ఇంపాక్ట్‌ ప్లేయర్‌తో నష్టమే

ఐపీఎల్‌ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్‌ ప్లేయర్‌ విధానం కారణంగా ఆల్‌రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అభిప్రాయపడ్డాడు.

Published : 19 Apr 2024 08:50 IST

దిల్లీ: ఐపీఎల్‌ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్‌ ప్లేయర్‌ విధానం కారణంగా ఆల్‌రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అభిప్రాయపడ్డాడు. ‘‘భారత ఆల్‌రౌండర్ల ఎదుగుదలను ఇది (ఇంపాక్ట్‌ ప్లేయర్‌) వెనక్కి లాగుతోందని నిజంగా భావిస్తున్నా. క్రికెట్‌ అనేది 11 మందితో ఆడేది. 12 మందితో కాదు. ఈ ఇంపాక్ట్‌ ప్లేయర్‌ విధానానికి నేనేమీ అభిమానిని కాదు. కొంతమందికి కాస్త వినోదం అందించడానికి ఆటలో ఇలా చేయడం సరికాదు. దీనికి ఎన్నో ఉదాహరణలున్నాయి. వాషింగ్టన్‌ సుందర్‌, శివమ్‌ దూబె లాంటి ఆల్‌రౌండర్లకు బౌలింగ్‌ చేసే అవకాశం రావడం లేదు. భారత జట్టుకు ఇది మంచిది కాదు. దీని గురించి ఏం చేస్తారో తెలియదు. కానీ ఇది నాకు నచ్చలేదు. 12 మంది ఆటగాళ్లు ఆడటంతో ఆస్వాదిస్తున్నారు. మ్యాచ్‌ గమనాన్ని, పిచ్‌ ప్రవర్తనను బట్టి ఓ ఆటగాడి స్థానంలో మరొకరిని ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా ఆడిస్తున్నారు. వికెట్లు కోల్పోకుండా మొదట బ్యాటింగ్‌ చేస్తే అప్పుడు అదనంగా మరో బౌలర్‌ను చేర్చుకుంటున్నారు. అప్పుడు ఆరేడుగురు బౌలర్లు జట్టులో ఉంటున్నారు. బ్యాటింగ్‌ మెరుగ్గా చేసే జట్లకు అదనపు బ్యాటర్‌ అవసరమే లేకుండా పోతోంది. ఏడెనిమిది స్థానాల్లోని ఆటగాళ్లు బ్యాటింగ్‌కు రావడం గగనమవుతోంది. 2008 నుంచి 2023 వరకు కేవలం రెండు సార్లు మాత్రమే ఓ ఇన్నింగ్స్‌లో 250కి పైగా స్కోర్లు నమోదయ్యాయి. కానీ ఈ సారి ఇప్పటికే నాలుగు సార్లు 250 కంటే ఎక్కువగా పరుగులు జట్లు చేశాయి. ఇంపాక్ట్‌ ప్లేయర్‌ కారణంగా ఏడెనిమిది బ్యాటర్లు ఉంటున్నారు’’ అని ఓ యూట్యూబ్‌ షోలో మాజీ ఆటగాళ్లు మైకెల్‌ వాన్‌, గిల్‌క్రిస్ట్‌తో మాట్లాడుతూ రోహిత్‌ తెలిపాడు. మరోవైపు టీ20 ప్రపంచకప్‌ కోసం టీమ్‌ఇండియా కూర్పుపై ఓ అంచనాకు వచ్చేందుకు ప్రధాన కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌, సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌ అగార్కర్‌ను తాను కలిశానని వస్తున్న వార్తలను రోహిత్‌ కొట్టిపడేశాడు. ‘‘నేనెవరినీ కలవలేదు. అగార్కర్‌ దుబాయ్‌లో గోల్ఫ్‌ ఆడుతున్నాడు. తన తనయుడి క్రికెట్‌ కోసం రాహుల్‌ ముంబయిలో ఉన్నాడు. మేం కలవలేదు. మేం కెమెరా ముందు మాట్లాడకుండా వచ్చే వార్తలన్నీ నకిలీవే’’ అని అతను తెలిపాడు. ఈ సీజన్‌లో ధోని, దినేశ్‌ కార్తీక్‌ గొప్పగా ఆడుతున్నారని, కానీ జట్టులోకి తిరిగొచ్చేలా ధోనీకి నచ్చజెప్పడం కష్టమని రోహిత్‌ అన్నాడు. టీ20 ప్రపంచకప్‌లో ఆతిథ్య దేశాల్లో ఒకటైన అమెరికాకు ధోని వస్తాడు.. కానీ అది గోల్ఫ్‌ ఆడటం కోసమని రోహిత్‌ చెప్పాడు. పంత్‌ ఎంతో సరదాగా ఉంటాడని, ఎప్పుడూ నవ్విస్తుంటాడని హిట్‌మ్యాన్‌ వెల్లడించాడు. ముంబయి ఇండియన్స్‌ కెప్టెన్సీ భారం లేకపోవడంతో కుటుంబంతో ఎక్కువ సమయం గడిపే అవకాశం దొరికిందని రోహిత్‌ అన్నాడు.

పాక్‌తో టెస్టులకు సిద్ధమే: తటస్థ వేదికలో పాకిస్థాన్‌తో టెస్టు సిరీస్‌ ఆడేందుకు ఇష్టపడతానని రోహిత్‌ తెలిపాడు. భారత్‌, పాక్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఈ చిరకాల ప్రత్యర్థుల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు. ఐసీసీ టోర్నీల్లోనే ఈ రెండు జట్లు తలపడుతున్నాయి. చివరగా 2012-13లో ఈ దాయాది జట్లు ద్వైపాక్షిక సిరీస్‌లో ఆడాయి. ఇక టెస్టుల్లో అయితే ఆఖరి సారి 2007-08లో తలపడ్డాయి. ‘‘వాళ్ల (పాకిస్థాన్‌)ది మంచి జట్టు అని నమ్ముతున్నా. మంచి బౌలింగ్‌ లైనప్‌ ఉంది. ఆ జట్టుతో విదేశాల్లో తలపడితే పోరు గొప్పగా ఉంటుంది. ఆ జట్టుతో ఆడటాన్ని ఇష్టపడతా. మేం ఐసీసీ ట్రోఫీల్లోనే పాక్‌తో తలపడుతున్నాం. నాణ్యమైన క్రికెట్‌ పరంగా చూస్తే ఆ జట్టుతో ఆడేందుకు సిద్ధమే’’ అని రోహిత్‌ అన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని