలేదు. అతని బౌలింగ్‌లో స్లాగ్‌స్వీప్‌తో భారీ సిక్సర్‌ కొట్టాడు. రషీద్‌ వేసిన మరో ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లు కొట్టిన జితేశ్‌ (16) మూడో బంతికి వెనుదిరిగాడు. శశాంక్‌ క్రీజులో ఉండటం.. పంజాబ్‌ విజయానికి చివరి 4 ఓవర్లలో 47 పరుగులు కావడంతో ఉత్కంఠ రేకెత్తింది. 17వ ఓవర్లో మోహిత్‌ ఆరు పరుగులే ఇచ్చాడు. ఈ ఓవర్లో అశుతోష్‌ క్యాచ్‌ను ఉమేశ్‌ చేజార్చాడు. అవకాశాన్ని ఉపయోగించుకుంటూ అశుతోష్‌ తర్వాతి ఓవర్లో మూడు ఫోర్లు కొట్టాడు. మరోవైపు శశాంక్‌ 25 బంతుల్లో ఐపీఎల్‌లో తొలి అర్ధశతకం చేసుకున్నాడు. సమీకరణం 12 బంతుల్లో 25 పరుగులుగా మారిన దశలో.. 19వ ఓవర్లో అశుతోష్‌, శశాంక్‌ చెరో సిక్సర్‌తో పంజాబ్‌ విజయాన్ని ఖాయం చేశారు. చివరి ఓవర్లో 7 పరుగులే అవసరమవగా.. యువ పేసర్‌ దర్శన్‌ తొలి బంతికే అశుతోష్‌ను ఔట్‌ చేశాడు. తర్వాతి రెండు బంతుల్లో రెండు పరుగులే వచ్చాయి. కానీ మూడో బంతికి శశాంక్‌ ఫోర్‌ కొట్టడంతో పంజాబ్‌ నవ్వింది. ఆ వెంటనే సింగిల్‌ తీసి శశాంక్‌ లాంఛనం పూర్తి చేశాడు.

ఇరుసులా నిలబడి

అంతకుముందు టైటాన్స్‌ భారీ స్కోరు చేసిందంటే అందుకు శుభ్‌మన్‌ గిల్‌ అద్భుతమైన బ్యాటింగే ప్రధాన కారణం. ఇన్నింగ్స్‌కు ఇరుసులా నిలబడ్డ అతను ఈ సీజన్‌లో తొలిసారి స్థాయికి తగ్గ ప్రదర్శన చేశాడు. మధ్యలో సాయి సుదర్శన్‌, చివర్లో రాహుల్‌ తెవాటియా మెరుపులూ కలిసొచ్చాయి. గుజరాత్‌కు మంచి ఆరంభమే దక్కింది. త్వరగానే సాహా (11) వికెట్‌ కోల్పోయినప్పటికీ విలియమ్సన్‌ (26)తో కలిసి శుభ్‌మన్‌.. ఇన్నింగ్స్‌ను నడిపించాడు. స్ట్రెయిట్‌ డ్రైవ్‌లతో శుభ్‌మన్‌ ఆకట్టుకున్నాడు. గాయంతో దూరమైన మిల్లర్‌ స్థానంలో జట్టులోకి వచ్చి.. ఈ సీజన్‌లో తొలి మ్యాచ్‌ ఆడిన విలియమ్సన్‌ కూడా కుదురుకున్నట్లే కనిపించాడు. దీంతో పవర్‌ప్లేను ఆ జట్టు 52/1తో మెరుగ్గానే ముగించింది. కానీ హర్‌ప్రీత్‌ స్పిన్‌ను అంచనా వేయడంలో విఫలమై విలియమ్సన్‌ వెనుదిరిగాడు. ఈ దశలో శుభ్‌మన్‌కు సూపర్‌ ఫామ్‌లో ఉన్న సుదర్శన్‌ జత కలవడంతో స్కోరుబోర్డు మరింత వేగాన్ని అందుకుంది. వస్తూనే పిడుగులా పడ్డ సుదర్శన్‌.. ఫుల్‌, ఫ్లిక్‌తో బౌండరీల వేటలో సాగాడు. దీంతో 12 ఓవర్లో స్కోరు వంద దాటింది. రబాడ వేసిన లెంగ్త్‌ బంతిని అమాంతం బౌలర్‌ తల మీదుగా గిల్‌ సిక్సర్‌గా మలచిన తీరు చూడాల్సిందే. కానీ హర్షల్‌ షార్ట్‌పిచ్‌ బంతికి సుదర్శన్‌ బోల్తా పడటంతో 16 ఓవర్లకు 141/3తో జట్టు నిలిచింది. జట్టుకు అవసరమైన సమయంలో గిల్‌ మరింత దూకుడు పెంచాడు. అర్ధశతకం తర్వాత చెలరేగాడు. మిల్లర్‌ లేని లోటును తీరుస్తూ తెవాటియా బౌండరీలతో రెచ్చిపోవడంతో చివరి 4 ఓవర్లలో టైటాన్స్‌ 58 పరుగులు పిండుకుంది.

అప్పుడు వద్దనుకున్నవాడు

గుజరాత్‌తో మ్యాచ్‌లో ధనాధన్‌ బ్యాటింగ్‌తో పంజాబ్‌ను గెలిపించిన శశాంక్‌ను వేలంలో ఆ ఫ్రాంఛైజీ వద్దనుకుంది. అవును.. ఇదే నిజం. శశాంక్‌ సింగ్‌ పేరు వేలంలోకి రాగానే కనీస ధర రూ.20 లక్షలకు అతణ్ని పంజాబ్‌ కొనుగోలు చేసింది. కానీ ఆ తర్వాత తాము తీసుకోవాలనుకున్న శశాంక్‌ అతను కాదని, మరో శశాంక్‌ ఉన్నాడని చెప్పింది. దీంతో వేలంలో కాస్త గందరగోళ పరిస్థితి తలెత్తింది. అప్పటికే వ్యాఖ్యాత అతని వేలాన్ని ముగించడంతో పంజాబ్‌ ఒప్పుకోక తప్పలేదు. ఆ తర్వాత ‘‘మేం కొనాలనుకునే ఆటగాళ్ల జాబితాలో శశాంక్‌ ఉన్నాడు. ఇద్దరు ఆటగాళ్లు ఒకే పేరుతో ఉండటంతో గందరగోళం తలెత్తింది. సరైన శశాంక్‌ సింగే జట్టులోకి వచ్చాడు’’ అని ఆ తర్వాత శశాంక్‌కు స్వాగతం పలుకుతూ పంజాబ్‌ ట్వీట్‌ చేసింది.

కొంపముంచిన క్యాచ్‌

అశుతోష్‌ క్యాచ్‌ను వదిలేయడమే పంజాబ్‌తో మ్యాచ్‌లో గుజరాత్‌ కొంప ముంచిందని చెప్పాలి. అప్పుడు పంజాబ్‌ విజయానికి 22 బంతుల్లో 46 పరుగులు కావాలి. మోహిత్‌ బౌలింగ్‌లో అశుతోష్‌ క్యాచ్‌ను ఉమేశ్‌ పట్టలేకపోయాడు. ఆ తర్వాత ఓవర్లో అతనిచ్చిన కష్టమైన క్యాచ్‌ను సుదర్శన్‌ వదిలేశాడు. దీంతో చెలరేగి ఆడిన అతను 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో మ్యాచ్‌ మలుపు తిరగడంలో కీలక పాత్ర పోషించాడు. శశాంక్‌తో కలిసి ఏడో వికెట్‌కు 22 బంతుల్లోనే 43 పరుగులు జోడించాడు.

గుజరాత్‌ ఇన్నింగ్స్‌: సాహా (సి) ధావన్‌ (బి) రబాడ 11; శుభ్‌మన్‌ నాటౌట్‌ 89; విలియమ్సన్‌ (సి) బెయిర్‌స్టో (బి) హర్‌ప్రీత్‌ 26; సుదర్శన్‌ (సి) జితేశ్‌ (బి) హర్షల్‌ 33; విజయ్‌ శంకర్‌ (సి) హర్‌ప్రీత్‌ (బి) రబాడ 8; తెవాటియా నాటౌట్‌ 23; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం: (20 ఓవర్లలో 4 వికెట్లకు) 199; వికెట్ల పతనం: 1-29, 2-69, 3-122, 4-164; బౌలింగ్‌: హర్‌ప్రీత్‌ బ్రార్‌ 4-0-33-1; అర్ష్‌దీప్‌ సింగ్‌ 4-0-33-0; రబాడ 4-0-44-2; కరన్‌ 2-0-18-0; హర్షల్‌ పటేల్‌ 4-0-44-1; సికందర్‌ రజా 2-0-22-0

పంజాబ్‌ ఇన్నింగ్స్‌: ధావన్‌ (బి) ఉమేశ్‌ 1; బెయిర్‌స్టో (బి) నూర్‌ 22; ప్రభ్‌సిమ్రన్‌ (సి) మోహిత్‌ (బి) నూర్‌ 35; సామ్‌ కరన్‌ (సి) విలియమ్సన్‌ (బి) అజ్మతుల్లా 5; సికందర్‌ (సి) సాహా (బి) మోహిత్‌ 15; శశాంక్‌ నాటౌట్‌ 61; జితేశ్‌ (సి) దర్శన్‌ (బి) రషీద్‌ 16; అశుతోష్‌ (సి) రషీద్‌ (బి) దర్శన్‌ 31; హర్‌ప్రీత్‌ నాటౌట్‌ 1; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం: (19.5 ఓవర్లలో 7 వికెట్లకు) 200; వికెట్ల పతనం: 1-13, 2-48, 3-64, 4-70, 5-111, 6-150, 7-193

బౌలింగ్‌: అజ్మతుల్లా 4-0-41-1; ఉమేశ్‌ 3-0-35-1; రషీద్‌ ఖాన్‌ 4-0-40-1; నూర్‌ అహ్మద్‌ 4-0-32-2; మోహిత్‌ శర్మ 4-0-38-1; దర్శన్‌ 0.5-0-6-1

మిల్లర్‌కు గాయం

గుజరాత్‌ టైటాన్స్‌కు మరో షాక్‌! ఆ జట్టు కీలక బ్యాటర్‌ మిల్లర్‌ గాయం కారణంగా ఒకట్రెండు వారాలు జట్టుకు దూరమయ్యే అవకాశముంది. గాయంతోనే పంజాబ్‌తో మ్యాచ్‌లో అతనాడలేదు. మిల్లర్‌కు బదులుగా విలియమ్సన్‌ జట్టులోకి వచ్చాడు. ‘‘సుదీర్ఘ కాలం తర్వాత తిరిగి ఐపీఎల్‌లో అడుగుపెట్టడం బాగుంది. గాయం కారణంగా మిల్లర్‌ ఒకట్రెండు వారాల పాటు జట్టుకు దూరం కానున్నాడు’’ అని విలియమ్సన్‌ చెప్పాడు. ఫినిషర్‌ పాత్రను సమర్థంగా పోషిస్తున్న మిల్లర్‌ దూరమవడం టైటాన్స్‌కు దెబ్బే. సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో అజేయంగా 44 పరుగులు చేసిన అతను జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని