చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ

ఐపీఎల్‌ జట్టు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.

Published : 20 Apr 2024 02:37 IST

బెంగళూరు: ఐపీఎల్‌ జట్టు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది. నీటి సంక్షోభం తీవ్రంగా ఉన్న బెంగళూరులో మూడు ప్రధాన చెరువుల సంరక్షణకు నడుం బిగించింది. ఫ్రాంఛైజీకి చెందిన ‘‘గో గ్రీన్‌’’ కార్యక్రమంలో భాగంగా ఆర్సీబీ ఈ పనులు చేస్తోంది. ఇట్టగల్పుర, సడెనాహల్లి, కన్నూర్‌ చెరువులను పునరుద్ధరించింది. కావేరి నదీజలాల లభ్యత లేని ఈ మూడు ప్రాంతాలు పూర్తిగా భూగర్భ, చెరువుల్లోని జలాలపైనే ఆధారపడ్డాయి. దీంతో వీటిపై దృష్టి సారించిన ఆర్సీబీ.. ఇట్టగల్పుర, సడెనాహల్లి చెరువలను మరింతగా తవ్వించింది. దీని కారణంగా ఈ చెరువుల వైశాల్యం 17 ఎకరాలకు పెరిగింది. తవ్వించిన ఈ మట్టితో చెరువుల చుట్టూ బాట నిర్మించారు. అలాగే 52 మంది రైతులు ఈ మట్టిని పొలాల్లోనూ చల్లుకున్నారు. మరోవైపు కన్నూరు చెరువు చుట్టూ జీవ వైవిధ్యాన్ని మెరుగుపర్చేందుకు వైద్యంలో ఉపయోగించే మొక్కలు, వెదురు చెట్లు, సీతాకోకచిలుకల పార్కులు ఏర్పాటు చేశారు. ‘‘బెంగళూరులోని ప్రధాన చెరువులను పునరుద్ధరించి స్థానికులకు అండగా ఉండటంపై దృష్టి పెట్టాం. చుట్టుపక్కల గ్రామాలకు ఈ చెరువులు కేవలం భూగర్భ జల వనరులు మాత్రమే కాదు స్థానికులకు ఇవే వెన్నెముక’’ అని ఆర్సీబీ వైస్‌ ప్రెసిడెంట్‌, హెడ్‌ రాజేశ్‌ మీనన్‌ పేర్కొన్నాడు.


గెలిస్తే డబ్బులెందుకు?

జెనీవా: పారిస్‌ ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకాలు గెలిచిన క్రీడాకారులకు నగదు బహుమతి అందించాలన్న ప్రపంచ అథ్లెటిక్స్‌ (డబ్ల్యూఏ) నిర్ణయంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పారిస్‌లో బంగారు పతకాలు నెగ్గే క్రీడాకారుడికి 50,000 అమెరికన్‌ డాలర్లు (సుమారు రూ.41.60 లక్షలు) ఇవ్వనున్నట్లు డబ్ల్యూఏ ఇటీవలే ప్రకటించింది. అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ), క్రీడా సమాఖ్యలు, ప్రభుత్వాలు ప్రైజ్‌మనీ చెల్లించట్లేదన్న కారణంతో డబ్ల్యూఏ అధ్యక్షుడు సెబాస్టియన్‌ కో సరికొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టాడు. అయితే ఈ నిర్ణయంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ‘‘ఈ నిర్ణయం ఒలింపిక్‌ స్ఫూర్తి, విలువల్ని దెబ్బతీస్తుంది’’ అని అసోసియేషన్‌ ఆఫ్‌ సమ్మర్‌ ఒలింపిక్‌ ఇంటర్నేషనల్‌ ఫెడరేషన్స్‌ (ఏఎస్‌ఓఐఎఫ్‌) శుక్రవారం పేర్కొంది.


ఒలింపిక్స్‌లో కృత్రిమ మేధ

లండన్‌: క్రీడల్లో కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికత వాడి అదనపు ప్రయోజనం పొందేందుకు అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ ఏడాది జరిగే పారిస్‌ ఒలింపిక్స్‌లో ఏఐను వాడబోతున్నారు. వర్థమాన అథ్లెట్లను గుర్తించేందుకు, శిక్షణ విధానాలను వ్యక్తిగతీకరించడం, ఆటల్లో విజేతలను నిర్ణయించడంలో మెరుగ్గా వ్యవహరించడం తదితర విషయాల్లో ఏఐ ప్రయోజనాన్ని ఉపయోగించుకోవాలని ఐఓసీ చూస్తోంది. అలాగే అంతర్జాల దూషణల నుంచి అథ్లెట్లను కాపాడటం కోసం, తమ ఇళ్లలో నుంచి ఒలింపిక్స్‌ను చూసే ప్రేక్షకులకు మరింత మెరుగైన ప్రసార అనుభూతిని అందించేందుకు ఏఐని వాడేందుకు ఐఓసీ కసరత్తులు చేస్తోంది. ‘‘ఒలింపిక్స్‌ ప్రత్యేకత, క్రీడల ఔచిత్యాన్ని కొనసాగించేందుకు మేం మరో అడుగు వేస్తున్నాం. అందుకోసం మార్పును తీసుకొస్తున్నాం. ఎంతో సామర్థ్యమున్న ఏఐ సాంకేతికతను బాధ్యతాయుత మార్గంలో వాడేందుకు సిద్ధమయ్యాం’’ అని ఐఓసీ అధ్యక్షుడు థామస్‌ బాక్‌ శుక్రవారం తెలిపాడు. మరోవైపు ఒలింపిక్స్‌ సందర్భంగా భద్రత, వీడియో నిఘా విధానంలో ఏఐతో కూడిన కెమెరాలు వినియోగించాలనే పారిస్‌ నిర్వాహకుల ప్రణాళిక వివాదాస్పదంగా మారింది.


ఒలింపిక్స్‌ సన్నాహాల్లో వెనుకబడ్డాం: జస్పాల్‌ రాణా

దిల్లీ: పారిస్‌ ఒలింపిక్స్‌ సన్నాహాల్లో భారత షూటింగ్‌ జట్టు వెనుకబడిందని దిగ్గజ క్రీడాకారుడు జస్పాల్‌ రాణా అన్నాడు. భారత జట్టు ఎంపికలో ఆలస్యం క్రీడాకారుల తుది దశ సన్నాహాల్ని దెబ్బతీస్తుందని రాణా తెలిపాడు. ‘‘ప్రపంచంలోని మిగతా క్రీడాకారుల శిక్షణ, సన్నాహాలతో పోలిస్తే మనం చాలా దూరంలో ఉన్నాం. బలమైన జట్లు ఇప్పటికే క్రీడాకారులను ఎంపిక చేసి సాధన మొదలుపెట్టాయి. షెడ్యూల్‌ కంటే మనం చాలా వెనకున్నాం. ఒలింపిక్స్‌కు ఎవరు వెళ్తున్నారో ఎవరు వెళ్లట్లేదో ఇప్పటి వరకు తెలియదు. కోటా స్థానాలు గెలుచుకున్న క్రీడాకారులపై ఇది తీవ్ర ఒత్తిడిని తీసుకొస్తుంది. కోటా స్థానాలు నెగ్గని వాళ్లపైనా ఒత్తిడి ఉంటుంది’’ అని రాణా పేర్కొన్నాడు.


ఆకాంక్ష పరాజయం

దిల్లీ: ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ ఆసియా క్వాలిఫయింగ్‌ స్క్వాష్‌ టోర్నీలో ఆకాంక్ష సాలుంఖే పోరాటం ముగిసింది. కౌలాలంపూర్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో శుక్రవారం మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ఫైనల్లో ఆకాంక్ష 6-11, 5-11, 8-11తో సెహవీత్ర కుమార్‌ (మలేసియా) చేతిలో పరాజయం చవిచూసింది. రెండో సీడ్‌గా బరిలో దిగిన ఆకాంక్ష తన కంటే తక్కువ ర్యాంకర్‌ చేతిలో 34 నిమిషాల్లో ఓటమి పాలైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని