రాజస్థాన్‌ వదల్లేదు

లక్ష్యం 148. ఐపీఎల్‌లో ఇది లెక్కే కాదు. కానీ శనివారం ముల్లాన్‌పూర్‌లో ఆ కాసింతే కొండంతైంది. ఫోర్లు, సిక్స్‌ల మోత లేకున్నా.. రాజస్థాన్‌, పంజాబ్‌ల మ్యాచ్‌ రసవత్తరంగా సాగి అభిమానులను అలరించింది.

Updated : 14 Apr 2024 06:56 IST

స్వల్ప ఛేదన.. అయినా కష్టంగా
పోరాడి ఓడిన పంజాబ్‌
మెరిసిన కేశవ్‌, హెట్‌మయర్‌

లక్ష్యం 148. ఐపీఎల్‌లో ఇది లెక్కే కాదు. కానీ శనివారం ముల్లాన్‌పూర్‌లో ఆ కాసింతే కొండంతైంది. ఫోర్లు, సిక్స్‌ల మోత లేకున్నా.. రాజస్థాన్‌, పంజాబ్‌ల మ్యాచ్‌ రసవత్తరంగా సాగి అభిమానులను అలరించింది. ఉత్కంఠభరిత పోరులో చివరికి హెట్‌మయర్‌ మెరుపులతో రాయల్స్‌ గట్టెక్కినా.. పంజాబ్‌ పోరాటమూ ఆకట్టుకుంది.

ముల్లాన్‌పూర్‌ (చండీగఢ్‌)

విజయపరంపరకు గత మ్యాచ్‌తో బ్రేక్‌ పడ్డా.. రాజస్థాన్‌ రాయల్స్‌ తిరిగి పుంజుకుంది. శనివారం ఉత్కంఠగా సాగిన స్వల్ప స్కోర్ల మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో పంజాబ్‌ కింగ్స్‌పై గెలిచింది. కేశవ్‌ మహరాజ్‌ (2/23), అవేష్‌ ఖాన్‌ (2/34), బౌల్ట్‌ (1/22) కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో మొదట పంజాబ్‌ 147/8కే పరిమితమైంది. అశుతోష్‌ (31; 16 బంతుల్లో 1×4, 3×6) టాప్‌ స్కోరర్‌. లక్ష్యాన్ని రాజస్థాన్‌ 19.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. యశస్వి జైస్వాల్‌ (39; 28 బంతుల్లో 4×4) టాప్‌ స్కోరర్‌. ఆఖర్లో హెట్‌మయర్‌ (27 నాటౌట్‌; 10 బంతుల్లో 1×4, 3×6) అత్యంత కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు.

చెమటోడ్చిన రాయల్స్‌: బలమైన లైనప్‌ ఉన్న రాజస్థాన్‌.. తేలిగ్గానే పని పూర్తి చేస్తుందని భావించారంతా! కానీ బ్యాటింగ్‌కు కష్టంగా ఉన్న పిచ్‌పై ఛేదనలో ఆ జట్టు చెమటలు కక్కింది. రాయల్స్‌ బ్యాటర్లూ భారీ షాట్లు ఆడలేకపోయారు. ఓపెనర్లు జైస్వాల్‌, తనుష్‌ కొటియాన్‌ (24; 31 బంతుల్లో 3×4) ఎక్కువగా సింగిల్స్‌కే పరిమితమయ్యారు. రబాడ, కరన్‌ కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేశారు. 8 ఓవర్లు పూర్తయ్యేసరికి ఒక్క వికెట్టూ పడలేదు. కానీ స్కోరు 56 పరుగులే. 9వ ఓవర్లో లివింగ్‌స్టన్‌ బౌలింగ్‌లో ఓ భారీ షాట్‌ ఆడబోయి కొటియాన్‌ బౌల్డయ్యాడు. ఆ తర్వాత కూడా జైస్వాల్‌ దూకుడుగా ఆడలేకపోయాడు. ఓ సిక్స్‌, ఫోర్‌ దంచినా సంజు శాంసన్‌ (18; 14 బంతుల్లో 1×4, 1×6) తనదైన శైలిలో బ్యాట్‌ ఝళిపించలేదు. పరుగులు వేగంగా రాకపోవడంతో సాధించాల్సిన రన్‌రేట్‌ పెరుగుతూ పోయింది. రబాడ వరుస ఓవర్లలో జైస్వాల్‌, శాంసన్‌లను ఔట్‌ చేయడంతో మ్యాచ్‌లో ఉత్కంఠ పెరిగింది. పంజాబ్‌ గట్టి పోటీదారుగా మారిపోయింది. రాయల్స్‌ విజయం కోసం చివరి 6 ఓవర్లలో 49 పరుగులు చేయాల్సిన పరిస్థితి. మ్యాచ్‌ పరిస్థితుల్లో అదంత తేలికగా అనిపించలేదు. పరాగ్‌ (23), జురెల్‌ (6) కూడా పరుగుల కోసం చెమటోడ్చారు. చివరికి అర్ష్‌దీప్‌ బౌలింగ్‌లో పరాగ్‌, హర్షల్‌ బౌలింగ్‌లో జురెల్‌ ఔటయ్యారు. చివరి 14 బంతుల్లో రాజస్థాన్‌కు 30 పరుగులు అవసరమయ్యాయి. హెట్‌మయర్‌ వరుసగా 4, 6.. పావెల్‌ వరుసగా రెండు ఫోర్లు కొట్టడంతో నాలుగు బంతుల్లోనే 18 పరుగులు వచ్చాయి. రాయల్స్‌ ఊపిరిపీల్చుకుంది. కానీ కథ అంత తేలికగా ముగియలేదు. 19వ ఓవర్‌ చివరి నాలుగు బంతుల్లో కరన్‌ రెండు పరుగులే ఇచ్చి పావెల్‌, మహరాజ్‌లను ఔట్‌ చేయడంతో ఉత్కంఠ పెరిగింది. ఆఖరి ఓవర్లో రాజస్థాన్‌కు 10 పరుగులు చేయాల్సిన పరిస్థితి. కానీ హెట్‌మయర్‌ క్రీజులో ఉన్నా.. తొలి రెండు బంతుల్లో అర్ష్‌దీప్‌ ఒక్క పరుగూ ఇవ్వలేదు. అంతా టెన్షన్‌ టెన్షన్‌. కానీ పంజాబ్‌ ఆశలపై నీళ్లు చల్లుతూ హెట్‌మయర్‌ వరుసగా 6, 2, 6తో రాయల్స్‌ను విజయపథంలో నడిపించాడు.

పంజాబ్‌ తడబాటు: అంతకుముందు పంజాబ్‌ బ్యాటింగ్‌ పేలవం. ఆ జట్టు క్రమంగా తప్పకుండా వికెట్లు కోల్పోయింది. ఏ దశలోనూ ఇన్నింగ్స్‌ ఊపందుకోలేదు. వచ్చిన బ్యాటర్‌ వచ్చినట్లే నిష్క్రమించడంతో ఒక్క సరైన భాగస్వామ్యం కూడా నమోదుకాలేదు. పరుగులు కష్టంగా వచ్చాయి. ఎప్పుడో కానీ ఒక బౌండరీ రాలేదు. రాజస్థాన్‌ బౌలర్లంతా సూపర్‌గా బౌలింగ్‌ చేశారు. బ్యాటర్లకు స్వేచ్ఛగా బ్యాటింగ్‌ చేసే అవకాశం ఇవ్వలేదు. ముఖ్యంగా పేసర్‌ అవేష్‌ ఖాన్‌, ఎడమచేతి వాటం స్పిన్నర్‌ కేశవ్‌ మహరాజ్‌ బ్యాటర్లకు కళ్లెం వేశారు. ఆఖర్లో అశుతోష్‌ మెరుపుల పుణ్యమా అని పంజాబ్‌ కాస్త గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. నిజానికి ఆ జట్టు ఆరంభం కాస్త ఫర్వాలేదు. అథర్వ రెండు ఫోర్లు, బెయిర్‌స్టో ఒక ఫోర్‌ కొట్టడంతో మూడు ఓవర్లలో 26/0తో నిలిచింది. నాలుగో ఓవర్లో అథర్వను అవేష్‌ ఔట్‌ చేయడంతో ఇన్నింగ్స్‌ గతి తప్పింది. గాయపడ్డ కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌ స్థానంలో జట్టులోకి వచ్చిన అథర్వ (15).. ఓ పుల్‌ షాట్‌ ఆడబోయి క్యాచ్‌ ఔటయ్యాడు. రాయల్స్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో ఆ తర్వాత పంజాబ్‌ ఇన్నింగ్స్‌ చప్పగా సాగింది. ఏ మాత్రం ఊపు లేదు. మందకొడి పిచ్‌పై బ్యాటర్లు షాట్లు ఆడలేకపోయారు. 10 ఓవర్లు ముగిసే సరికి 53/4తో పంజాబ్‌  పేలవ స్థితిలో నిలిచింది. ప్రభ్‌సిమ్రన్‌ (10)ను చాహల్‌ ఔట్‌ చేయగా.. మహరాజ్‌ తన వరుస ఓవర్లలో బెయిర్‌స్టో (15), సామ్‌ కరన్‌ (6)లను పెవిలియన్‌ చేర్చి పంజాబ్‌ను గట్టి దెబ్బతీశాడు. శశాంక్‌ (9) కూడా త్వరగానే వెనుదిరినా.. జితేశ్‌ (29; 24 బంతుల్లో 1×4, 2×6) నిలబడ్డాడు. అయితే మహరాజ్‌ బౌలింగ్‌లో రెండు ఫోర్లు, చాహల్‌ బౌలింగ్‌లో ఓ సిక్స్‌ కొట్టినా.. అతడు ఎక్కువ దూకుడుగా ఆడలేకపోయాడు. ఎదుర్కొన్న తొలి 21 బంతుల్లో 22 పరుగులే చేశాడు. అయితే జితేశ్‌ ఓ సిక్స్‌.. లివింగ్‌స్టన్‌ (21; 14 బంతుల్లో 2×4, 1×6) ఫోర్‌, సిక్స్‌ బాదడంతో 16వ ఓవర్లో (కుల్‌దీప్‌ సేన్‌) 17 పరుగులొచ్చాయి. కానీ తర్వాతి ఓవర్లో అవేష్‌ ఖాన్‌.. జితేశ్‌ను ఔట్‌ చేశాడు. లివింగ్‌స్టన్‌తో ఆరో వికెట్‌కు జితేశ్‌ 33 పరుగులు జోడించాడు. అతడు ఔటయ్యేటప్పటికి స్కోరు 103. లివింగ్‌స్టన్‌ కూడా నిష్క్రమించినా.. అశుతోష్‌ చెలరేగడంతో ఆఖరి మూడు ఓవర్లలో పంజాబ్‌ 36 పరుగులు పిండుకుంది. అతడు చాహల్‌ బౌలింగ్‌లో ఓ సిక్స్‌, అవేష్‌ ఓవర్లో రెండు సిక్స్‌లు, బౌల్ట్‌ ఓవర్లో ఓ ఫోర్‌ కొట్టి ఇన్నింగ్స్‌ ఆఖరి బంతికి వెనుదిరిగాడు. చివరి ఆరు ఓవర్లలో పంజాబ్‌ 72 పరుగులు సాధించింది.

పంజాబ్‌ ఇన్నింగ్స్‌: అథర్వ (సి) సేన్‌ (బి) అవేష్‌ ఖాన్‌ 15; బెయిర్‌స్టో (సి) హెట్‌మయర్‌ (బి) కేశవ్‌ 15; ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (సి) జురెల్‌ (బి) మహరాజ్‌ 6; సామ్‌ కరన్‌ (సి) జురెల్‌ (బి) కేశవ్‌ 6; జితేశ్‌ శర్మ (సి) పరాగ్‌ (బి) అవేష్‌ ఖాన్‌ 29; శశాంక్‌ సింగ్‌ (సి) జురెల్‌ (బి) సేన్‌ 9; లివింగ్‌స్టన్‌ రనౌట్‌ 21; అశుతోష్‌ (సి) కేశవ్‌ (బి) బౌల్ట్‌ 31; హర్‌ప్రీత్‌ బ్రార్‌ నాటౌట్‌ 3; ఎక్స్‌ట్రాలు 8 మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 147 వికెట్ల పతనం: 1-27, 2-41, 3-47, 4-52, 5-70, 6-103, 7-122, 8-147; బౌలింగ్‌: బౌల్ట్‌ 4-0-22-1; కుల్‌దీప్‌ సేన్‌ 4-0-35-1; అవేష్‌ ఖాన్‌ 4-0-34-2; చాహల్‌ 4-0-31-1; కేశవ్‌ మహరాజ్‌ 4-0-23-2

రాజస్థాన్‌ ఇన్నింగ్స్‌: యశస్వి (సి) హర్షల్‌ (బి) రబాడ 39; తనుష్‌ (బి) లివింగ్‌స్టన్‌ 24; శాంసన్‌ ఎల్బీ (బి) రబాడ 18; పరాగ్‌ (సి) రబాడ (బి) అర్ష్‌దీప్‌ 23; జురెల్‌ (సి) శశాంక్‌ (బి) హర్షల్‌ 6; హెట్‌మయర్‌ నాటౌట్‌ 27; రోమన్‌ పావెల్‌ (సి) జితేశ్‌ (బి) కరన్‌ 11; కేశవ్‌ మహరాజ్‌ (సి) లివింగ్‌స్టన్‌ (బి) కరన్‌ 1; బౌల్ట్‌ నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 3 మొత్తం: (19.5 ఓవర్లలో 7 వికెట్లకు) 152 వికెట్ల పతనం: 1-56, 2-82, 3-89, 4-113, 5-115, 6-136, 7-138; బౌలింగ్‌: అర్ష్‌దీప్‌ 3.5-0-45-1; రబాడ 4-0-18-2; సామ్‌ కరన్‌ 4-0-25-2; లివింగ్‌స్టన్‌ 3-0-21-1; హర్షల్‌ 2-0-21-1; హర్‌ప్రీత్‌ 3-0-22-0

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని