196.. సరిపోలా!

ముంబయి ఇండియన్స్‌ జోరందుకుంది. హ్యాట్రిక్‌ పరాభవాలతో ఐపీఎల్‌-17ను పేలవంగా ఆరంభించి, పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచిన ఆ జట్టు.. ఇప్పుడు అదిరే ఆటతో దూసుకుపోతోంది. గత మ్యాచ్‌లో దిల్లీని ఓడించి ఖాతా తెరిచిన ముంబయి.. గురువారం బెంగళూరును చిత్తు చేసింది.

Updated : 12 Apr 2024 17:13 IST

బెంగళూరు చిత్తు.. సీజన్లో అయిదో ఓటమి
చెలరేగిన ఇషాన్‌, సూర్య
విజృంభించిన బుమ్రా
15.3 ఓవర్లకే ఛేదించేసిన ముంబయి
ముంబయి

ముంబయి ఇండియన్స్‌ జోరందుకుంది. హ్యాట్రిక్‌ పరాభవాలతో ఐపీఎల్‌-17ను పేలవంగా ఆరంభించి, పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచిన ఆ జట్టు.. ఇప్పుడు అదిరే ఆటతో దూసుకుపోతోంది. గత మ్యాచ్‌లో దిల్లీని ఓడించి ఖాతా తెరిచిన ముంబయి.. గురువారం బెంగళూరును చిత్తు చేసింది. అద్భుత బౌలింగ్‌తో అయిదు వికెట్ల ఘనత సాధించిన బుమ్రా.. విధ్వంసక బ్యాటింగ్‌తో అర్ధశతకాలు అందుకున్న ఇషాన్‌ కిషన్‌, సూర్యకుమార్‌ ముంబయి హీరోలుగా నిలిచారు. ఆరు మ్యాచ్‌ల్లో అయిదో పరాజయంతో ప్లేఆఫ్స్‌ అవకాశాలను ఆర్సీబీ సంక్లిష్టం చేసుకుంది.

ముంబయి ఇండియన్స్‌ అదరగొట్టింది. గురువారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరును చిత్తు చిత్తుగా ఓడించింది. డుప్లెసిస్‌ (61; 40 బంతుల్లో 4×4, 3×6), దినేశ్‌ కార్తీక్‌ (53 నాటౌట్‌; 23 బంతుల్లో 5×4, 4×6), రజత్‌ పటీదార్‌ (50; 26 బంతుల్లో 3×4, 4×6) మెరవడంతో మొదట ఆర్సీబీ 8 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. బుమ్రా (5/21) అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. ఇషాన్‌ కిషన్‌ (69; 34 బంతుల్లో 7×4, 5×6), సూర్యకుమార్‌ (52; 19 బంతుల్లో 5×4, 4×6)ల విధ్వంసక బ్యాటింగ్‌తో లక్ష్యాన్ని ముంబయి 15.3 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి అలవోకగా ఛేదించింది.

బాదుడే బాదుడు: చిన్న లక్ష్యమేమీ కాకపోయినా సునాయాసంగా ఛేదనను పూర్తి చేసింది ముంబయి. ఇషాన్‌ ఇన్నింగ్స్‌కు కళ్లు చెదిరే ఆరంభాన్నిస్తే.. ఆ తర్వాత సూర్య ఆర్సీబీ బౌలర్లపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడ్డాడు. ఛేదనలో ఆరంభమే ముంబయికి విజయాన్ని ఖాయం చేసింది. మరో ఓపెనర్‌ రోహిత్‌ శర్మ (38; 24 బంతుల్లో 3×4, 3×6) సహకరిస్తుండగా విధ్వంసక షాట్లతో విరుచుకుపడ్డ ఇషాన్‌ కిషన్‌.. ఆర్సీబీ బౌలింగ్‌ను తుత్తునియలు చేశాడు. ఈ ఇద్దరి శతక భాగస్వామ్యం.. మ్యాచ్‌లో ఆర్సీబీకి అవకాశమే లేకుండా చేసింది. టాప్లీ వేసిన ఇన్నింగ్స్‌ తొలి ఓవర్లో ఆచితూచి వ్యవహరించిన ఇషాన్‌.. రెండో ఓవర్‌ నుంచి బాదుడు మొదలెట్టాడు. ఆకాశ్‌ దీప్‌ బౌలింగ్‌లో సిక్స్‌ కొట్టిన అతడు.. ఆ తర్వాత ఏ దశలోనూ తగ్గలేదు. ఎడాపెడా ఫోర్లు, సిక్స్‌లతో వాంఖడేలో అభిమానులను ఉర్రూతలూగించాడు. రోహిత్‌ కూడా కొన్ని చక్కని షాట్లు ఆడాడు. 9వ ఓవర్లో ఇషాన్‌ ఔటయ్యేటప్పటికి ముంబయి స్కోరు 101. అప్పటికి రోహిత్‌ 29తో ఉన్నాడు. ఇషాన్‌ను వెనక్కి పంపినా ఆర్సీబీకి ఉపశమనమే లేదు. ఆర్సీబీ బౌలర్లను నిస్సహాయులను చేస్తూ సూర్య వేట మొదలెట్టాడు. విరామం లేకుండా విరుచుకుపడ్డాడు. ఆకాశ్‌దీప్‌ ఓవర్లో (11వ) ఏకంగా మూడు సిక్స్‌లు, ఓ ఫోర్‌.. టాప్లీ ఓవర్లో మూడు ఫోర్లు, సిక్స్‌తో కేవలం 17 బంతుల్లోనే అర్ధశతకాన్ని అందుకున్నాడు. ఆ వెంటనే (14వ ఓవర్లో, జట్టు స్కోరు 176) అతడు ఔటైనా.. అప్పటికే ఫలితం ఖరారైంది. సూర్య కంటే ముందే, అంటే 12వ ఓవర్లో రోహిత్‌ నిష్క్రమించడంతో క్రీజులోకి వచ్చిన హార్దిక్‌ పాండ్య (21 నాటౌట్‌).. తిలక్‌ వర్మ (16 నాటౌట్‌)తో కలిసి లాంఛనం పూర్తి చేశాడు.

బుమ్రా అద్భుతః: డుప్లెసిస్‌ దంచేశాడు. పటీదార్‌ ధనాధన్‌ బ్యాటింగ్‌తో అదరగొట్టాడు. ఈ ఇద్దరి 82 పరుగుల భాగస్వామ్యం మ్యాచ్‌లో ఎంతో కీలకమైంది. అయినా.. బుమ్రా అద్భుతంగా బౌలింగ్‌ చేసిన వేళ బెంగళూరు 200 స్కోరుకు చేరువగా వెళ్లడం ఊహించనిదే. జట్టును అంత దాకా తీసుకెళ్లిన ఘనత దినేశ్‌ కార్తీక్‌దే. ఆఖర్లో విధ్వంసక ఇన్నింగ్స్‌ ఆడిన అతడు ఆర్సీబీ బలమైన లక్ష్యాన్ని నిర్దేశించడంతో ముఖ్య పాత్ర పోషించాడు. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు ఇన్నింగ్స్‌ను పేలవంగా మొదలెట్టింది. 4 ఓవర్లలో 28 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. సూపర్‌ ఫామ్‌లో ఉన్న కోహ్లి (3).. బుమ్రా బౌలింగ్‌లో వికెట్‌కీపర్‌ ఇషాన్‌ కిషన్‌కు చిక్కాడు. ఐపీఎల్‌ అరంగేట్రం చేసిన ఆల్‌రౌండర్‌ విల్‌ జాక్స్‌ (8)ను మధ్వాల్‌ వెనక్కి పంపాడు. అప్పుడు డుప్లెసిస్‌కు తోడయ్యాడు రజత్‌ పటీదార్‌. బ్యాటర్లిద్దరూ ధాటిగా బ్యాటింగ్‌ చేస్తూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. డుప్లెసిస్‌ వీలైనప్పుడల్లా బంతిని బౌండరీ దాటించాడు. అయితే ఇద్దరిలో పటీదార్‌ ఎక్కువ దూకుడు ప్రదర్శించాడు. గోపాల్‌, హార్దిక్‌ బౌలింగ్‌లో సిక్స్‌లు బాదిన అతడు.. కొయెట్జీ వేసిన ఇన్నింగ్స్‌ 12వ ఓవర్లో వరుసగా రెండు సిక్స్‌లతో అర్ధశతకం (25 బంతుల్లో) పూర్తి చేసుకున్నాడు. కానీ తర్వాతి బంతికే ఔట్‌ కావడంతో జోరుగా సాగుతున్న భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాతి ఓవర్లో విధ్వంసక బ్యాటర్‌ మ్యాక్స్‌వెల్‌ను గోపాల్‌ వెనక్కి పంపాడు. కానీ చక్కని బ్యాటింగ్‌ను కొనసాగించిన డుప్లెసిస్‌.. షెపర్డ్‌ ఓవర్లో ఓ ఫోర్‌, గోపాల్‌ బౌలింగ్‌లో సిక్స్‌ కొట్టడంతో బెంగళూరు 15 ఓవర్లలో 130/4తో నిలిచింది.
కార్తీక్‌ విధ్వంసం: 16వ ఓవర్‌ నుంచి కార్తీక్‌ దంచుడు మొదలెట్టాడు. మధ్వాల్‌ ఓవర్లో నాలుగు ఫోర్లతో స్కోరు బోర్డుకు జెట్‌ వేగాన్నిచ్చాడు. కానీ అద్భుత బౌలింగ్‌ను కొనసాగించిన బుమ్రా.. 17వ ఓవర్లో 5 పరుగులే ఇచ్చి డుప్లెసిస్‌, లొమ్రార్‌లను ఔట్‌ చేశాడు. బుమ్రా తన తర్వాతి ఓవర్లోనూ గొప్పగా బౌలింగ్‌ చేసి చౌహాన్‌, వైశాఖ్‌లను పెవిలియన్‌ బాట పట్టించాడు. కానీ కార్తీక్‌ అదిరే బ్యాటింగ్‌తో తన జట్టుకు మెరుగైన స్కోరును అందించాడు. కొయెట్జీ ఓవర్లో ఫోర్‌, సిక్స్‌ కొట్టిన అతడు... బుమ్రా వేసిన ఓ బంతిని కూడా సిక్స్‌గా మలిచాడు. ఆఖరి ఓవర్లో వరుసగా 6, 6, 4తో ఇన్నింగ్స్‌కు కార్తీక్‌ మెరుపు ముగింపునిచ్చాడు. అతడి జోరుతో ఆఖరి 5 ఓవర్లలో బెంగళూరు 66 పరుగులు రాబట్టింది.

బెంగళూరు ఇన్నింగ్స్‌: కోహ్లి (సి) ఇషాన్‌ కిషన్‌ (బి) బుమ్రా 3; డుప్లెసిస్‌ (సి) డేవిడ్‌ (బి) బుమ్రా 61; విల్‌ జాక్స్‌ (సి) డేవిడ్‌ (బి) మధ్వాల్‌ 8; రజత్‌ పటీదార్‌ (సి) ఇషాన్‌ కిషన్‌ (బి) కొయెట్జీ 50; మ్యాక్స్‌వెల్‌ ఎల్బీ (బి) గోపాల్‌ 0; దినేశ్‌ కార్తీక్‌ నాటౌట్‌ 53; లొమ్రార్‌ ఎల్బీ (బి) బుమ్రా 0; సౌరభ్‌ చౌహాన్‌ (సి) మధ్వాల్‌ (బి) బుమ్రా 9; విజయ్‌కుమార్‌ వైశాఖ్‌ (సి) నబి (బి) బుమ్రా 0; ఆకాశ్‌దీప్‌ నాటౌట్‌ 2; ఎక్స్‌ట్రాలు 10

మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 196

వికెట్ల పతనం: 1-14, 2-23, 3-105, 4-108, 5-153, 6-153, 7-170, 8-170

బౌలింగ్‌: నబి 1-0-7-0; కొయెట్జీ 4-0-42-1; బుమ్రా 4-0-21-5; ఆకాశ్‌ మధ్వాల్‌ 4-0-57-1; శ్రేయస్‌ గోపాల్‌ 4-0-32-1; రొమారియో షెఫర్డ్‌ 2-0-22-0; హార్దిక్‌ పాండ్య 1-0-13-0

ముంబయి ఇన్నింగ్స్‌: కిషన్‌ (సి) కోహ్లి (బి) ఆకాశ్‌దీప్‌ 69; రోహిత్‌శర్మ (సి) టాప్లీ (బి) జాక్స్‌ 38; సూర్యకుమార్‌ (సి) లొమ్రార్‌ (బి) విజయ్‌కుమార్‌ 52; హార్దిక్‌ పాండ్య నాటౌట్‌ 21; తిలక్‌వర్మ నాటౌట్‌ 16; ఎక్స్‌ట్రాలు 3

మొత్తం: (15.3 ఓవర్లలో 3 వికెట్లకు) 199

వికెట్ల పతనం: 1-101, 2-139, 3-176

బౌలింగ్‌: టాప్లీ 3-0-34-0; సిరాజ్‌ 3-0-37-0; ఆకాశ్‌దీప్‌ 3.3-0-55-1; మ్యాక్స్‌వెల్‌ 1-0-17-0; విజయ్‌కుమార్‌ 3-0-32-1; విల్‌ జాక్స్‌ 2-0-24-1

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని