రాధికకు రజతం

ఆసియా రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో రాధిక రజతం సాధించింది. 68 కేజీల తుదిపోరులో ననోకా ఒజాకి (జపాన్‌) చేతిలో భారత అమ్మాయి ఓడిపోయింది. సాంకేతికంగా బలంగా కనిపించిన ననోకా ముందు రాధిక తేలిపోయింది.

Published : 14 Apr 2024 02:21 IST

బిష్కెక్‌: ఆసియా రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో రాధిక రజతం సాధించింది. 68 కేజీల తుదిపోరులో ననోకా ఒజాకి (జపాన్‌) చేతిలో భారత అమ్మాయి ఓడిపోయింది. సాంకేతికంగా బలంగా కనిపించిన ననోకా ముందు రాధిక తేలిపోయింది. మరోవైపు శివాని పవార్‌ (50 కేజీ) కాంస్యం సొంతం చేసుకుంది. కంచు పోరులో ఆమె 9-7తో డోల్గోరావ్‌ (మంగోలియా)పై విజయం సాధించింది. తమన్నా (55 కేజీ), పుష్ప యాదవ్‌ (59 కేజీ), ప్రియ (76 కేజీ)లకు పతకాలు దక్కలేదు. రెపిచేజ్‌లో తమన్నా 0-4తో మిన్‌ జాంగ్‌ చేతిలో.. పుష్ప 8-11తో డయానా (కజకిస్థాన్‌) చేతిలో ఓడారు. ఎల్మిరా (కజకిస్థాన్‌).. ప్రియపై నెగ్గింది.


ప్లేఆఫ్స్‌కు భారత్‌ దూరం

చాంగ్‌షా (చైనా): బిల్లీ జీన్‌ కింగ్‌ కప్‌ ఆసియా/ఓసియానియా గ్రూప్‌-1 టెన్నిస్‌ టోర్నమెంట్లో భారత్‌ ప్లేఆఫ్స్‌కు దూరమైంది. శనివారం జరిగిన ఆఖరి గ్రూప్‌ పోరులో 1-2తో న్యూజిలాండ్‌ చేతిలో ఓడింది. తొలి సింగిల్స్‌లో రుతుజ 6-2, 7-6 (7-5)తో మోనిక్‌ బారీపై గెలిచి భారత్‌కు శుభారంభం అందించింది. రెండో సింగిల్స్‌లో అంకిత రైనా 2-6, 0-6తో లూ సన్‌ చేతిలో చిత్తు కావడంతో స్కోర్లు సమమయ్యాయి. నిర్ణయాత్మక డబుల్స్‌ పోరులో అంకిత-ప్రార్థన ద్వయం 1-6 5-7తో హోరిగాన్‌-ఇరిన్‌ జంట చేతిలో ఓడడంతో భారత్‌కు ఓటమి తప్పలేదు. ఆరు దేశాలు పోటీపడిన గ్రూప్‌-1లో 5 మ్యాచ్‌ల్లో 3 గెలిచి.. రెండింట్లో ఓడిన భారత్‌ మూడో స్థానంలో నిలిచి ప్లేఆఫ్స్‌కు దూరమైంది.


ఆస్ట్రేలియా చేతిలో భారత్‌కు వైట్‌వాష్‌

పెర్త్‌: ఆస్ట్రేలియాతో హాకీ టెస్టు సిరీస్‌లో భారత్‌ 0-5తో చిత్తుగా ఓడింది. శనివారం చివరిదైన అయిదో మ్యాచ్‌లో 2-3 గోల్స్‌తో పరాజయం చవిచూసింది. గత మ్యాచ్‌ల్లో మాదిరే ఈ పోరులోనూ ఆరంభం భారత్‌దే. 4వ నిమిషంలో కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ గోల్‌ కొట్టి ఆధిక్యాన్ని అందించాడు. కానీ ఆ తర్వాత భారత్‌ పట్టు సడలింది. డిఫెన్స్‌లో లోపాలు కనిపించాయి. దీంతో చెలరేగిన ఆస్ట్రేలియా వరుస గోల్స్‌తో ఉక్కిరిబిక్కిరి చేసింది. జేమీ హార్వార్డ్‌ (20వ), విలాట్‌ (38వ), టిమ్‌ బ్రాండ్‌ (39వ) సఫలం కావడంతో 3-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆట చివర్లో బాబీ సింగ్‌ (53వ) గోల్‌ కొట్టినా.. భారత్‌కు ఓటమి తప్పలేదు. పెనాల్టీ కార్నర్లను వృథా చేయడం హర్మన్‌ప్రీత్‌ సేనను ముంచింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని