నది నుంచి స్టేడియంలోకి!

ఒలింపిక్స్‌ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను స్టేడియంలో కాకుండా ఆరుబయట నిర్వహించేందుకు పారిస్‌ సన్నద్ధమవుతోంది. ఫ్రాన్స్‌ నగరంలో ప్రవహించే సెన్‌ నది ఈ ప్రారంభోత్సవ వేడుకలకు వేదిక కానుంది.

Published : 16 Apr 2024 03:25 IST

అవసరమైతే ఒలింపిక్స్‌ ఆరంభ వేడుకల వేదిక మార్పు

పారిస్‌: ఒలింపిక్స్‌ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను స్టేడియంలో కాకుండా ఆరుబయట నిర్వహించేందుకు పారిస్‌ సన్నద్ధమవుతోంది. ఫ్రాన్స్‌ నగరంలో ప్రవహించే సెన్‌ నది ఈ ప్రారంభోత్సవ వేడుకలకు వేదిక కానుంది. కానీ భద్రతా కారణాల దృష్ట్యా అవసరమైతే ఈ వేదికను మారుస్తామని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మేక్రాన్‌ పేర్కొన్నారు. తీవ్రమైన భద్రత హెచ్చరికలు వస్తే స్టాడ్‌ డి ఫ్రాన్స్‌ జాతీయ స్టేడియంలో ఈ వేడుకలను నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని నదిలోనే నిర్వహించేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. నదిలో 6 కిలోమీటర్ల దూరం పాటు సుమారు 10,500 మంది అథ్లెట్లు పడవల్లో పరేడ్‌ నిర్వహించనున్నారు. నదికి రెండు వైపుల ఉండి జులై 26న జరిగే ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు మొదట 6 లక్షల మంది ప్రజలను అనుమతించాలని అనుకున్నారు. భద్రత కారణాలతో దీన్ని 3 లక్షలకు పరిమితం చేశారు.

ఉదా రంగులో ట్రాక్‌: పరుగు పోటీల కోసం ఉపయోగించే ట్రాక్‌ సాధారణంగా ఇటుక ఎరుపు రంగులో ఉంటుంది. కానీ పారిస్‌ ఒలింపిక్స్‌లో మాత్రం ట్రాక్‌ను ఉదా రంగులో ఏర్పాటు చేస్తున్నారు. ఈ రంగు ట్రాక్‌ నిర్మించడం ఇదే తొలిసారి. ట్రాక్‌ విభాగాల్లో పోటీలకు వేదికైన జాతీయ స్టేడియం స్టాడ్‌ డి ఫ్రాన్స్‌లో ఈ ఉదా రంగు ట్రాక్‌ను ఏర్పాటు చేస్తున్నారు. గత ఒలింపిక్స్‌లో ట్రాక్‌ విభాగాల్లో మూడు ప్రపంచ, 12 ఒలింపిక్‌ రికార్డులు బద్దలయ్యాయి. ఈ సారి ఆ సంఖ్య పెరిగే ఆస్కారముంది.  

జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం నేడు: ఒలింపిక్స్‌ పుట్టిల్లుగా భావించే గ్రీస్‌లోని ఒలింపియాలో మంగళవారం పారిస్‌ ఒలింపిక్స్‌ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం నిర్వహించనున్నారు. దీన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక 100 రోజుల కౌంట్‌డౌన్‌కు కూడా పారిస్‌ సిద్ధమవుతోంది. బుధవారం నుంచి క్రీడల ఆరంభోత్సవానికి 100 రోజుల సమయం ఉంది. ఈ క్రీడల నిర్వహణ కోసం ఫ్రాన్స్‌ దాదాపు రూ.79,897 కోట్లు ఖర్చు చేస్తోంది. గత మూడు ఒలింపిక్స్‌ (టోక్యో, రియో, లండన్‌) కంటే ఇదే తక్కువ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని