బాప్‌రే బట్లర్‌.. ఒత్తిడిలో అద్భుత బ్యాటింగ్‌

ఆరు ఓవర్లలో 96 పరుగులు... ఎలాంటి పిచ్‌పైనైనా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఛేదన చాలా చాలా కష్టం. పైగా ఆరు వికెట్లు పోయాయి. కోల్‌కతాతో మ్యాచ్‌లో భారీ లక్ష్య ఛేదనలో పోరాడుతున్న రాజస్థాన్‌ ఓపెనర్‌ బట్లర్‌కు సహకరించే వారూ లేరు.

Updated : 17 Apr 2024 06:48 IST

 ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌ను గెలిపించిన ఓపెనర్‌
కోల్‌కతా పరాజయం
నరైన్‌ శతకం వృథా 

ఆరు ఓవర్లలో 96 పరుగులు... ఎలాంటి పిచ్‌పైనైనా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఛేదన చాలా చాలా కష్టం. పైగా ఆరు వికెట్లు పోయాయి. కోల్‌కతాతో మ్యాచ్‌లో భారీ లక్ష్య ఛేదనలో పోరాడుతున్న రాజస్థాన్‌ ఓపెనర్‌ బట్లర్‌కు సహకరించే వారూ లేరు. కానీ అతడు మాత్రం వదల్లేదు. అప్పటివరకు గెలుపు ఆశల్లో తేలుతున్న కోల్‌కతా ఆటగాళ్లకు చుక్కలు చూపిస్తూ.. రాజస్థాన్‌ను విజయం దిశగా నడిపించాడు. మరోవైపు ఒకరి తర్వాత ఒకరు పెవిలియన్‌ చేరుతున్నా.. ఆశలు అడుగంటుతున్నా.. వీరోచిత శతకంతో కోల్‌కతాను ఒక్కడై ఓడించాడు. నరైన్‌ విధ్వంసక శతకం వృథా అయింది.

కోల్‌కతా

వారెవ్వా బట్లర్‌. అద్భుతంగా బ్యాటింగ్‌ చేసిన అతడు ఉత్కంఠపోరులో దాదాపు ఒంటి చేత్తో రాజస్థాన్‌ రాయల్స్‌కు విజయాన్నందించాడు. బట్లర్‌ (107 నాటౌట్‌; 60 బంతుల్లో 9×4, 6×6) చెలరేగడంతో మంగళవారం రాజస్థాన్‌ 2 వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను ఓడించింది. సునీల్‌ నరైన్‌ (109; 56 బంతుల్లో 13×4, 6×6) విధ్వంసక శతకంతో మొదట కోల్‌కతా 6 వికెట్లకు 223 పరుగులు చేసింది. బట్లర్‌తో పాటు రియాన్‌ పరాగ్‌ (34; 14 బంతుల్లో 4×4, 2×6), పావెల్‌ (26; 13 బంతుల్లో 1×4, 3×6) రాణించడంతో లక్ష్యాన్ని రాజస్థాన్‌ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

తడబడి.. నిలబడి: జైస్వాల్‌ (19; 9 బంతుల్లో 3×4, 1×6) దూకుడుగా ఆరంభించినా త్వరగా నిష్క్రమించాడు. సంజు శాంసన్‌ (12) కూడా నిలవలేదు. కానీ బట్లర్‌, పరాగ్‌ చెలరేగిపోవడంతో 7.4 ఓవర్లలో స్కోరు 97/2. ఛేదనలో రాజస్థాన్‌ పరిస్థితిది. అప్పటికి ఆ జట్టు బలంగా పోటీలో ఉంది. కానీ 50 పరుగుల మూడో వికెట్‌ భాగస్వామ్యం విడిపోయాక ఇన్నింగ్స్‌ గతి తప్పింది. పరాగ్‌ను ఔట్‌ చేయడం ద్వారా ఈ భాగస్వామ్యాన్ని హర్షిత్‌ రాణా విడదీశాడు. ఆ తర్వాత రాయల్స్‌ చాలా వేగంగా మ్యాచ్‌పై పట్టు కోల్పోయింది. క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూ బాగా వెనుకబడిపోయింది. ధ్రువ్‌ జురెల్‌ (2), అశ్విన్‌ (8), హెట్‌మయర్‌ (0) ఇలా వచ్చి అలా పెవిలియన్‌ చేరారు. జురెల్‌ను నరైన్‌ ఔట్‌ చేస్తే.. అశ్విన్‌, హెట్‌మయర్‌లను వరుణ్‌ చక్రవర్తి వరుస బంతుల్లో వెనక్కి పంపాడు. మరోవైపు బట్లర్‌ క్రీజులో ఉన్నా.. అతడి దూకుడు తగ్గింది. 14 ఓవర్లలో రాజస్థాన్‌ స్కోరు 128/6. ఆ జట్టు సాధించాల్సిన రన్‌రేట్‌ 16కు చేరుకున్న స్థితిలో మ్యాచ్‌పై కోల్‌కతా గట్టిగా పట్టుబిగించింది. కానీ బట్లర్‌, పావెల్‌ విధ్వంసంతో మ్యాచ్‌ రవసత్తరంగా మారింది. వీళ్లు ఫోర్లు, సిక్స్‌లతో విరుచుకుపడడంతో 14.1 నుంచి 16.4 ఓవర్ల మధ్య 50 పరుగులు రాబట్టిన రాజస్థాన్‌ మళ్లీ బలంగా పోటీలోకి వచ్చింది. ఆ జట్టులో ఆశలు చిగురించాయి. కానీ జోరుమీదున్న పావెల్‌తో పాటు స్టార్క్‌ వెనుదిరగడంతో చివరి రెండు ఓవర్లలో 28 పరుగులు చేయాల్సిన స్థితిలో నిలిచింది రాజస్థాన్‌. బట్లర్‌ తోడుగా మిగిలింది టెయిలెండర్లే. బట్లర్‌ జోరు కొనసాగిస్తూ రెండు సిక్స్‌లు, ఫోర్‌ బాదడంతో హర్షిత్‌ ఓవర్లో 19 పరుగులొచ్చాయి. ఆఖరి ఓవర్లో (వరుణ్‌) 9 పరుగులు చేయాల్సిన స్థితిలో బట్లర్‌ తొలి బంతికే సిక్స్‌ బాది సెంచరీ పూర్తి చేసుకోవడంతో పాటు రాజస్థాన్‌ విజయానికి మార్గం సుగమం చేశాడు. తర్వాతి మూడు బంతుల్లో పరుగులు రాలేదు. మరో వైపు అవేష్‌ ఖాన్‌ ఉండడంతో సింగిల్స్‌ తీసే అవకాశం వచ్చినా బట్లర్‌ తీయలేదు. దీంతో ఉత్కంఠ పెరిగింది. కానీ తర్వాతి రెండు బంతుల్లో వరుసగా 2, 1 చేసిన బట్లర్‌.. రాయల్స్‌ను గెలిపించాడు.

నరైన్‌.. ధనాధన్‌: కోల్‌కతా ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌ నరైన్‌ ఆటే హైలైట్‌. ఇతర బ్యాటర్లు పెద్దగా మెరవకపోయినా నరైన్‌ విధ్వంసంతో నైట్‌రైడర్స్‌ భారీ స్కోరు చేయగలిగింది. సిక్స్‌లు, ఫోర్లతో అతడు స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. నిజానికి కేకేఆర్‌కు గొప్ప ఆరంభమేమీ లభించలేదు. 4 ఓవర్లలో 26 పరుగులకే ఓపెనర్‌ సాల్ట్‌ (10)ను కోల్పోయింది. అయితే మొదట్లో అంత సాధికారికంగా కనపడని నరైన్‌ మ్యాచ్‌ సాగుతున్నకొద్దీ రెచ్చిపోయాడు. ధనాధన్‌ షాట్లతో రఘువంశీ (30; 18 బంతుల్లో 5×4)తో కలిసి ఇన్నింగ్స్‌ను జోరుగా నడిపించాడు. కుల్‌దీప్‌ సేన్‌ బౌలింగ్‌లో 6, 4 దంచేసిన నరైన్‌.. స్పిన్నర్లనూ శిక్షించాడు. అశ్విన్‌ వేసిన రెండు వేరు వేరు ఓవర్లలో రెండు ఫోర్లు, ఓ సిక్స్‌.. చాహల్‌ ఓవర్లో ఓ సిక్స్‌ బాదాడు. మరోవైపు బౌల్ట్‌ ఓవర్లో రఘువంశీ మూడు ఫోర్లు కొట్టాడు. పది ఓవర్లు పూర్తయ్యేసరికి సరిగ్గా 100 పరుగులతో నిలిచింది కోల్‌కతా. అక్కడి నుంచి నరైన్‌ జోరు పెరిగిందే తప్ప తగ్గలేదు. మరోవైపు రఘువంశీ, శ్రేయస్‌ అయ్యర్‌ (11), రసెల్‌ (13) ఔటైనా.. నరైన్‌ ఆగలేదు. అతను 49 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. నరైన్‌కు కెరీర్‌లో ఇదే తొలి సెంచరీ. 18వ ఓవర్లో బౌల్ట్‌ బౌలింగ్‌లో నరైన్‌ ఔటయ్యాడు. ఆఖర్లో రింకు సింగ్‌ (20 నాటౌట్‌; 9 బంతుల్లో 1×4, 2×6) బ్యాట్‌ ఝళిపించాడు.

బ్రెండన్‌ మెక్‌కలమ్‌ (2008లో 158), వెంకటేశ్‌ అయ్యర్‌ (2023లో 104) కాకుండా కోల్‌కతా తరఫున ఐపీఎల్‌లో శతకం సాధించిన ఘనత నరైన్‌దే. అంతేకాక ఈ టోర్నీలో హ్యాట్రిక్‌, సెంచరీ సాధించిన రోహిత్‌శర్మ (2009), షేన్‌ వాట్సన్‌ (2014) సరసన సునీల్‌ చేరాడు. రికార్డు స్థాయిలో 503 టీ20 మ్యాచ్‌లు ఆడి 500పైన వికెట్లు తీసిన నరైన్‌కు సెంచరీ చేయడం ఇదే తొలిసారి.

కోల్‌కతా ఇన్నింగ్స్‌: ఫిల్‌ సాల్ట్‌ (సి) అండ్‌ (బి) అవేష్‌ ఖాన్‌ 10; సునీల్‌ నరైన్‌ (బి) బౌల్ట్‌ 109; రఘువంశీ (సి) అశ్విన్‌ (బి) సేన్‌ 30; శ్రేయస్‌ అయ్యర్‌ ఎల్బీ (బి) చాహల్‌ 11; రసెల్‌ (సి) జురెల్‌ (బి) అవేష్‌ ఖాన్‌ 13; రింకు సింగ్‌ నాటౌట్‌ 20; వెంకటేశ్‌ అయ్యర్‌ (సి) జురెల్‌ (బి) సేన్‌ 8; రమణ్‌దీప్‌ సింగ్‌ నాటౌట్‌ 1; ఎక్స్‌ట్రాలు 21 మొత్తం: (20 ఓవర్లలో 6 వికెట్లకు) 223; వికెట్ల పతనం: 1-21, 2-106, 3-133, 4-184, 5-195, 6-215; బౌలింగ్‌: బౌల్ట్‌ 4-0-31-1; అవేష్‌ ఖాన్‌ 4-0-35-2; కుల్‌దీప్‌ సేన్‌ 4-0-46-2; చాహల్‌ 4-0-54-1; అశ్విన్‌ 4-0-49-0

రాజస్థాన్‌ ఇన్నింగ్స్‌: యశస్వి (సి) వెంకటేశ్‌ (బి) అరోరా 19; బట్లర్‌ నాటౌట్‌ 107; సంజు (సి) నరైన్‌ (బి) హర్షిత్‌ 12; పరాగ్‌ (సి) రసెల్‌ (బి) హర్షిత్‌ 34; జురెల్‌ ఎల్బీ (బి) నరైన్‌ 2; అశ్విన్‌ (సి) రఘువంశీ (బి) వరుణ్‌ 8; హెట్‌మయర్‌ (సి) శ్రేయస్‌ (బి) వరుణ్‌ 0; రోమన్‌ పావెల్‌ ఎల్బీ (బి) నరైన్‌ 26; బౌల్ట్‌ రనౌట్‌ 0; అవేష్‌ నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 16 మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 224; వికెట్ల పతనం: 1-22, 2-47, 3-97, 4-100, 5-121, 6-121, 7-178, 8-186; బౌలింగ్‌: స్టార్క్‌ 4-0-50-0; వైభవ్‌ అరోరా 3-0-45-1; హర్షిత్‌ రాణా 4-0-45-2; నరైన్‌ 4-0-30-2; వరుణ్‌ చక్రవర్తి 4-0-36-2; రసెల్‌ 1-0-17-0


మళ్లీ విలువ లేకుండా చేశాడు..

పది రోజుల కిందట బెంగళూరుతో రాజస్థాన్‌ మ్యాచ్‌. చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి అద్భుత శతకం (72 బంతుల్లో 113 నాటౌట్‌) సాధించాడు. రాజస్థాన్‌కు 184 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది ఆర్సీబీ. కానీ ఓపెనర్‌ బట్లర్‌.. విరాట్‌ శతకానికి విలువ లేకుండా చేశాడు. ఇన్నింగ్స్‌ చివరి బంతికి సెంచరీ అందుకోవడంతో పాటు జట్టును గెలిపించాడు. మంగళవారం కోల్‌కతా జట్టులోనూ నరైన్‌ మెరుపు శతకం సాధించాడు. కానీ ఈసారి ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా వచ్చిన బట్లర్‌ మరో అజేయ సెంచరీతో జట్టును గెలిపించాడు. నరైన్‌ వందకు విలువ లేకుండా చేశాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని