గుజరాత్‌ ఢమాల్‌

ఓవైపు ముంబయి ఇండియన్స్‌ కెప్టెన్‌ అయ్యాక హార్దిక్‌ పాండ్య తేలిపోతున్నాడు. మరోవైపు హార్దిక్‌ సారథ్యంలో గత రెండు సీజన్లలో అద్భుత ప్రదర్శన చేసిన గుజరాత్‌ టైటాన్స్‌.. అతను దూరమయ్యాక ఇబ్బంది పడుతోంది.

Updated : 18 Apr 2024 06:59 IST

సొంతగడ్డపై 89కే ఆలౌట్‌
బౌలర్ల విజృంభణ.. దిల్లీ ఘనవిజయం
అహ్మదాబాద్‌

ఓవైపు ముంబయి ఇండియన్స్‌ కెప్టెన్‌ అయ్యాక హార్దిక్‌ పాండ్య తేలిపోతున్నాడు. మరోవైపు హార్దిక్‌ సారథ్యంలో గత రెండు సీజన్లలో అద్భుత ప్రదర్శన చేసిన గుజరాత్‌ టైటాన్స్‌.. అతను దూరమయ్యాక ఇబ్బంది పడుతోంది. ఈ సీజన్లో ఏడు మ్యాచ్‌లాడిన టైటాన్స్‌.. నాలుగో పరాజయాన్ని ఖాతాలో వేసుకుంది. బ్యాటింగ్‌లో మ్యాచ్‌ మ్యాచ్‌కూ బలహీనపడుతున్న ఆ జట్టు.. బుధవారం సొంతగడ్డపై కేవలం 89 పరుగులకే కుప్పకూలింది. దిల్లీ బౌలర్లు సమష్టిగా విజృంభించి ఆతిథ్య జట్టు పనిపట్టారు. ఏడు మ్యాచ్‌లాడిన దిల్లీకిది మూడో విజయం.

రుగుల వరద పారుతున్న ఐపీఎల్‌-17లో చిన్న బ్రేక్‌. బుధవారం అహ్మదాబాద్‌లో బౌలర్లదే సంబరమంతా. ముఖ్యంగా దిల్లీ క్యాపిటల్స్‌ బౌలర్లు రెచ్చిపోయారు. ఇటు పరుగులూ ఇవ్వక, అటు క్రమంగా వికెట్లూ పడగొడుతూ గుజరాత్‌ బ్యాటర్లకు ముచ్చెమటలు పట్టించారు. బ్యాటింగ్‌లో పూర్తిగా తేలిపోయిన టైటాన్స్‌ 17.3 ఓవర్లలో కేవలం 89 పరుగులకే కుప్పకూలింది. ఇషాంత్‌ శర్మ (2/8), ట్రిస్టియన్‌ స్టబ్స్‌ (2/11), ముకేశ్‌ కుమార్‌ (3/14), ఖలీల్‌ అహ్మద్‌ (1/18) అక్షర్‌ పటేల్‌ (1/17) ఆ జట్టును దెబ్బ తీశారు. ఎనిమిదో స్థానంలో వచ్చిన రషీద్‌ ఖాన్‌ (31; 24 బంతుల్లో 2×4, 1×6) మెరుపులు మెరిపించకుంటే గుజరాత్‌ పరిస్థితి ఇంకా ఘోరంగా ఉండేదే. అనంతరం వేగంగా ఛేదన పూర్తి చేసే క్రమంలో దిల్లీ కూడా వికెట్లు కోల్పోయింది. కానీ లక్ష్యం మరీ చిన్నది కావడంతో ఆ జట్టుకు ఇబ్బంది లేకపోయింది. 67 బంతులుండగా 4 వికెట్లు కోల్పోయి ఆ జట్టు విజయం సాధించింది. టైటాన్స్‌ బౌలర్లలో సందీప్‌ వారియర్‌ 2 వికెట్లు పడగొట్టాడు. రెండు స్టంపింగ్‌లు చేయడంతో పాటు రెండు క్యాచ్‌లు పట్టి.. 16 పరుగులూ చేసిన దిల్లీ కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా ఎంపికయ్యాడు.

పరుగులు.. వికెట్లు: కోల్‌కతాతో మ్యాచ్‌లో 272 పరుగులు సమర్పించుకుని వందకు పైగా తేడాతో ఓడిన నేపథ్యంలో నెట్‌ రన్‌రేట్‌లో బాగా వెనుకబడ్డ దిల్లీ.. దాన్ని సరిచేసుకోవడానికి ఈ మ్యాచ్‌ను బాగానే ఉపయోగించుకుంది. ఛేదనలో ఓవైపు వికెట్లు పడుతున్నా ఆ జట్టు దూకుడు తగ్గించలేదు. తన ఐపీఎల్‌ అరంగేట్ర మ్యాచ్‌లో (లఖ్‌నవూపై) మెరుపు అర్ధశతకంతో జట్టును గెలిపించిన ఆస్ట్రేలియా యువ బ్యాటర్‌ జేక్‌ ఫ్రేజర్‌.. గుజరాత్‌తో పోరులోనూ ఉన్నంతసేపు మెరుపులు మెరిపించాడు. గత మ్యాచ్‌లో మాదిరే ఎదుర్కొన్న తొలి బంతినే ఫ్రేజర్‌ (20; 10 బంతుల్లో 2×4, 2×6) స్టాండ్స్‌లోకి పంపాడు. ఆ తర్వాత కూడా కొన్ని షాట్లు ఆడి స్పెన్సర్‌ జాన్సన్‌ (1/22) బౌలింగ్‌లో వెనుదిరిగాడు. మరో ఓపెనర్‌ పృథ్వీ షా (7) ఎక్కువసేపు క్రీజులో నిలవలేదు. అతణ్ని సందీప్‌ వారియర్‌ ఔట్‌ చేశాడు. ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా వచ్చిన అభిషేక్‌ పోరెల్‌ (15; 7 బంతుల్లో 2×4, 1×6)తో కలిసి షై హోప్‌ (19; 10 బంతుల్లో 1×4, 2×6) ధాటిగా ఆడడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. 65/2తో దిల్లీ విజయానికి చేరువవుతున్న దశలో పోరెల్‌ను సందీప్‌, హోప్‌ను రషీద్‌ స్వల్ప వ్యవధిలో పెవిలియన్‌ చేర్చారు. ఆపై కెప్టెన్‌ పంత్‌ (16 నాటౌట్‌; 11 బంతుల్లో 1×4, 1×6), సుమిత్‌ కుమార్‌ (9 నాటౌట్‌) లాంఛనాన్ని పూర్తి చేశారు.

కట్టిపడేశారు: మొదట దిల్లీ బౌలర్ల ధాటికి గుజరాత్‌ బ్యాటర్ల అవస్థలు అన్నీ ఇన్నీ కావు. పంత్‌ టాస్‌ గెలిచి టైటాన్స్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించగా.. బౌలింగ్‌కు అనుకూలిస్తున్న పరిస్థితులను డీసీ బౌలర్లు పూర్తిగా ఉపయోగించుకున్నారు. కొత్త బంతి బౌలర్లు ఇషాంత్‌ శర్మ, ఖలీల్‌ అహ్మద్‌ బ్యాటర్లకు నిలదొక్కుకునే, షాట్లు ఆడే అవకాశం కూడా ఇవ్వలేదు. రెండు ఫోర్లు కొట్టి ఊపుమీద కనిపించిన కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ (8).. ఇషాంత్‌ బౌలింగ్‌లో షార్ట్‌ కవర్స్‌లో పృథ్వీ షాకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరగడంతో టైటాన్స్‌ పతనం మొదలైంది. మరో ఓపెనర్‌ సాహా (2)ను తన తొలి ఓవర్లో ముకేశ్‌ బౌల్డ్‌ చేశాడు. ఈ సీజన్లో నిలకడగా ఆడుతున్న సాయి సుదర్శన్‌ (12)ను సుమిత్‌ మెరుపు త్రోతో రనౌట్‌ చేశాడు. సీనియర్‌ బ్యాటర్‌ మిల్లర్‌ (2)ను కూడా ఇషాంత్‌ పెవిలియన్‌ చేర్చాడు. మిల్లర్‌ క్యాచ్‌ను పంత్‌ అద్భుత రీతిలో అందుకున్నాడు. దీంతో 5 ఓవర్లకు 30/4తో గుజరాత్‌ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ స్థితిలో ఇన్నింగ్స్‌ను చక్కదిద్దేవారు కరవయ్యారు. తర్వాత స్పిన్నర్ల ప్రతాపం మొదలైంది. ఓ ఎండ్‌లో కుల్‌దీప్‌ బ్యాటర్లను కట్టిపడేస్తుంటే.. మరో ఎండ్‌లో వికెట్ల పతనం సాగింది. ఐపీఎల్‌లో తొలిసారి బౌలింగ్‌ చేసిన పార్ట్‌ టైం స్పిన్నర్‌ ట్రిస్టియన్‌ స్టబ్స్‌ ఒకే ఓవర్లో అభినవ్‌ మనోహర్‌ (8), షారుక్‌ ఖాన్‌ (0)లను ఔట్‌ చేశాడు. వీళ్లిద్దరినీ పంత్‌ మెరుపు వేగంతో స్టంపౌట్‌ చేశాడు. వికెట్ల మీద వికెట్లు పడుతుండడంతో షారుఖ్‌ను ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా పంపినా.. టైటాన్స్‌కు ఉపశమనం లభించలేదు. 50/6తో పతనం దిశగా సాగుతున్న గుజరాత్‌ను రషీద్‌ ఖాన్‌ ఆదుకున్నాడు. అతను కొన్ని షాట్లు ఆడడంతో స్కోరు బోర్డు కాస్త ముందుకు కదిలింది. కానీ మరో ఎండ్‌లో వికెట్ల పతనం ఆగలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎదురుదాడి చేసే తెవాతియా (10)ను అక్షర్‌ పటేల్‌ పెవిలియన్‌కు పంపించాడు. రషీద్‌ పోరాటంతో వంద దాటేలా కనిపించిన టైటాన్స్‌కు.. ముకేశ్‌ 18వ ఓవర్లో 2 వికెట్లతో చెక్‌ పెట్టాడు. 15 బంతులుండగానే ఆ జట్టు ఇన్నింగ్స్‌ ముగిసింది.

గుజరాత్‌ ఇన్నింగ్స్‌: సాహా (బి) ముకేశ్‌ 2; శుభ్‌మన్‌ (సి) పృథ్వీ (బి) ఇషాంత్‌ 8; సుదర్శన్‌ రనౌట్‌ 12; మిల్లర్‌ (సి) పంత్‌ (బి) ఇషాంత్‌ 2; అభినవ్‌ (స్టంప్డ్‌) పంత్‌ (బి) స్టబ్స్‌ 8; తెవాతియా ఎల్బీ (బి) అక్షర్‌ 10; షారుక్‌ ఖాన్‌ (స్టంప్డ్‌) పంత్‌ (బి) స్టబ్స్‌ 0; రషీద్‌ ఖాన్‌ (సి) పంత్‌ (బి) ముకేశ్‌ 31; మోహిత్‌ (సి) సుమిత్‌ (బి) ఖలీల్‌ 2; నూర్‌ అహ్మద్‌ (బి) ముకేశ్‌ 1; స్పెన్సర్‌ జాన్సన్‌ నాటౌట్‌ 1; ఎక్స్‌ట్రాలు 12 మొత్తం: (17.3 ఓవర్లలో ఆలౌట్‌) 89; వికెట్ల పతనం: 1-11, 2-28, 3-28, 4-30, 5-47, 6-48, 7-66, 8-78, 9-88; బౌలింగ్‌: ఖలీల్‌ అహ్మద్‌ 4-1-18-1; ఇషాంత్‌ శర్మ 2-0-8-2; ముకేశ్‌ కుమార్‌ 2.3-0-14-3; కుల్‌దీప్‌ యాదవ్‌ 4-0-16-0; ట్రిస్టియన్‌ స్టబ్స్‌ 1-0-11-2; అక్షర్‌ పటేల్‌ 4-0-17-1

దిల్లీ ఇన్నింగ్స్‌: పృథ్వీ షా (సి) స్పెన్సర్‌ (బి) సందీప్‌ 7; జేక్‌ ఫ్రేజర్‌ (సి) అభినవ్‌ (బి) స్పెన్సర్‌ 20; పోరెల్‌ (బి) సందీప్‌ 15; హోప్‌ (సి) మోహిత్‌ (బి) రషీద్‌ 19; పంత్‌ నాటౌట్‌ 16; సుమిత్‌ నాటౌట్‌ 9; ఎక్స్‌ట్రాలు 6 మొత్తం: (8.5 ఓవర్లలో 4 వికెట్లకు) 92; వికెట్ల పతనం: 1-25, 2-31, 3-65, 4-67; బౌలింగ్‌: సందీప్‌ వారియర్‌ 3-0-40-2; స్పెన్సర్‌ జాన్సన్‌ 2-0-22-1; రషీద్‌ ఖాన్‌ 2-0-12-1; నూర్‌ అహ్మద్‌ 1.5-0-14-0

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని