శీతల్‌ మళ్లీ అదుర్స్‌

భారత సంచలన పారా ఆర్చర్‌ శీతల్‌ దేవి మళ్లీ అదుర్స్‌ అనిపించింది. రెండు చేతులు లేకపోయినా ఆర్చరీలో పతకాల పంట పండిస్తున్న ఈ 17 ఏళ్ల అమ్మాయి.. తాజాగా సాధారణ (అన్ని శరీర భాగాలు సక్రమంగా ఉన్న) ఆర్చర్లతో పోటీపడి మరీ సత్తాచాటింది.

Published : 18 Apr 2024 02:24 IST

దిల్లీ: భారత సంచలన పారా ఆర్చర్‌ శీతల్‌ దేవి మళ్లీ అదుర్స్‌ అనిపించింది. రెండు చేతులు లేకపోయినా ఆర్చరీలో పతకాల పంట పండిస్తున్న ఈ 17 ఏళ్ల అమ్మాయి.. తాజాగా సాధారణ (అన్ని శరీర భాగాలు సక్రమంగా ఉన్న) ఆర్చర్లతో పోటీపడి మరీ సత్తాచాటింది. ఖేలో ఇండియా ఎన్టీపీసీ జాతీయ ర్యాంకింగ్‌ ఆర్చరీ పోటీల్లో శీతల్‌ రజతం గెలిచింది. జూనియర్‌ విభాగం ఫైనల్లో శీతల్‌ 138-140 తేడాతో ఏక్తా రాణి (హరియాణా) చేతిలో ఓడింది. ఈ తుదిపోరులో పరాజయం పాలైనా జమ్ముకశ్మీర్‌కు చెందిన శీతల్‌ మరోసారి అందరి మనసులు గెలుచుకుంది. నిరుడు ఆసియా పారా క్రీడల్లో శీతల్‌ రెండు స్వర్ణాలు, ఓ వెండి పతకం గెలిచిన విషయం విదితమే. ఆమె స్ఫూర్తిదాయక ప్రదర్శనతో అర్జున పురస్కారాన్ని కూడా సొంతం చేసుకుంది. చేతులు లేని ఏకైక అంతర్జాతీయ పారా ఆర్చరీ ఛాంపియన్‌ ఆమెనే. ‘‘అంతర్జాతీయ వేదికలు, ఒలింపిక్స్‌ దిశగా ఈ ఫలితం నాకు కచ్చితంగా ఉపయోగపడుతుంది’’ అని శీతల్‌ పేర్కొంది. ‘‘సాధారణ ఆర్చర్లతో జాతీయ ర్యాంకింగ్‌ టోర్నీలో పోటీపడటంతో ఒలింపిక్స్‌కు ముందు కావాల్సిన సన్నద్ధత శీతల్‌కు దొరుకుతుంది. ఇలాంటి ప్రాక్టీస్‌ కోసం విదేశాలకు వెళ్లాల్సి ఉంది. కానీ ఇప్పుడు ఇక్కడే ఈ టోర్నీతో మంచి సాధన లభించింది’’ అని శీతల్‌ కోచ్‌ అభిలాష తెలిపింది. ఈ పోటీల్లో స్వర్ణం నెగ్గిన ఏక్తాకు రూ.50 వేలు, రజతం గెలిచిన శీతల్‌కు రూ.40 వేల నగదు బహుమతి దక్కింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని