కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు

ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు.

Updated : 20 Apr 2024 10:03 IST

ఈనాడు క్రీడా విభాగం

ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. ఒత్తిడిని చిత్తుచేస్తూ బౌండరీల వేటలో సాగుతున్నారు. టాప్‌ఆర్డర్‌లో మెరుపు ఆరంభాలనిస్తూ.. నిలకడగా రాణిస్తూ పరుగుల వరద పారిస్తున్నారు! ఇక బంతి అందుకుంటే చాలు మెరుపు వేగంతో హడలెత్తిస్తారు.. వికెట్లు కూలుస్తారు! వీళ్లంతా ఐపీఎల్‌- 17వ సీజన్‌లో అదరగొడుతున్న కుర్రాళ్లు. ఇంకా అంతర్జాతీయ అరంగేట్రం చేయని ఈ దేశవాళీ ఆటగాళ్లు ఇప్పుడు లీగ్‌లో తమ జట్ల తరపున హీరోలుగా మారుతున్నారు.

అనగనగా ఆ ఇద్దరు

పంజాబ్‌ కింగ్స్‌ అంటే ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటోంది అద్భుతమైన హిట్టింగ్‌ నైపుణ్యాలతో దూసుకెళ్తోన్న అశుతోష్‌ శర్మ, శశాంక్‌ సింగ్‌ గురించే. గురువారం 28 బంతుల్లోనే 61 పరుగులతో ముంబయికి ముచ్చెటమలు పట్టించిన 25 ఏళ్ల అశుతోష్‌కు ఇదే తొలి ఐపీఎల్‌ సీజన్‌. ధనాధన్‌ ఇన్నింగ్స్‌లతో చెలరేగుతున్న ఈ మధ్యప్రదేశ్‌ కుర్రాడు వరుసగా గుజరాత్‌పై 31 (17 బంతుల్లో), సన్‌రైజర్స్‌పై అజేయంగా 33 (15), రాజస్థాన్‌పై 31 (16) పరుగులు చేశాడు. మొత్తంగా 4 మ్యాచ్‌ల్లో 205కు పైగా స్ట్రైక్‌రేట్‌తో 156 పరుగులు సాధించాడు. సిక్సర్ల వీరుడిగా గుర్తింపు తెచ్చుకుంటున్న అశుతోష్‌ 18 టీ20 ఇన్నింగ్స్‌లో 43 సిక్సర్లు కొట్టడం విశేషం. సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టోర్నీలో రైల్వేస్‌ తరపున 11 బంతుల్లోనే అర్ధసెంచరీ చేసిన అతను.. టీ20ల్లో అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన భారత ఆటగాడిగా యువరాజ్‌ (12) రికార్డును బద్దలుకొట్టాడు. మరోవైపు గతేడాది పెద్దగా రాణించని శశాంక్‌ సింగ్‌ ఈ సారి బాదుడును మరోస్థాయికి తీసుకెళ్లాడు. 7 మ్యాచ్‌ల్లో 62.33 సగటుతో 187 పరుగులు చేసిన అతని స్ట్రైక్‌రేట్‌ 179.80గా ఉంది. చత్తీస్‌గఢ్‌కు చెందిన శశాంక్‌ గుజరాత్‌పై 200 పరుగుల ఛేదనలో 29 బంతుల్లోనే అజేయంగా 61 పరుగులు చేసి జట్టుకు సంచలన విజయాన్ని అందించాడు. ఆ తర్వాత సన్‌రైజర్స్‌ (25 బంతుల్లో అజేయంగా 46), ముంబయి (25 బంతుల్లో 41)పైనా రాణించాడు. అయిదారు వికెట్లు కోల్పోయినా ఏం పర్లేదు అని పంజాబ్‌ నమ్మకంతో ఉంటుందంటే అందుకు కారణం శశాంక్‌, అశుతోష్‌. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడే క్రీజులోకి వస్తున్న ఈ ఇద్దరూ తమ బ్యాటింగ్‌తో ఆదుకుంటున్నారు.

కొత్తగా బాదుడు

అతను జట్టులో ఉండటం దండగ.. ఆడించడం వృథా.. ఇవీ గత సీజన్‌వరకూ రాజస్థాన్‌ రాయల్స్‌ ఆటగాడు రియాన్‌ పరాగ్‌పై వచ్చిన విమర్శలు. కానీ ఇప్పుడు ఉత్తమంగా ఆడుతున్నాడంటూ, టీ20 ప్రపంచకప్‌కు ఎంపిక చేయాలంటూ వ్యాఖ్యలు. ఈ సీజన్‌లో పరాగ్‌ సరికొత్తగా కనిపిస్తున్నాడు. 2019 నుంచి 2023 వరకు 54 మ్యాచ్‌ల్లో 600 పరుగులే చేసిన అతను ఈ సీజన్లో ఇప్పటికే 7 మ్యాచ్‌ల్లో 318 పరుగులు సాధించాడు. ఆరెంజ్‌ క్యాప్‌ రేసులో కోహ్లీ (361)కి పోటీనిస్తున్నాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తూ స్థిరంగా పరుగులు సాధిస్తున్నాడు. రాజస్థాన్‌ గెలిచిన ఆరు మ్యాచ్‌ల్లో మూడింట్లో జట్టు విజయాల్లో పరాగ్‌ కీలక పాత్ర పోషించాడు. లఖ్‌నవూపై 43, దిల్లీపై అజేయంగా 84, ముంబయిపై అజేయంగా 54 పరుగులు చేశాడు. పూర్తి ఆత్మవిశ్వాసంతో క్రీజులో సౌకర్యంగా కదులుతూ అలవోకగా సిక్సర్లు రాబడుతున్నాడు.

మనోడు కూడా

ఈ సీజన్‌లో మన తెలుగు క్రికెటర్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డి కూడా ఆకట్టుకుంటున్నాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో 173.33 స్ట్రైక్‌రేట్‌తో 78 పరుగులు చేశాడు. ముఖ్యంగా పంజాబ్‌ కింగ్స్‌తో పోరులో 20 ఏళ్ల ఈ విశాఖ కుర్రాడి బ్యాటింగ్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే. 64/4తో కష్టాల్లో పడ్డ జట్టును అర్ధశతకంతో ఆదుకున్నాడు. 37 బంతుల్లో 64 పరుగులతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతను కొట్టిన అయిదు సిక్సర్లు తన హిట్టింగ్‌ నైపుణ్యాలను చాటాయి. మీడియం పేసర్‌ కూడా అయిన నితీశ్‌ ఆ మ్యాచ్‌లో ఓ వికెట్‌ కూడా పడగొట్టాడు. మరో సన్‌రైజర్స్‌ ఆటగాడు అభిషేక్‌ శర్మ కూడా మెరుపు ఇన్నింగ్స్‌లతో సాగిపోతున్నాడు. ఈ ఓపెనర్‌ 6 ఇన్నింగ్స్‌ల్లో 211 పరుగులు చేశాడు. 197 స్ట్రైక్‌రేట్‌తో మెప్పిస్తున్నాడు. సన్‌రైజర్స్‌ రికార్డు స్కోర్లు చేయడంలో ఇతనిది కీలక పాత్ర. ముంబయిపై 63, ఆర్సీబీపై 34 పరుగులు చేశాడు.

వికెట్ల వేటలో

బుల్లెట్‌ వేగంతో బంతులేసే మయాంక్‌ యాదవ్‌ ఈ సీజన్‌లో హాట్‌ టాపిక్‌గా మారాడు. ఈ లఖ్‌నవూ పేసర్‌ ఐపీఎల్‌ చరిత్రలోనే 155 కిలోమీటర్లకు పైగా వేగంతో ఒకటి కంటే ఎక్కువ బంతులు వేసిన బౌలర్‌గా నిలిచాడు. లీగ్‌లో ఆడిన తొలి రెండు మ్యాచ్‌ల్లోనూ ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డులు అందుకున్న మొదటి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 156.7 కిలోమీటర్ల వేగంతో అతను వేసిన బంతే ఈ సీజన్‌లో అత్యంత వేగవంతమైందిగా నిలిచింది. 3 మ్యాచ్‌ల్లో 6 వికెట్లతో సత్తాచాటిన అతను ప్రస్తుతం కడుపు నొప్పితో జట్టుకు దూరమయ్యాడు. మరోవైపు కోల్‌కతా పేసర్‌ వైభవ్‌ ఆరోరా కూడా నిలకడగా రాణిస్తున్నాడు. 4 మ్యాచ్‌ల్లో 7 వికెట్లు రాబట్టిన అతను బంతిపై గొప్ప నియంత్రణతో రెండు వైపులా స్వింగ్‌ రాబడుతున్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని