6 బంతుల్లో సిక్సర్లు

నేపాల్‌ హార్డ్‌ హిట్టర్‌ దీపేంద్ర సింగ్‌ ఐరీ మరోసారి రెచ్చిపోయాడు. ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లతో సత్తాచాటాడు. ఏసీసీ పురుషుల ప్రిమియర్‌ కప్‌ టీ20 అంతర్జాతీయ టోర్నీలో ఖతార్‌తో మ్యాచ్‌లో దీపేంద్ర ఈ ఘనత సాధించాడు.

Updated : 14 Apr 2024 10:13 IST

యువీ, పొలార్డ్‌ సరసన నేపాల్‌ క్రికెటర్‌ దీపేంద్ర

అల్‌ అమెరాత్‌ (ఖతార్‌): నేపాల్‌ హార్డ్‌ హిట్టర్‌ దీపేంద్ర సింగ్‌ ఐరీ మరోసారి రెచ్చిపోయాడు. ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లతో సత్తాచాటాడు. ఏసీసీ పురుషుల ప్రిమియర్‌ కప్‌ టీ20 అంతర్జాతీయ టోర్నీలో ఖతార్‌తో మ్యాచ్‌లో దీపేంద్ర ఈ ఘనత సాధించాడు. కమ్రాన్‌ ఖాన్‌ వేసిన ఇన్నింగ్స్‌ ఆఖరి ఓవర్లో అతను వరుసగా ఆరు బంతులను స్టాండ్స్‌లోకి పంపించాడు. దీంతో అంతర్జాతీయ టీ20ల్లో ఈ రికార్డు సాధించిన మూడో ఆటగాడిగా నిలిచాడు. యువరాజ్‌ సింగ్‌ (2007 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌ పేసర్‌ బ్రాడ్‌ బౌలింగ్‌లో), పొలార్డ్‌ (2021లో శ్రీలంక స్పిన్నర్‌ అఖిల ధనంజయ బౌలింగ్‌లో) ముందున్నారు. ఓవరాల్‌గా అంతర్జాతీయ క్రికెట్లో దీపేంద్ర అయిదో స్థానంలో ఉన్నాడు. వన్డేల్లో గిబ్స్‌ (దక్షిణాఫ్రికా), జస్కరన్‌ (అమెరికా) ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టారు. శనివారం ఈ మ్యాచ్‌లో ఖతార్‌పై నేపాల్‌ 32 పరుగుల తేడాతో గెలిచింది. మొదట నేపాల్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 210 పరుగులు చేసింది. దీపేంద్ర (64 నాటౌట్‌; 21 బంతుల్లో 3×4, 7×6) అర్ధశతకం సాధించాడు. ఛేదనలో ఖతార్‌ 9 వికెట్లకు 178 పరుగులే చేయగలిగింది. దీపేంద్ర రెండు వికెట్లూ తీశాడు. అంతకుముందు ఆసియా క్రీడల్లో మంగోలియాతో టీ20లోనూ రెండు ఓవర్లలో కలిపి దీపేంద్ర వరుసగా ఆరు సిక్సర్లు కొట్టిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్‌లో 314 పరుగులతో నేపాల్‌ ప్రపంచ రికార్డు నెలకొల్పింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని