ఇదేంటి హార్దిక్‌?.. చెన్నైతో మ్యాచ్‌లో కెప్టెన్సీ, బౌలింగ్‌పై తీవ్ర విమర్శలు

చెన్నైతో మ్యాచ్‌లో ముంబయి కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య కెప్టెన్సీ, బౌలింగ్‌పై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి.

Updated : 15 Apr 2024 07:59 IST

చెన్నైతో మ్యాచ్‌లో ముంబయి కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య కెప్టెన్సీ, బౌలింగ్‌పై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ‘‘చాలా కాలం తర్వాత ఆఖరి ఓవర్లలో నేను చూసిన అత్యంత చెత్త బౌలింగ్‌ ఇదే. సాధారణమైన బౌలింగ్‌, సాధారణమైన కెప్టెన్సీ. సీఎస్కేను 185కే కట్టడి చేయాల్సింది. షెఫర్డ్‌తో రెండు ఓవర్లు ఎందుకు వేయించాల్సి వచ్చింది. దూబె క్రీజులో ఉంటే ఏముంది? స్పిన్నర్‌ బౌలింగ్‌ చేయకూడదా? ఒకే ఓవర్‌ వేసిన శ్రేయస్‌ గోపాల్‌ 9 పరుగులే ఇచ్చాడు’’ అని హార్దిక్‌పై దిగ్గజ ఆటగాడు సునీల్‌ గావస్కర్‌ మండిపడ్డాడు. గత మ్యాచ్‌లో అయిదు వికెట్లతో సత్తాచాటిన బుమ్రాకు నాలుగో ఓవర్లో బంతిని ఇవ్వడంపై గావస్కర్‌ అసహనం వ్యక్తం చేశాడు. మళ్లీ బౌలింగ్‌ చేసేందుకు బుమ్రా మరో నాలుగు ఓవర్లు ఎదురు చూడాల్సి వచ్చింది. తిరిగి ఇన్నింగ్స్‌ 17వ ఓవర్లో బౌలింగ్‌కు వచ్చిన బుమ్రా.. వరుసగా తన రెండు ఓవర్లు వేశాడు. ఈ మ్యాచ్‌లో వికెట్‌ తీయకపోయినా అతను కేవలం 6.75 ఎకానమీ రేటుతో 27 పరుగులే ఇచ్చాడు. నబి 3 ఓవర్లలో 6.33 ఎకానమీతో 19 పరుగులే సమర్పించుకున్నాడు. స్పిన్నర్ల బౌలింగ్‌లో దూబె సిక్సర్లతో రెచ్చిపోతాడని మొత్తం పేసర్లతోనే హార్దిక్‌ బౌలింగ్‌ చేయించాడు. కానీ ఫాస్ట్‌బౌలర్ల బౌలింగ్‌లోనూ అతను బౌండరీలు కొట్టాడు. అలాంటప్పుడు నబితో కానీ లేదా ఒకే ఓవర్‌ వేసి 9 పరుగులిచ్చి ఓ వికెట్‌ తీసిన గోపాల్‌తో కానీ ఎందుకు బౌలింగ్‌ చేయించలేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇక చివరి ఓవర్లో లయ తప్పిన హార్దిక్‌.. ధోని సిక్సర్లు కొడుతుంటే చేష్టలుడిగాడు. గత రెండు మ్యాచ్‌ల్లో ముంబయి గెలవడంతో అభిమానులు హార్దిక్‌ను గేలి చేయడం మానుకుంటారేమో అనిపించింది. కానీ ఈ మ్యాచ్‌లో అతని వైఫల్యంతో ప్రేక్షకులు మరోసారి హార్దిక్‌ను ఎగతాళి చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని