ప్రపంచకప్‌లో పంత్‌ ఆడతాడు

ఐపీఎల్‌ ముగిసిన తర్వాత ఆరంభమయ్యే టీ20 ప్రపంచకప్‌లో ఆడే భారత జట్టులో వికెట్‌ కీపర్‌ ఎవరు? అనే ప్రశ్న వినిపిస్తోంది. ఈ స్థానం కోసం ప్రధానంగా రిషబ్‌ పంత్‌, సంజు శాంసన్‌, ఇషాన్‌ కిషన్‌ మధ్య పోటీ ఉంది.

Published : 14 Apr 2024 02:22 IST

దిల్లీ: ఐపీఎల్‌ ముగిసిన తర్వాత ఆరంభమయ్యే టీ20 ప్రపంచకప్‌లో ఆడే భారత జట్టులో వికెట్‌ కీపర్‌ ఎవరు? అనే ప్రశ్న వినిపిస్తోంది. ఈ స్థానం కోసం ప్రధానంగా రిషబ్‌ పంత్‌, సంజు శాంసన్‌, ఇషాన్‌ కిషన్‌ మధ్య పోటీ ఉంది. యువ వికెట్‌కీపర్‌ జితేశ్‌ శర్మ కూడా రేసులో ఉన్నాడు. ఈ నేపథ్యంలో వికెట్‌కీపర్‌గా ఆడేది కచ్చితంగా పంత్‌ అని ఆస్ట్రేలియా దిగ్గజం ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌ అభిప్రాయపడ్డాడు. ‘‘ప్రపంచకప్‌లో ఆడే భారత జట్టులో కచ్చితంగా పంత్‌ ఉంటాడని అనుకుంటున్నా. అలాగే శాంసన్‌నూ తీసుకోవచ్చు. కిషన్‌ కూడా రేసులోకి వచ్చేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నాడనడంలో సందేహం లేదు. కానీ పంత్‌ మాత్రం కచ్చితంగా జట్టులోకి వస్తాడని భావిస్తున్నా’’ అని అతనన్నాడు. 2022 ఏడాది చివర్లో రోడ్డు ప్రమాదం కారణంగా ఆటకు దూరమైన పంత్‌.. ఈ ఐపీఎల్‌తోనే పునరాగమనం చేసిన సంగతి తెలిసిందే. 15 నెలల తర్వాత తిరిగి బ్యాట్‌ పట్టిన అతను.. ఒకప్పటిలానే చెలరేగుతున్నాడు. వరుసగా రెండు అర్ధశతకాలు చేయడంతో పాటు లఖ్‌నవూపై 24 బంతుల్లోనే 41 పరుగుల కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. రాజస్థాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌ శాంసన్‌ కూడా మెరుగ్గా ఆడుతున్నాడు. ముంబయి ఇండియన్స్‌ ఆటగాడు ఇషాన్‌ కిషన్‌ ఆ జట్టు తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. పంజాబ్‌ ఆటగాడు జితేశ్‌ మాత్రం అంచనాలను అందుకోలేకపోతున్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని