నితీశ్‌ నిలబెట్టాడు

హెడ్‌ నిలవలేదు.. అభిషేక్‌ మెరవలేదు.. క్లాసెన్‌ కూడా దంచలేదు.. జట్టులో ఇంకే పేరున్న బ్యాటరూ రాణించలేదు.. 10 ఓవర్లకు స్కోరు 64 పరుగులే.

Updated : 10 Apr 2024 06:46 IST

చెలరేగిన తెలుగు కుర్రాడు
మెరిసిన భువనేశ్వర్‌
శశాంక్‌, అశుతోష్‌ పోరాటం వృథా
పంజాబ్‌పై సన్‌రైజర్స్‌ విజయం
ముల్లాన్‌పుర్‌

హెడ్‌ నిలవలేదు.. అభిషేక్‌ మెరవలేదు.. క్లాసెన్‌ కూడా దంచలేదు.. జట్టులో ఇంకే పేరున్న బ్యాటరూ రాణించలేదు.. 10 ఓవర్లకు స్కోరు 64 పరుగులే. అయినా సన్‌రైజర్స్‌హైదరాబాద్‌ 180 దాటింది. కారణం.. తెలుగు కుర్రాడు నితీశ్‌ కుమార్‌ రెడ్డి. ప్రతికూల పరిస్థితుల్లో చెలరేగి ఆడిన ఈ ఆంధ్ర బ్యాటర్‌.. జట్టుకు పోరాడే స్కోరునందించాడు. తర్వాత బౌలింగ్‌, ఫీల్డింగ్‌లోనూ రాణించి మ్యాచ్‌లో హీరో అయ్యాడు. ఛేదనలో పంజాబ్‌ కూడా గట్టిగానే పోరాడింది. గత మ్యాచ్‌ హీరోలు శశాంక్‌ సింగ్‌, అశుతోష్‌ శర్మ మరోసారి మ్యాచ్‌ను లాగేసేలాగే కనిపించారు. కానీ 2 పరుగుల స్వల్ప తేడాతో నెగ్గి సన్‌రైజర్స్‌ ఊపిరి పీల్చుకుంది.

న్‌రైజర్స్‌కు హైదరాబాద్‌కు మూడో విజయం. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 2 పరుగుల తేడాతో పంజాబ్‌ కింగ్స్‌ను ఓడించింది. నితీశ్‌ కుమార్‌ రెడ్డి (64; 37 బంతుల్లో 4×4, 5×6) చెలరేగడంతో మొదట సన్‌రైజర్స్‌ 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు సాధించింది. అర్ష్‌దీప్‌ (4/29) బంతితో రాణించాడు. ఛేదనలో పంజాబ్‌ 6 వికెట్లకు 180 పరుగులే చేసింది. శశాంక్‌ సింగ్‌ (46 నాటౌట్‌; 25 బంతుల్లో 6×4, 1×6), అశుతోష్‌ శర్మ (33 నాటౌట్‌; 15 బంతుల్లో 3×4, 2×6) పోరాడినా ఫలితం లేకపోయింది. భువనేశ్వర్‌ (2/32), కమిన్స్‌ (1/22) బంతితో రాణించారు.

ఆశలు రేపిన ఆ ఇద్దరు: ఛేదనలో పంజాబ్‌ కింగ్స్‌ తడబడింది. ఆద్యంతం వెనుకబడ్డ ఆ జట్టులో.. ఆఖర్లో శశాంక్‌, అశుతోష్‌ ఆశలు రేపినా ఫలితం లేకపోయింది.  భువనేశ్వర్‌ ఆరంభంలోనే పంజాబ్‌కు కళ్లెం వేశాడు. రెండో ఓవర్లోనే బెయిర్‌స్టోను ఔట్‌ చేయడం ద్వారా పంజాబ్‌ పతనాన్ని కమిన్స్‌ ఆరంభించగా.. ఆ తర్వాత భువి తన వరుస ఓవర్లలో ప్రభ్‌సిమ్రన్‌, శిఖర్‌ ధావన్‌లను వెనక్కి పంపాడు .20కే 3 వికెట్లు కోల్పోయిన పంజాబ్‌.. పరుగుల వేటలో బాగా వెనుకబడిపోయింది. సామ్‌ కరన్‌ (29), సికందర్‌ రజా (28) క్రీజులో నిలిచినా ధాటిగా ఆడలేకపోయారు. సాధించాల్సిన రన్‌రేట్‌ పెరుగుతూ పోయింది. 9 ఓవర్లకు స్కోరు 58 పరుగులే. తర్వాతి ఓవర్లోనే కరన్‌ను నటరాజన్‌ ఔట్‌ చేశాడు. ఆ తర్వాత రజా రెండు సిక్స్‌లు కొట్టినా.. పరుగులు అవసరమైనంత వేగంతో రాలేదు. 14వ ఓవర్లో రజాను ఉనద్కత్‌ ఔట్‌ చేశాడు. ఓ వైపు శశాంక్‌ సింగ్‌ ఉన్నా.. లక్ష్యం మరింత సంక్లిష్టంగా మారుతూ పోయింది. జితేశ్‌ శర్మను నితీశ్‌ ఔట్‌ చేయగా... పంజాబ్‌ ఆఖరి నాలుగు ఓవర్లలో 67 పరుగులు చేయాల్సిన స్థితిలో నిలిచింది. కానీ  శశాంక్‌ సింగ్‌, అశుతోష్‌ శర్మ.. పంజాబ్‌ ఆశలను సజీవంగా ఉంచారు. భువి బౌలింగ్‌లో శశాంక్‌ మూడు ఫోర్లు కొట్టగా.... కమిన్స్‌ ఓవర్లో అశుతోష్‌ రెండు ఫోర్లు దంచాడు. 19వ ఓవర్లో నటరాజన్‌ 10 పరుగులే ఇచ్చి సన్‌రైజర్స్‌ విజయాన్ని తేలిక చేశాడు. కానీ చివరి ఓవర్లో పంజాబ్‌ 29 పరుగులు చేయాల్సి ఉండగా.. అశుతోష్‌ విధ్వంసక బ్యాటింగ్‌తో సన్‌రైజర్స్‌ను కలవరపెట్టాడు. ఉనద్కత్‌ పేలవంగా బౌలింగ్‌ చేశాడు. అశుతోష్‌ రెండు సిక్స్‌లు బాదడం, ఉనద్కత్‌ మూడు వైడ్లు వేయడంతో ఆఖరి రెండు బంతుల్లో పంజాబ్‌కు 10 పరుగులు అవసరయ్యాయి. అయితే అయిదో బంతికి అశుతోష్‌ సింగిల్‌ మాత్రమే తీయడంతో సన్‌రైజర్స్‌ ఊపిరిపీల్చుకుంది.

చెలరేగిన నితీశ్‌..: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌లో తెలుగు కుర్రాడు నితీశ్‌ కుమార్‌ రెడ్డి ఆటే హైలైట్‌. పేలవంగా ఇన్నింగ్స్‌ ఆరంభించిన ఆ జట్టు మంచి స్కోరు సాధించిందంటే ప్రధాన కారణం నితీశ్‌ ఆటే. సన్‌రైజర్స్‌ ఇన్నింగ్స్‌లో తొలి సగం, ద్వితీయార్ధం పూర్తి భిన్నంగా సాగాయి. మొదట సగంలో పంజాబ్‌ బౌలర్ల ధాటికి తడబడ్డ హైదరాబాద్‌.. రెండో సగంలో నితీశ్‌ జోరుతో మెరుగైన స్కోరు సాధించింది. సన్‌రైజర్స్‌ ఆరంభం పేలవం. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆ జట్టు అయిదు ఓవర్లలో 39 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది. అర్ష్‌దీప్‌ తన తొలి రెండు ఓవర్లలో ఎనిమిది పరుగులకే రెండు వికెట్లు పడగొట్టి సన్‌రైజర్స్‌ను దెబ్బతీశాడు. హెడ్‌ (21; 15 బంతుల్లో 4×4) బ్యాట్‌ ఝళిపించడంతో మొదట్లో ఆ జట్టు బాగానే కనిపించింది. మూడు ఓవర్లలో స్కోరు 26/0. కానీ అర్ష్‌దీప్‌ ఒకే ఓవర్లో హెడ్‌, మార్‌క్రమ్‌ (0)ను ఔట్‌ చేశాడు. తర్వాతి ఓవర్లో సామ్‌కరన్‌ బౌలింగ్‌లో వరుసగా 6, 4 బాదిన అభిషేక్‌ శర్మ (16; 11 బంతుల్లో 2×4, 1×6).. ఆ తర్వాతి బంతికే వెనుదిరిగాడు. చకచకా మూడు వికెట్లు పడ్డాక పరుగుల కోసం సన్‌రైజర్స్‌ చెమటోడ్చింది. నితీశ్‌ కుమార్‌ రెడ్డి, రాహుల్‌ త్రిపాఠి (11) ఇన్నింగ్స్‌ను నడిపించే ప్రయత్నం చేశారు. కానీ పరుగుల చేయడానికి ఇబ్బందిపడ్డారు. 6 నుంచి 9 ఓవర్ల మధ్య 22 పరుగులు మాత్రమే వచ్చాయి. హర్‌ప్రీత్‌ బ్రార్‌.. బ్యాటర్లకు స్వేచ్ఛనివ్వలేదు. పదో ఓవర్లో హర్షల్‌ బౌలింగ్‌తో త్రిపాఠి వెనుదిరిగేటప్పటికీ సన్‌రైజర్స్‌ స్కోరు 64 పరుగులే. అయితే ఎదుర్కొన్న తొలి 18 బంతుల్లో 14 పరుగులే చేసిన నితీశ్‌.. ఇన్నింగ్స్‌ ద్వితీయార్ధంలో గేర్‌ మార్చి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ముచ్చటైన షాట్లతో అలరించాడు. హర్‌ప్రీత్‌ బ్రార్‌ బౌలింగ్‌లో వరుసగా 4, 6 బాదిన అతడు.. రబాడ షార్ట్‌ బంతిని లాంగ్‌ లెగ్‌లో సిక్స్‌గా మలిచాడు. కరన్‌ బౌలింగ్‌లోనూ ముచ్చటైన సిక్స్‌ కొట్టాడు. విధ్వంసక వీరుడు క్లాసెన్‌ (9) త్వరగానే ఔటైనా.. నితీశ్‌ మరింత రెచ్చిపోయాడు. హర్‌ప్రీత్‌ బ్రార్‌ వేసిన ఇన్నింగ్స్‌ 15వ ఓవర్లో వరుసగా 4, 6, 4, 6తో అదరగొట్టాడు. మరోవైపు సమద్‌ (25; 12 బంతుల్లో 5×4) కూడా బ్యాట్‌ ఝళిపించడంతో వేగంగా పరుగులొచ్చాయి. అతడు హర్షల్‌ వేరు వేరు ఓవర్లలో నాలుగు ఫోర్లు బాదేశాడు. అయితే సమద్‌, నితీశ్‌లు ఇద్దరినీ 17వ ఓవర్లో అర్ష్‌దీప్‌ పెవిలియన్‌ చేర్చాడు. తర్వాతి ఓవర్లో భువనేశ్వర్‌ నాలుగే పరుగులిచ్చి కమిన్స్‌ (3)ను ఔట్‌ చేసినా.. షాబాజ్‌ (14 నాటౌట్‌) కాస్త బ్యాట్‌ ఝళిపించడంతో చివరి రెండు ఓవర్లలో సన్‌రైజర్స్‌ 26 పరుగులొచ్చాయి. తొలి పది ఓవర్లలో 66 పరుగులే చేసిన సన్‌రైజర్స్‌.. ఆఖరి 10 ఓవర్లలో 116 పరుగులు రాబట్టడం విశేషం.

సన్‌రైజర్స్‌ ఇన్నింగ్స్‌: ట్రావిస్‌ హెడ్‌ (సి) ధావన్‌ (బి) అర్ష్‌దీప్‌ 21; అభిషేక్‌ (సి) శశాంక్‌ సింగ్‌ (బి) కరన్‌ 16; మార్‌క్రమ్‌ (సి) జితేశ్‌ (బి) అర్ష్‌దీప్‌ 0; నితీశ్‌ కుమార్‌ రెడ్డి (సి) రబాడ (బి) అర్ష్‌దీప్‌ 64; రాహుల్‌ త్రిపాఠి (సి) జితేశ్‌ (బి) హర్షల్‌ 11; క్లాసెన్‌ (సి) కరన్‌ (బి) హర్షల్‌ 9; సమద్‌ (సి) హర్షల్‌ (బి) అర్ష్‌దీప్‌ 25; షాబాజ్‌ అహ్మద్‌ నాటౌట్‌ 14; కమిన్స్‌ (బి) రబాడ 3; భువనేశ్వర్‌ (సి) బెయిర్‌స్టో (బి) కరన్‌ 6; ఉనద్కత్‌ నాటౌట్‌ 6; ఎక్స్‌ట్రాలు 7

మొత్తం: (20 ఓవర్లలో 9 వికెట్లకు) 182;

వికెట్ల పతనం: 1-27, 2-27, 3-39, 4-64, 5-100, 6-150, 7-151, 8-155, 9-176;

బౌలింగ్‌: రబాడ 4-0-32-1; అర్ష్‌దీప్‌ సింగ్‌ 4-0-29-4; సామ్‌ కరన్‌ 4-0-41-2; హర్షల్‌ పటేల్‌ 4-0-30-2; హర్‌ప్రీత్‌ బ్రార్‌ 4-0-48-0

పంజాబ్‌ ఇన్నింగ్స్‌: శిఖర్‌ ధావన్‌ (స్టంప్డ్‌) క్లాసెన్‌ (బి) భువనేశ్వర్‌ 14; బెయిర్‌స్టో (బి) కమిన్స్‌ 0; ప్రభ్‌సిమ్రన్‌ (సి) నితీశ్‌ (బి) భువనేశ్వర్‌ 4; సామ్‌ కరన్‌ (సి) కమిన్స్‌ (బి) నటరాజన్‌ 29; సికందర్‌ రజా (సి) క్లాసెన్‌ (బి) ఉనద్కత్‌ 28; శశాంక్‌ సింగ్‌ నాటౌట్‌ 46; జితేశ్‌శర్మ (సి) అభిషేక్‌ (బి) నితీశ్‌ 19; అశుతోష్‌ శర్మ నాటౌట్‌ 33; ఎక్స్‌ట్రాలు 7

మొత్తం: (20 ఓవర్లలో 6 వికెట్లకు) 180;

వికెట్ల పతనం: 1-2, 2-11, 3-20, 4-58, 5-91, 6-114;

బౌలింగ్‌: భువనేశ్వర్‌ 4-1-32-2; కమిన్స్‌ 4-0-22-1; నటరాజన్‌ 4-0-33-1; నితీశ్‌ కుమార్‌ 3-0-33-1; జైదేవ్‌ ఉనద్కత్‌ 4-0-49-1; షాబాజ్‌ అహ్మద్‌ 1-0-10-0

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని