ఒత్తిడికి చిత్తవుతున్నాడా?

హార్దిక్‌ పాండ్య.. ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన ఆల్‌రౌండర్లలో ఒకడు. ముంబయి ఇండియన్స్‌ ఒకప్పుడు టైటిళ్ల మీద టైటిళ్లు గెలవడంలో అతడి పాత్ర కీలకం. ఇక రెండేళ్ల ముందు కెప్టెన్‌గా కూడా ఐపీఎల్‌పై తనదైన ముద్ర వేశాడీ బరోడా ఆటగాడు.

Updated : 16 Apr 2024 07:14 IST

ఈనాడు క్రీడావిభాగం

హార్దిక్‌ పాండ్య.. ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన ఆల్‌రౌండర్లలో ఒకడు. ముంబయి ఇండియన్స్‌ ఒకప్పుడు టైటిళ్ల మీద టైటిళ్లు గెలవడంలో అతడి పాత్ర కీలకం. ఇక రెండేళ్ల ముందు కెప్టెన్‌గా కూడా ఐపీఎల్‌పై తనదైన ముద్ర వేశాడీ బరోడా ఆటగాడు. గుజరాత్‌ టైటాన్స్‌ తొలి సీజన్లోనే కప్పు గెలవడం వెనుక సారథిగా హార్దిక్‌ చేసిన కృషేంటో అందరికీ తెలుసు. అలాంటి ఆటగాడు ఇప్పుడు లీగ్‌ చరిత్రలోనే ఏ భారత ఆటగాడూ ఎదుర్కోనంత వ్యతిరేకతను ఎదుర్కొంటున్నాడు. తీవ్ర ఒత్తిడిలో పడి చిత్తయిపోతున్నాడు. ఈ సీజన్లో ముంబయి ఆరు మ్యాచ్‌లాడి నాలుగు ఓడిపోయింది. ఆ జట్టు తడబాటు ఇది తొలిసారేమీ కాదు. ఛాంపియన్‌గా నిలిచిన సీజన్లలో కూడా ఇబ్బంది పడింది. గత కొన్ని సీజన్ల నుంచి ముంబయి ప్రదర్శన ఏమీ బాలేదు. కానీ అప్పుడు రోహిత్‌ ఎదుర్కోని వ్యతిరేకతను, ఒత్తిడిని ఇప్పుడు కెప్టెన్‌గా హార్దిక్‌ ఎదుర్కొంటున్నాడు. ఈ సీజన్‌కు ముంబయి యాజమాన్యం రోహిత్‌ను తప్పించి తనను కెప్టెన్‌ను చేయడంతోనే హార్దిక్‌ అభిమానుల పాలిట పెద్ద విలన్‌ అయిపోయాడు. సీజన్‌ ఆరంభం నుంచి వరుసగా ప్రతి మ్యాచ్‌లోనూ స్టేడియాల్లో అతడికి హేళనలు తప్పలేదు. హ్యాట్రిక్‌ ఓటముల తర్వాత వరుసగా రెండు విజయాలు సాధించడంతో ముంబయి కుదురుకున్నట్లే కనిపించింది. దీంతో పాటే హార్దిక్‌ను ఎగతాళి చేయడమూ తగ్గించారు ముంబయి అభిమానులు. ఇక అంతా సర్దుకుందని అనుకుంటుండగా.. చెన్నైతో మ్యాచ్‌తో కథ మళ్లీ మొదటికి వచ్చింది. ఈ మ్యాచ్‌లో హార్దిక్‌ ఆటగాడిగా, కెప్టెన్‌గా ఘోరంగా విఫలమయ్యాడు. పొదుపుగా బౌలింగ్‌ చేస్తున్న శ్రేయస్‌ గోపాల్‌ను పక్కన పెట్టి రొమారియో షెఫర్డ్‌తో ఓవర్లు వేయించడం పట్ల దిగ్గజ ఆటగాడు సునీల్‌ గవాస్కర్‌ మండిపడ్డాడు. అలాగే చివరి ఓవర్‌ను హార్దికే వేయడం.. ధోనికి పేలవమైన బంతులేసి వరుసగా మూడు సిక్సర్లు సమర్పించుకోవడంతో అతడిపై తీవ్ర విమర్శలు తప్పలేదు. తన బౌలింగ్‌ అంత ప్రభావవంతంగా లేకపోయినా చివరి ఓవర్‌ వేసి ధారాళంగా పరుగులిచ్చుకున్నాడు హార్దిక్‌. చివరికి ఆ పరుగులే ఓటమి అంతరంగా మారాయి. బౌలింగ్‌లో చేసిన తప్పును బ్యాటింగ్‌తో అయినా దిద్దుకున్నాడా అంటే అదీ లేదు. సాధించాల్సిన రన్‌రేట్‌ 15గా ఉన్న సమయంలో 6 బంతులాడి 2 పరుగులే చేసి వెనుదిరిగాడు. దీంతో అభిమానులతో పాటు విమర్శకులకూ లక్ష్యంగా మారిపోయాడు హార్దిక్‌. కెప్టెన్సీ మార్పుతో అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత అతడి మీద తీవ్ర ప్రభావమే చూపిస్తున్నట్లుంది. ఈ మార్పు వల్ల ముంబయి జట్టు వాతావరణమే దెబ్బ తిన్నట్లు కనిపిస్తోంది. సహచరులతో హార్దిక్‌కు సమన్వయం కనిపించట్లేదు. మైదానంలో అతను సహజంగా ఉండలేకపోతున్నాడు. ఎప్పుడూ ప్రశాంతంగా పని చేసుకుపోయే హార్దిక్‌ హడావుడిగా కనిపిస్తున్నాడు. ముఖంలో ఒత్తిడి స్పష్టంగా కనిపిస్తోంది. కెప్టెన్సీ వివాదం హార్దిక్‌ వ్యక్తిగత ప్రదర్శన మీద తీవ్ర ప్రభావం చూపుతోందన్నది స్పష్టం. ఇది ముంబయి జట్టునే కుదేలు చేసేలా కనిపిస్తోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే హార్దిక్‌ తనకు తానుగా సారథ్య బాధ్యతలు వదిలేసినా ఆశ్చర్యం లేదు! హార్దిక్‌ త్వరగా ఈ సంక్షోభ స్థితి నుంచి బయటపడి ఫామ్‌ అందుకోకుంటే.. టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టులో స్థానం కూడా ప్రశ్నార్థకంగా మారుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని