సంక్షిప్త వార్తలు (5)

హిమాచల్‌ప్రదేశ్‌లోని ధర్మశాల స్టేడియంలో నిర్వహించే రెండు ఐపీఎల్‌ మ్యాచ్‌లు హైబ్రిడ్‌ పిచ్‌పై జరగనున్నాయి. మే 5న పంజాబ్‌-చెన్నై, మే 9న పంజాబ్‌-బెంగళూరు మ్యాచ్‌ల్లో ఈ ప్రయోగం చేయనున్నారు.

Published : 16 Apr 2024 03:23 IST

హైబ్రిడ్‌ పిచ్‌పై ఐపీఎల్‌ మ్యాచ్‌లు

ధర్మశాల: హిమాచల్‌ప్రదేశ్‌లోని ధర్మశాల స్టేడియంలో నిర్వహించే రెండు ఐపీఎల్‌ మ్యాచ్‌లు హైబ్రిడ్‌ పిచ్‌పై జరగనున్నాయి. మే 5న పంజాబ్‌-చెన్నై, మే 9న పంజాబ్‌-బెంగళూరు మ్యాచ్‌ల్లో ఈ ప్రయోగం చేయనున్నారు. నెదర్లాండ్స్‌కు చెందిన ‘సిస్‌గ్రాస్‌’ సంస్థ ఈ పిచ్‌లను రూపొందించింది. ఇందుకోసం ‘యూనివర్సల్‌’ అనే యంత్రాన్ని ఉపయోగించింది. అహ్మదాబాద్‌, ముంబయిల్లోనూ ఇలాంటి పిచ్‌లను తయారు చేయనున్నారు. ఇప్పటికే ఇంగ్లాండ్‌లో ఈ సంస్థ హైబ్రిడ్‌ ట్రాక్‌లు తయారు చేసింది. వీటిలో సహజసిద్ధమైన గడ్డితో పాటు అయిదు శాతం పాలిమర్‌ ఫైబర్‌ ఉంటుంది. దీని వల్ల పిచ్‌ ఎక్కువసేపు తాజాగా ఉండడంతో పాటు స్థిరమైన బౌన్స్‌ కలిగి ఉంటుందని సిస్‌గ్రాస్‌ ప్రతినిధి తెలిపాడు. ఈ పిచ్‌లను ఇంగ్లాండ్‌లో టీ20, 50 ఓవర్ల మ్యాచ్‌లకు ఉపయోగిస్తున్నారు. నాలుగురోజుల కౌంటీ మ్యాచ్‌ల్లోనూ వాడుతున్నారు.


భారత జట్టులో ఆశ, సజన

దిల్లీ: బంగ్లాదేశ్‌తో ఏప్రిల్‌ 28న ఆరంభమయ్యే అయిదు టీ20ల సిరీస్‌లో పోటీపడే భారత మహిళల జట్టులో లెగ్‌ స్పిన్నర్‌ ఆశ శోభన, బ్యాటర్‌ సజన సజీవన్‌లకు చోటు దక్కింది. డబ్ల్యూపీఎల్‌ సీజన్‌-2లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు టైటిల్‌ గెలవడంలో ఆశది కీలకపాత్ర. 15.42 సగటుతో ఆమె 10 మ్యాచ్‌ల్లో 12 వికెట్లు పడగొట్టింది. మరోవైపు ముంబయి ఇండియన్స్‌ తరఫున తొలి సీజన్లోనే సజన ఆకట్టుకుంది. ఓ మ్యాచ్‌లో సిక్స్‌తో జట్టును గెలిపించింది. ఇటీవల పుణెలో జరిగిన అంతర్‌ జోనల్‌ టోర్నీ సెమీఫైనల్లో ఆమె 74 పరుగులు చేసింది. ఆర్సీబీ విజయంలో కీలకమైన శ్రేయాంక పాటిల్‌ కూడా భారత జట్టులో స్థానాన్ని దక్కించుకుంది. టీమ్‌ఇండియాకు హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సారథ్యం వహించనుంది.  


హార్దిక్‌ కొత్త కుర్రాడు కాదు: పఠాన్‌

దిల్లీ: ముంబయి ఇండియన్స్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య నాయకత్వ పటిమను భారత మాజీ ఆటగాడు ఇర్ఫాన్‌ పఠాన్‌ ప్రశ్నించాడు. పాండ్య పరిస్థితులకు తగ్గట్లు వ్యూహాలు రచించడంలో విఫలమవడం ముంబయికి తీవ్ర నష్టం చేసిందని పఠాన్‌ విమర్శించాడు. ‘‘ముంబయి జట్టును హార్దిక్‌ సమర్థంగా నిర్వహించాల్సి ఉంది. జట్టు ఓడినప్పుడు పాండ్య పెద్ద పాత్ర పోషించాలి. ఆదివారం ఆకాశ్‌ మధ్వల్‌ చివరి ఓవర్‌ వేయలేదు. అతనికి బాధ్యత అప్పగించాల్సింది. రచిన్‌ రవీంద్ర వికెట్‌ శ్రేయస్‌ గోపాల్‌ తీసినప్పుడు అతనికి మరో ఓవర్‌ ఎందుకు ఇవ్వలేదు? పిచ్‌ కొంచెం నెమ్మదిగా ఉంది. పరిస్థితుల్ని తొందరగా చదవాలి. దురదృష్టవశాత్తు పాండ్య పరిస్థితుల్ని అర్థం చేసుకోలేకపోతున్నాడు. ఒకటికి మించి ప్రణాళికలు కలిగి ఉండాలి. పరిస్థితుల్ని ఆకలింపు చేసుకోవాలి. అతను కొత్త కుర్రాడేమీ కాదు. ఎన్నో ఏళ్లుగా ఆడుతున్నాడు. పాండ్య తన సొంత అనుభవాన్ని, తెలివిని ఉపయోగించలేకపోతే పరాజయాలకు అతనే బాధ్యుడు అవుతాడు. ఇప్పుడు అదే జరుగుతుంది. ప్రస్తుతం మిడిలార్డర్‌ బ్యాటింగ్‌లో శివమ్‌ దూబె అత్యుత్తమంగా కనిపిస్తున్నాడు. టీ20 ప్రపంచకప్‌కు దూబె వెళ్లకపోతే నిరాశ చెందుతా’’ అని పఠాన్‌ పేర్కొన్నాడు.


దూబె భయపెడుతున్నాడు..

ముంబయి: చెన్నై సూపర్‌కింగ్స్‌ ఆల్‌రౌండర్‌ శివమ్‌ దూబెకు స్పిన్‌ బౌలింగ్‌ చేయడానికి జట్లు భయపడుతున్నాయని ఆ జట్టు బౌలింగ్‌ కోచ్‌ ఎరిక్‌ సిమన్స్‌ అన్నాడు. ఆదివారం చెన్నైతో మ్యాచ్‌లో ముంబయి ఏడుగురు బౌలర్లను ఉపయోగించింది. కానీ ఎనిమిదో ఓవర్‌ తర్వాత స్పిన్నర్లతో బౌలింగ్‌ చేయించలేదు. స్పిన్నర్‌ నుంచి దూబె ఒక్క బంతిని ఎదుర్కొన్నాడు. ‘‘దూబె రాగానే స్పిన్నర్లను బౌలింగ్‌ నుంచి తప్పించారు. పేసర్లతోనే బౌలింగ్‌ చేయించారు. మ్యాచ్‌లో మళ్లీ స్పిన్నర్లతో బౌలింగ్‌ చేయించలేదు. దూబె క్రీజులో ఉండడమే అందుకు కారణం. దూబె లాంటి ఆటగాడు మ్యాచ్‌ను నియంత్రించగలడు. ఎందుకంటే వాళ్లు అతడికి ఇంకెంతమాత్రమూ స్పిన్‌ బౌలింగ్‌ చేయలేరు. చేయాలనుకోవట్లేదు కూడా. దూబెకు స్పిన్నర్లతో బౌలింగ్‌ చేయించడానికి భయపడుతున్నారు. పేస్‌ బౌలింగ్‌లో బాగా ఆడగల సామర్థ్యం దూబెకు పెద్ద ఆస్తి’’ అని సిమన్స్‌ చెప్పాడు.


ఇప్పటికి అర్థమైంది: పరాగ్‌

కోల్‌కతా: చాలా ఏళ్లుగా ఐపీఎల్‌ ఆడుతున్నా.. రాజస్థాన్‌ ఆటగాడు రియాన్‌ పరాగ్‌ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఈ సీజన్‌ కంటే ముందు 54 మ్యాచ్‌ల్లో కేవలం 600 పరుగులు చేశాడు. ఈ క్రమంలో సోషల్‌ మీడియాలో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నాడు. కానీ ఈ సీజన్‌లో మాత్రం అతడి ఆట పూర్తిగా మారిపోయింది. పరాగ్‌ 2.0 ఇప్పటికే 284 పరుగులు చేశాడు. టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో కోహ్లి తర్వాత రెండో ఉన్నాడు. మంచి ఇన్నింగ్స్‌లు ఆడుతున్నా.. పరాగ్‌ సంబరాలేమీ చేసుకోవట్లేదు. బ్యాటుతోనే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు కళ్లన్నీ అతడిపైనే. మంగళవారం కోల్‌కతాతో మ్యాచ్‌ నేపథ్యంలో పరాగ్‌ స్పందించాడు. క్రికెట్‌ బయటి జీవితంలో ఎలా నడుచుకోవాలో ఎట్టకేలకు అర్థం చేసుకున్నానని చెప్పాడు. ‘‘క్రికెట్‌ వెలుపలి జీవితం ఎంతో ప్రభావం చూపిస్తుంది. క్రికెట్‌ బయటి విషయాల్లో ఎలా వ్యవహరించాలో తెలుసుకున్నా. అదే నా కెరీర్‌లో కీలకం’’ అని పరాగ్‌ చెప్పాడు. ‘‘నా ఆరంభం బాగాలేదు. చాలా విషయాలను మనసు మీదికి తీసుకున్నా. కానీ తర్వాత నాకు కావాల్సిందేంటో అర్థం చేసుకున్నా, ఎవరి అభిప్రాయాలు నాకు అవసరమో తెలుసుకున్నా. అది నాకు ఉపయోగపడింది’’ అని పరాగ్‌ చెప్పాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని