ధోనీపై ప్రేమ.. మాకెంతో ప్రయోజనం

అభిమానుల నుంచి ధోని పొందుతున్న ప్రేమతో చెన్నై సూపర్‌కింగ్స్‌ ప్రయోజనం పొందుతుందని ఆ జట్టు కోచ్‌ స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ తెలిపాడు. ధోనీకిదే చివరి ఐపీఎల్‌ సీజన్‌ అనే ఊహాగానాల నేపథ్యంలో అతనెక్కడ మ్యాచ్‌ ఆడినా పసుపురంగుతో స్టేడియం నిండిపోతున్న సంగతి తెలిసిందే.

Published : 14 Apr 2024 02:24 IST

ముంబయి: అభిమానుల నుంచి ధోని పొందుతున్న ప్రేమతో చెన్నై సూపర్‌కింగ్స్‌ ప్రయోజనం పొందుతుందని ఆ జట్టు కోచ్‌ స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ తెలిపాడు. ధోనీకిదే చివరి ఐపీఎల్‌ సీజన్‌ అనే ఊహాగానాల నేపథ్యంలో అతనెక్కడ మ్యాచ్‌ ఆడినా పసుపురంగుతో స్టేడియం నిండిపోతున్న సంగతి తెలిసిందే. ‘‘ఇదెంతో అద్భుతమైంది. ధోనీపై అభిమానుల ప్రేమ ఆశ్చర్యపరుస్తోంది. అతనిపై భారత్‌కు ఉన్న ప్రేమతో మేం లబ్ధి పొందుతున్నాం. ప్రత్యర్థి మైదానాల్లోనూ భారీ సంఖ్యలో పసుపు దళం స్టేడియాన్ని నింపేస్తుంటే ఎంతో గర్వంగా అనిపిస్తోంది. హృదయం ఉప్పొంగిపోతోంది. ధోని పట్ల గర్వకారణంగా ఉంది. ప్రజలు అతనికి మద్దతుగా వస్తుండటం ధోనీకి దక్కుతున్న గౌరవానికి నిదర్శనం’’ అని ఫ్లెమింగ్‌ చెప్పాడు. రుతురాజ్‌ను కెప్టెన్‌ చేయాలన్నది ఇప్పటికిప్పుడు తీసుకున్న నిర్ణయం కాదని, దీని వెనుక కొన్నేళ్ల ఆలోచన ఉందని ఫ్లెమింగ్‌ వెల్లడించాడు. రుతురాజ్‌ స్ట్రైక్‌రేట్‌పై వస్తున్న విమర్శలను తిప్పికొట్టిన ఫ్లెమింగ్‌.. అతను కూడా ధోని లాంటి ఆటగాడేనని పేర్కొన్నాడు.

భారత్‌ ఎలా ఆడాలో నిర్ణయించుకోవాలి: మరోవైపు టీ20 ప్రపంచకప్‌కు ఆటగాళ్లను ఎంపిక చేసే ముందే ఆ టోర్నీలో ఎలాంటి శైలి ఆటతీరును ప్రదర్శించాలనే దానిపై భారత్‌ నిర్ణయం తీసుకోవాలని ఫ్లెమింగ్‌ సూచించాడు. ‘‘ప్రపంచకప్‌ సందర్భంగా వాళ్లు (టీమ్‌ఇండియా) ఎలాంటి ప్రణాళికతో ఆడాలని అనుకుంటున్నారన్నది ఇక్కడ ప్రశ్న. విదేశాల్లో తమకు సరైన ఆట విధానాన్ని వాళ్లు గుర్తించారా? అలాంటప్పుడు అందుకు అనుగుణంగా జట్టును ఎంచుకోవాలి. అంతే కానీ ఆటగాళ్లను తీసుకున్న తర్వాత ఆట ప్రణాళికను రూపొందించుకోకూడదు. దూబె శక్తిని ఇష్టపడతా. అలాంటి శక్తి కావాలంటే అతణ్ని కచ్చితంగా ప్రపంచకప్‌ జట్టులోకి తీసుకుంటా’’ అని సమాధానమిచ్చాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని