ప్చ్‌.. పంజాబ్‌

13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్‌ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్‌.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్‌ శర్మ అసాధారణ బ్యాటింగ్‌తో పంజాబ్‌ అద్భుతం చేసినంత పని చేసింది.

Updated : 19 Apr 2024 06:44 IST

అశుతోష్‌ అద్భుతంగా పోరాడినా కింగ్స్‌కు దక్కని విజయం
ఉత్కంఠపోరులో ముంబయిదే గెలుపు
విజృంభించిన బుమ్రా, కొయెట్జీ
ముల్లాన్‌పుర్‌

13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్‌ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్‌.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్‌ శర్మ అసాధారణ బ్యాటింగ్‌తో పంజాబ్‌ అద్భుతం చేసినంత పని చేసింది. నమ్మశక్యంతో కాని ఆటతో ప్రేక్షకులను ఉత్తేజితులను చేస్తూ ముంబయికి చెమటలు పట్టించింది. కళ్లు చెదిరే షాట్లతో సిక్సర్ల మోత మోగిస్తోన్న అశుతోష్‌ క్రీజులో ఉండగా.. చివరి నాలుగు ఓవర్లలో 28 పరుగులు చేయాల్సిన స్థితిలో పంజాబ్‌ సంచలన విజయం సాధించేలా కనిపించింది కూడా. కానీ ఆఖర్లో బంతితో పుంజుకున్న ముంబయి హమ్మయ్య అనుకుంది. అయితే విజయం ముంబయిదే అయినా.. తన చిరస్మరణీయ పోరాటంతో పంజాబ్‌ అభిమానుల మనసులను గెలుచుకుంది.

వారెవ్వా ఏం మ్యాచ్‌. ఏకపక్షమనుకున్న పోరు కాస్తా అభిమానులను ఉర్రూతలూగించింది. ఆఖరికి 9 పరుగుల తేడాతో గెలిచి ముంబయి ఇండియన్స్‌ ఊపిరిపీల్చుకుంది. సూర్యకుమార్‌ (78; 53 బంతుల్లో 7×4, 3×6) చెలరేగడంతో గురువారం మొదట ముంబయి 7 వికెట్లకు 192 పరుగులు చేసింది. రోహిత్‌ శర్మ (36; 25 బంతుల్లో 2×4, 3×6), తిలక్‌ వర్మ (34 నాటౌట్‌; 18 బంతుల్లో 2×4, 2×6) రాణించారు. ఛేదనలో పంజాబ్‌ 19.1 ఓవర్లలో 183 పరుగులకు ఆలౌటైంది. బుమ్రా (3/21), కొయెట్జీ (3/32) ఆ జట్టును దెబ్బతీశారు. అశుతోష్‌ శర్మ (61; 28 బంతుల్లో 2×4, 7×6) అద్భుత పోరాటపటిమను ప్రదర్శించాడు. శశాంక్‌ సింగ్‌ (41; 25 బంతుల్లో 2×4, 3×6) రాణించాడు.

అద్భుతం ఆ పోరాటం: 193 పరుగుల లక్ష్యం. మరీ పెద్ద లక్ష్యమేమీ కాదు. కానీ పంజాబ్‌ బ్యాటింగ్‌ ఘోరం! ఎంతగా అంటే.. మూడు ఓవర్లయినా కాకముందే ఆ జట్టు ఓటమి ముంగిట నిలిచింది. బుమ్రా, కొయెట్జీ పేస్‌కు హడలెత్తిన ఆ జట్టు 2.1 ఓవర్లలో 14 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది.  తొలి ఓవర్లో కొయెట్జీ.. ప్రభ్‌సిమ్రన్‌ను ఔట్‌ చేస్తే.. బుమ్రా రెండో ఓవర్లో రొసో (1), సామ్‌ కరన్‌ (6)ను వెనక్కి పంపాడు. కొయెట్జీ తిరిగి ఇన్నింగ్స్‌ మూడో ఓవర్లో హార్డ్‌ హిట్టర్‌ లివింగ్‌స్టన్‌ను రిటర్న్‌ క్యాచ్‌తో వెనక్కి పంపి పంజాబ్‌ను చావు దెబ్బతీశాడు. ఫామ్‌లో ఉన్న శశాంక్‌ సింగ్‌తో పాటు హర్‌ప్రీత్‌ సింగ్‌(13) నిలబడడంతో పవర్‌ప్లే ఆఖరికి 40/4తో నిలిచింది పంజాబ్‌. ఏడో ఓవర్లో హర్‌ప్రీత్‌ను గోపాల్‌ వెనక్కి పంపడంతో 49/5తో పీకల్లోతు కష్టాల్లోకి కూరుకుపోయింది పంజాబ్‌ ఓటమి లాంఛనమేనని అనుకున్నారంతా! జట్టు స్కోరు 77 వద్ద జితేశ్‌ శర్మ కూడా ఔట్‌ కావడంతో జోరుమీదున్న శశాంక్‌కు తోడయ్యాడు అశుతోష్‌. అతడు వస్తూనే సిక్స్‌ల మోత మోగించడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. శశాంక్‌, అశుతోష్‌ విధ్వంసక బ్యాటింగ్‌తో ఒక్కసారిగా ఆటను రసవత్తంగా మార్చారు. జోరు కొనసాగిస్తూ గోపాల్‌ బౌలింగ్‌లో శశాంక్‌ రెండు సిక్స్‌లు బాదాడు. ఏడో వికెట్‌కు 34 పరుగులు జోడించాక శశాంక్‌ ఔటైనా.. హర్‌ప్రీత్‌ బ్రార్‌ (21) సహాయంతో అశుతోష్‌ విధ్వంసాన్ని కొనసాగించడంతో ముంబయికి కంగారు తప్పలేదు. బుమ్రా యార్కర్‌ను స్లాగ్‌ స్వీప్‌తో అశుతోష్‌ సిక్స్‌గా మలిచిన తీరును చూసి తీరాల్సిందే. 16 ఓవర్లలో 165/7తో పంజాబ్‌ గెలుపుపై కన్నేసింది.

అతడి ఔట్‌తో మలుపు..:  ఆఖరి నాలుగు ఓవర్లలో కేవలం 28 పరుగులు చేయాల్సిన స్థితిలో పంజాబ్‌ ఫేవరెట్‌గా మారిపోయింది. కానీ మ్యాచ్‌లో మళ్లీ మలుపు. బుమ్రాను బ్యాటర్లు జాగ్రత్తగా ఆడడంతో 17వ ఓవర్లో మూడు పరుగులే వచ్చాయి. ఆ తర్వాతి ఓవర్‌ (కొయెట్జీ) తొలి బంతికే అశుతోష్‌ ఔట్‌ కావడంతో ముంబయి మళ్లీ పోటీలోకి వచ్చింది. ఆ ఓవర్లో రెండే పరుగులొచ్చాయి. ఉత్కంఠ పెరిగింది. క్రీజులో బ్రార్‌తో పాటు హర్షల్‌ పటేల్‌. 19వ ఓవర్లో 11 పరుగులిచ్చిన హార్దిక్‌.. బ్రార్‌ను ఔట్‌ చేశాడు. చేతిలో ఒక్క వికెట్టే ఉన్న పంజాబ్‌కు ఆఖరి ఓవర్లో 12 పరుగులు అవసరయ్యాయి. తొలి బంతికి మధ్వాల్‌ వైడ్‌ వేశాడు. ఆ తర్వాతి బంతికి రబాడ రనౌట్‌ కావడంతో పంజాబ్‌ ఆశలకు తెరపడింది.  

మెరిసిన సూర్య: ముంబయి ఇన్నింగ్స్‌లో సూర్య బ్యాటింగే హైలైట్‌. ఆఖర్లో తిలక్‌ కూడా విలువైన పరుగులు జోడించాడు. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబయి.. ఇషాన్‌ కిషన్‌ (8) వికెట్‌ను త్వరగానే కోల్పోయింది. మూడో ఓవర్లో రబాడ అతణ్ని ఔట్‌ చేశాడు. అయితే రోహిత్‌, సూర్య ఇన్నింగ్స్‌ను నడిపించారు. అర్ష్‌దీప్‌, సామ్‌ కరన్‌ బౌలింగ్‌లో రోహిత్‌ సిక్స్‌లు బాదాడు. సూర్య కూడా దూకుడైన ఆటతో చకచకా బౌండరీలు కొట్టాడు. పవర్‌ ప్లే ముగిసే సరికి ముంబయి స్కోరు 54/1. ఆ తర్వాత రోహిత్‌ దూకుడు తగ్గినా..  రబాడ, లివింగ్‌స్టన్‌ ఓవర్లలో సూర్య సిక్స్‌లు కొట్టడంతో ముంబయి 10  ఓవర్లలో 86/1తో నిలిచింది. అయితే ఆ జట్టు తర్వాతి నాలుగు ఓవర్లలో రోహిత్‌ వికెట్‌ను కోల్పోయి.. 29 పరుగులు మాత్రమే చేయగలిగింది. రోహిత్‌ను సామ్‌కరన్‌ ఔట్‌ చేశాడు. ఆ దశలో చెలరేగి ఆడిన తిలక్‌ ఇన్నింగ్స్‌కు మళ్లీ ఊపు తెచ్చాడు. అర్ష్‌దీప్‌ ఓవర్లో తిలక్‌ వరుసగా రెండు ఫోర్లు కొట్టాడు. సూర్య వరుసగా 4, 6.. తిలక్‌ ఓ సిక్స్‌ బాదడంతో ఓ ఓవర్లో రబాడ 16 పరుగులు సమర్పించుకున్నాడు. సూర్య మెరుపు ఇన్నింగ్స్‌కు కరన్‌ తెరదించినా.. తిలక్‌తో పాటు టిమ్‌ డేవిడ్‌ (14; 7 బంతుల్లో 2×4, 1×6) కాస్త బ్యాట్‌ ఝళిపించాడు. ఆఖరి ఆరు ఓవర్లలో ముంబయి 77 పరుగులు పిండుకుంది.

స్కోరు వివరాలు

ముంబయి ఇన్నింగ్స్‌: ఇషాన్‌ కిషన్‌ (సి) బ్రార్‌ (బి) రబాడ 8; రోహిత్‌ (సి) బ్రార్‌ (బి) కరన్‌ 36; సూర్యకుమార్‌ (సి) ప్రభ్‌సిమ్రన్‌ (బి) కరన్‌ 78; తిలక్‌ వర్మ నాటౌట్‌ 34; హార్దిక్‌ (సి) బ్రార్‌ (బి) హర్షల్‌ 10; టిమ్‌ డేవిడ్‌ (సి) కరన్‌ (బి) హర్షల్‌ 14; షెఫర్డ్‌ (సి) శశాంక్‌ సింగ్‌ (బి) హర్షల్‌ 1; నబి రనౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 11

మొత్తం: (20 ఓవర్లలో 7 వికెట్లకు) 192;

వికెట్ల పతనం: 1-18, 2-99, 3-148, 4-167, 5-190, 6-192, 7-192;

బౌలింగ్‌: లివింగ్‌స్టన్‌ 2-0-16-0; అర్ష్‌దీప్‌ సింగ్‌ 3-0-35-0; రబాడ 4-0-42-1; హర్షల్‌ పటేల్‌ 4-0-31-3; సామ్‌ కరన్‌ 4-0-41-2; హర్‌ప్రీత్‌ బ్రార్‌ 3-0-21-0

పంజాబ్‌ ఇన్నింగ్స్‌: కరన్‌ (సి) ఇషాన్‌ (బి) బుమ్రా 6; ప్రభ్‌సిమ్రన్‌ (సి) ఇషాన్‌ (బి) కొయెట్జీ 0; రొసౌ (బి) బుమ్రా 1; లివింగ్‌స్టన్‌ (సి) అండ్‌ (బి) కొయెట్జీ 1; హర్‌ప్రీత్‌ సింగ్‌ (సి) అండ్‌ (బి) గోపాల్‌ 13; శశాంక్‌ సింగ్‌ (సి) తిలక్‌ (బి) బుమ్రా 41; జితేశ్‌శర్మ ఎల్బీ (బి) మధ్వాల్‌ 9; అశుతోష్‌ శర్మ (సి) నబి (బి) కొయెట్జీ 61; హర్‌ప్రీత్‌ బ్రార్‌ (సి) నబి (బి) పాండ్య 21; హర్షల్‌ పటేల్‌ నాటౌట్‌ 1; రబాడ రనౌట్‌ 8; ఎక్స్‌ట్రాలు 21

మొత్తం: (19.1 ఓవర్లలో ఆలౌట్‌) 183

వికెట్ల పతనం: 1-10, 2-13, 3-14, 4-14, 5-49, 6-77, 7-111, 8-168, 9-174;

బౌలింగ్‌: కొయెట్జీ 4-0-32-3; బుమ్రా 4-0-21-3; మధ్వాల్‌ 3.1-0-46-1; హార్దిక్‌ పాండ్య 4-0-33-1; శ్రేయస్‌ గోపాల్‌ 2-0-26-1; షెఫర్డ్‌ 2-0-20-0

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని