అత్యంత ప్రభావశీలుర జాబితాలో సాక్షి

టైమ్‌ మ్యాగజైన్‌ 2024 అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో భారత రెజ్లర్‌ సాక్షి మలిక్‌ చోటు దక్కించుకుంది. భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌ సింగ్‌పై పోరాటానికి గాను సాక్షికి ఈ గౌరవం లభించింది.

Published : 18 Apr 2024 08:04 IST

దిల్లీ: టైమ్‌ మ్యాగజైన్‌ 2024 అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో భారత రెజ్లర్‌ సాక్షి మలిక్‌ చోటు దక్కించుకుంది. భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌ సింగ్‌పై పోరాటానికి గాను సాక్షికి ఈ గౌరవం లభించింది. మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించాడనే ఆరోపణలతో అప్పుడు అధ్యక్షుడిగా ఉన్న బ్రిజ్‌భూషణ్‌కు వ్యతిరేకంగా నిరుడు జనవరిలో సాక్షి ఉద్యమం మొదలెట్టిన సంగతి తెలిసిందే. సహచర రెజ్లర్లు వినేశ్‌ ఫొగాట్‌, బజ్‌రంగ్‌ పునియాలతో కలిసి ఈ ఆందోళనను సాక్షి కొనసాగించింది. ఫలితంగా అధ్యక్ష పదవి నుంచి బ్రిజ్‌భూషణ్‌ను తప్పించిన విషయం విదితమే. అతనిపై వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. మరోవైపు నిరుడు డిసెంబర్‌లో జరిగిన డబ్ల్యూఎఫ్‌ఐ ఎన్నికల్లో బ్రిజ్‌భూషణ్‌ సన్నిహితుడైన సంజయ్‌ సింగ్‌ అధ్యక్షుడిగా గెలుపొందడంతో సాక్షి ఆవేదన వ్యక్తం చేస్తూ ఆటకు వీడ్కోలు పలికింది. ‘‘ఈ పోరాటం కేవలం భారత మహిళా రెజ్లర్ల కోసమే కాదు. ఎప్పటికప్పుడు అణచివేతకు గురవుతున్న భారత తనయల కోసం’’ అని సాక్షి తెలిపింది. 2016 ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన సాక్షి.. ఆ ఘనత సాధించిన ఏకైక మహిళా రెజ్లర్‌గా కొనసాగుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని