ఐపీఎల్‌కు మ్యాక్స్‌వెల్‌ నిరవధిక విరామం

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. పేలవమైన ఫామ్‌లో ఉన్న మ్యాక్స్‌వెల్‌ ఐపీఎల్‌ నుంచి నిరవధిక విరామం తీసుకుంటున్నట్లు ప్రకటించాడు.

Published : 17 Apr 2024 02:55 IST

బెంగళూరు: రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. పేలవమైన ఫామ్‌లో ఉన్న మ్యాక్స్‌వెల్‌ ఐపీఎల్‌ నుంచి నిరవధిక విరామం తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. చేతి వేలికి గాయం కారణంగా సోమవారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మ్యాచ్‌కు మ్యాక్స్‌వెల్‌ అందుబాటులో లేడని మొదట పేర్కొన్నారు. అయితే జట్టు నుంచి తానే తప్పుకొన్నట్లు మ్యాచ్‌ అనంతరం మ్యాక్స్‌వెల్‌ తెలిపాడు. ‘‘నాకిది చాలా తేలికైన నిర్ణయం. ముంబయి ఇండియన్స్‌తో మ్యాచ్‌ తర్వాత కెప్టెన్‌ డుప్లెసిస్‌, కోచ్‌ దగ్గరికి వెళ్లా. నా స్థానంలో మరొకరిని తీసుకునే సమయం వచ్చిందని చెప్పా. మానసికంగా, శారీరకంగా విశ్రాంతి తీసుకుని ఫిట్‌గా మారేందుకు ఇది మంచి సమయం. టోర్నీలో నా అవసరం వస్తే మానసికంగా, శారీరకంగా మరింత బలంగా తిరిగొచ్చి ప్రభావం చూపిస్తా. గతంలోనూ ఇలాంటి పరిస్థితి ఎదుర్కొన్నా. అలా ఆడుతూనే ఉంటే మరింత కిందకి వెళ్లిపోతాం. పవర్‌ ప్లే తర్వాత జట్టులో లోపం కనిపిస్తోంది. బ్యాటుతో జట్టుకు ఉపయోగపడలేకపోతున్నానని అనిపిస్తోంది. బెంగళూరుకు వస్తున్న ఫలితాలు, పాయింట్ల పట్టికలో స్థానం చూశాక మరొకరికి అవకాశం ఇవ్వడానికి ఇదే సరైన సమయమని భావించా’’ అని మ్యాక్స్‌వెల్‌ తెలిపాడు. 2019 అక్టోబరులో కూడా మ్యాక్స్‌వెల్‌ ఇలాంటి విరామమే తీసుకున్నాడు. కొన్ని నెలల తర్వాత పునరాగమనం చేశాడు. ఈ సీజన్‌లో ఆరు మ్యాచ్‌లాడిన మ్యాక్స్‌వెల్‌ 5.33 సగటు, 94 స్ట్రైక్‌రేటుతో 32 పరుగులు మాత్రమే చేశాడు. అందులో 28 పరుగులు ఒక్క మ్యాచ్‌లో చేసినవే. ఆరింట్లో మూడుసార్లు మ్యాక్స్‌వెల్‌ డకౌటయ్యాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని