టీ20 ప్రపంచకప్‌లో.. హార్దిక్‌ బౌలింగ్‌ చేస్తేనే..

రాబోయే టీ20 ప్రపంచకప్‌లో హార్దిక్‌ పాండ్య ఆడతాడా? ఐపీఎల్‌లో ఇప్పటిదాకా ఈ ఆల్‌రౌండర్‌ ప్రదర్శన చూసిన అభిమానుల్లో తలెత్తుతున్న ప్రశ్న ఇదే. కొన్ని నెలల ముందు వరకు అతడి సారథ్యంలోనే టీమ్‌ఇండియా టీ20 ప్రపంచకప్‌ ఆడుతుందని అంతా అనుకున్నారు.

Updated : 17 Apr 2024 04:02 IST

ముంబయి: రాబోయే టీ20 ప్రపంచకప్‌లో హార్దిక్‌ పాండ్య ఆడతాడా? ఐపీఎల్‌లో ఇప్పటిదాకా ఈ ఆల్‌రౌండర్‌ ప్రదర్శన చూసిన అభిమానుల్లో తలెత్తుతున్న ప్రశ్న ఇదే. కొన్ని నెలల ముందు వరకు అతడి సారథ్యంలోనే టీమ్‌ఇండియా టీ20 ప్రపంచకప్‌ ఆడుతుందని అంతా అనుకున్నారు. భారత టీ20 జట్టుకు అతడే సారథిగా వ్యవహరించాడు కూడా. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఆటగాడిగా అతడు జట్టులో ఉంటాడని కచ్చితంగా చెప్పలేని స్థితి నెలకొంది.

గాయంతో చాలా రోజులు ఆటకు దూరంగా ఉన్న హార్దిక్‌.. ఐపీఎల్‌-17తో పునరాగమనం చేశాడు. కానీ ఈ లీగ్‌లో అతడి ప్రదర్శన గొప్పగా ఏమీ లేదు. పైగా రోహిత్‌ స్థానంలో ముంబయి ఇండియన్స్‌ సారథిగా ఎంపికయ్యాక అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న అతడు ఒత్తిడిలో కనిపిస్తున్నాడు. బౌలర్‌గా తన అవసరం ఉన్నప్పుడు కూడా కొన్నిసార్లు బౌలింగ్‌కు దిగలేదు. అవసరం లేని స్థితిలో బంతి అందుకుని నష్టం చేశాడు. గాయం వల్లే అతడు బౌలింగ్‌ చేయట్లేదని మాజీ ఆటగాడు సైమన్‌ డౌల్‌ అనుమానం వ్యక్తం చేశాడు కూడా. చెన్నైతో మ్యాచ్‌లో బౌలింగ్‌కు దిగి దారుణంగా విఫలమయ్యాడు. ధోని దెబ్బకు ఆఖరి ఓవర్లో 3 సిక్స్‌లు ఇచ్చుకుని ఓటమికి ప్రధాన కారణమయ్యాడు. కొత్త బంతితో స్వింగ్‌ రాబట్టడం.. పాత బంతితో కటర్స్‌ వేస్తూ బ్యాటర్లను బోల్తా కొట్టించడం పాండ్య బౌలింగ్‌ ప్రత్యేకత. కానీ అతడు ప్రస్తుతం తాను అనుకున్నట్లుగా బంతులు వేయలేకపోతున్నాడు. ఐపీఎల్‌లో 6 మ్యాచ్‌ల్లో నాలిగింట్లోనే బౌలింగ్‌ చేసిన పాండ్య.. ధారాళంగా పరుగులు ఇచ్చుకున్నాడు. బ్యాటర్‌గానూ విఫలమయ్యాడు. 6 మ్యాచ్‌ల్లో 131 పరుగులే చేశాడు.

దూబె నుంచి పోటీ

ఐపీఎల్‌లో మిగిలిన మ్యాచ్‌ల్లో బౌలర్‌గా సత్తా చాటితేనే హార్దిక్‌ పేరును టీ20 ప్రపంచకప్‌కు పరిగణించే అవకాశముందని సమాచారం. కెప్టెన్‌ రోహిత్‌శర్మ, కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌, సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌ అజిత్‌ అగార్కర్‌ ఇటీవల జట్టు కూర్పుపై సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హార్దిక్‌ భవితవ్యంపై చర్చించినట్లు తెలిసింది. పాండ్య పూర్తి స్థాయిలో తన కోటాను వేయగలిగితే జట్టుకు సమతూకాన్ని తెస్తాడన్నది సెలక్టర్ల ఆలోచన. టీమ్‌ఇండియా కూర్పులో కేవలం బ్యాటర్‌గా హార్దిక్‌ను ఆడించే పరిస్థితి ఉండకపోవచ్చది వారి అభిప్రాయం. వన్డే ప్రపంచకప్‌ మధ్యలోనే హార్దిక్‌ గాయంతో వైదొలగడంతో జట్టు సమతూకం దెబ్బతింది. టీ20 ప్రపంచకప్‌లో ఇలాంటి పరిస్థితి రాకూడదనేది మేనేజ్‌మెంట్‌ ఆలోచన. ఈ సీజన్లో స్థిరంగా రాణిస్తున్న చెన్నై ఆల్‌రౌండర్‌ శివమ్‌ దూబె నుంచి హార్దిక్‌కు గట్టిపోటీ ఎదురు కానుంది. లెఫ్ట్‌హ్యాండర్‌ కావడం.. పేస్‌ బౌలింగ్‌ చేసే సత్తా ఉండడంతో దూబె భిన్నమైన ప్రత్యామ్నాయం కాగలడని సెలక్టర్లు అతడి గురించి కూడా ఆలోచిస్తున్నారు. బంతిని బలంగా బాదే దూబె.. పేస్‌, స్పిన్‌ అని తేడా లేకుండా జోరుగా పరుగులు సాధిస్తున్నాడు. ముఖ్యంగా అతడు క్రీజులో ఉన్నప్పుడు స్పిన్నర్లను దించడానికి ప్రత్యర్థి జట్ల కెప్టెన్లు జంకుతున్నారు. మరి హార్దిక్‌-దూబె ఇద్దరిలో సెలక్టర్ల మొగ్గు ఎవరివైపో అనేది త్వరలో తేలుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని