కేఎల్‌ రాహుల్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌.. చెన్నైకి చెక్‌

ఏక్‌నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్‌పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్‌లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్‌ ధోని ఈ మ్యాచ్‌లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్‌ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది.

Updated : 20 Apr 2024 06:48 IST

లఖ్‌నవూ ఘనవిజయం
జడేజా, ధోని పోరాటం వృథా

ఏక్‌నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్‌పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్‌లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్‌ ధోని ఈ మ్యాచ్‌లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్‌ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. అవతల పతిరన సహా చెన్నైకి ప్రమాదకర బౌలర్లున్నారు. కాబట్టి లఖ్‌నవూకు కష్టమే అనుకున్నారంతా! కానీ ఎప్పుడూ నెమ్మదిగా ఆడే కేఎల్‌ రాహుల్‌ చెలరేగిపోతే.. ధాటిగా ఆడే డికాక్‌ ఆచితూచి బ్యాటింగ్‌ చేస్తూ సహకారమందించడంతో ఎల్‌ఎస్‌జీకి తిరుగులేకపోయింది. ఒక ఓవర్‌ ఉండగానే రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి అలవోకగా లక్ష్యాన్ని ఛేదించి చెన్నైకి షాకిచ్చింది లఖ్‌నవూ.

లఖ్‌నవూ

పీఎల్‌-17లో రెండు వరుస ఓటముల తర్వాత లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ తిరిగి గెలుపు బాట పట్టింది. సొంతగడ్డపై తన ఆధిపత్యాన్ని చాటుతూ చెన్నై సూపర్‌కింగ్స్‌ను 8 వికెట్ల తేడాతో ఓడించింది. శుక్రవారం కేఎల్‌ రాహుల్‌ (82; 53 బంతుల్లో 9×4, 3×6) కెప్టెన్‌ ఇన్నింగ్స్‌కు డికాక్‌ (54; 43 బంతుల్లో 5×4, 1×6) అర్ధశతకం తోడవడంతో 177 పరుగుల లక్ష్యాన్ని లఖ్‌నవూ సులువుగా ఛేదించింది. మొదట చెన్నై 6 వికెట్లకు 176 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా (57 నాటౌట్‌; 40 బంతుల్లో 5×4, 1×6)) టాప్‌స్కోరర్‌. రహానె (36; 24 బంతుల్లో 5×4, 1×6), మొయిన్‌ అలీ (30; 20 బంతుల్లో 3×6), ధోని (28 నాటౌట్‌; 9 బంతుల్లో 3×4, 2×6) కూడా కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు.

రూటు మార్చిన రాహుల్‌: ఏక్‌నా మైదానంలో 177 అంటే భారీ లక్ష్యమని భావించాడో.. లేక టీ20 ప్రపంచకప్‌ జట్టు ఎంపిక ముంగిట తాను వేగం పెంచాల్సిన అవసరముందని అనుకున్నాడో కానీ.. లఖ్‌నవూ కేఎల్‌ రాహుల్‌ ఈ మ్యాచ్‌లో తన శైలికి భిన్నంగా చెలరేగి ఆడాడు. ఫామ్‌ అందుకోవాలన్న పట్టుదలతో డికాక్‌ దూకుడు తగ్గించి జాగ్రత్తగా ఆడితే.. రాహుల్‌ మాత్రం భారీ షాట్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. దీపక్‌ చాహర్‌ను లక్ష్యంగా చేసుకుని అతను ఫోర్లు, సిక్సర్ల మోత మోగించాడు. ప్రమాదకర పతిరనకు సైతం అప్పర్‌ కట్‌ సిక్స్‌తో అతను స్వాగతం పలికాడు. 32 బంతుల్లోనే రాహుల్‌ అర్ధశతకం పూర్తయింది. కుదురుకున్నాక డికాక్‌ సైతం షాట్లకు దిగాడు. 31 పరుగులపై డికాక్‌.. జడేజా బౌలింగ్‌లో ఇచ్చిన క్యాచ్‌ను పతిరన వదిలేయడం లఖ్‌నవూకు కలిసొచ్చింది. డికాక్‌ 41 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకోగా.. లఖ్‌నవూ 134/0తో తిరుగులేని స్థితిలో నిలిచింది. 5.1 ఓవర్లలో 43 పరుగులే చేయాల్సిన స్థితిలో డికాక్‌ ఔటైనా.. పూరన్‌ (23 నాటౌట్‌; 12 బంతుల్లో 3×4, 1×6)తో కలిసి రాహుల్‌ జట్టును విజయానికి చేరువ చేశాడు. 3 ఓవర్లలో 16 పరుగులే చేయాల్సిన స్థితిలో రాహుల్‌ వెనుదిరిగినా.. స్టాయినిస్‌ (8 నాటౌట్‌)తో కలిసి పూరన్‌ పని పూర్తి చేశాడు.

ఆఖర్లో అదరహో..: మొదట టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన చెన్నైకి సరైన ఆరంభం లభించలేదు. పవర్‌ ప్లేలో రహానె ధాటిగా ఆడినా.. మరో ఎండ్‌లో వికెట్లు పడడంతో సీఎస్కేకు ఇబ్బందులు తప్పలేదు. రహానె ఔటయ్యాక రవీంద్ర జడేజా ఇన్నింగ్స్‌ను నిలబెట్టగా.. చివర్లో మొయిన్‌ అలీ, ధోనిల మెరుపులతో చెన్నై ఊహించని స్కోరు సాధించింది. రచిన్‌ రవీంద్ర (0) వైఫల్యాన్ని కొనసాగిస్తూ మోసిన్‌ బౌలింగ్‌లో బౌల్డయితే.. ఫామ్‌లో ఉన్న కెప్టెన్‌ రుతురాజ్‌ (17) కూడా ఎంతోసేపు నిలవకపోవడంతో చెన్నై ఇన్నింగ్స్‌ పేలవంగా మొదలైంది. తక్కువ వ్యవధిలో రెండు వికెట్లు పడిపోవడంతో జడేజా నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. మరో ఎండ్‌లో రహానె చూడముచ్చటైన షాట్లు ఆడుతూ స్కోరు బోర్డును కదిలించాడు. జడేజా కుదురుకున్నాక షాట్లు ఆడాడు. పవర్‌ప్లే ముగిసేసరికి 51/2తో చెన్నై పుంజుకుంది. కానీ కాసేపటికే రహానెను కృనాల్‌ బౌల్డ్‌ చేయగా.. సూపర్‌ ఫామ్‌లో ఉన్న దూబె (3)ను స్టాయినిస్‌ ఔట్‌ చేశాడు. ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా వచ్చిన రిజ్వి (1) కూడా ఎంతోసేపు నిలవకపోవడంతో చెన్నై 90/5తో మళ్లీ తీవ్ర ఇబ్బందుల్లో పడింది. అయితే అప్పటికే క్రీజులో కుదురుకున్న జడేజా.. మొయిన్‌ అలీతో కలిసి మళ్లీ ఇన్నింగ్స్‌ను గాడిన పెట్టాడు. అయినా 17 ఓవర్లయ్యేసరికి చెన్నై చేసింది 123 పరుగులే. కానీ బిష్ణోయ్‌ బౌలింగ్‌లో వరుసగా మూడు సిక్సర్లు బాదిన మొయిన్‌ ఇన్నింగ్స్‌కు ఊపు తెచ్చాడు. ఆ వెంటనే అతను ఔటైనా.. తర్వాత వచ్చిన ధోని తనదైన శైలిలో చెలరేగిపోవడంతో చెన్నై అనూహ్యంగా 176 పరుగులు చేసింది.

చెన్నై ఇన్నింగ్స్‌: రహానె (బి) కృనాల్‌ 36; రచిన్‌ (బి) మోసిన్‌ 0; రుతురాజ్‌ (సి) రాహుల్‌ (బి) యశ్‌ 17; జడేజా నాటౌట్‌ 57; దూబె (సి) రాహుల్‌ (బి) స్టాయినిస్‌ 3; రిజ్వి (స్టంప్డ్‌) రాహుల్‌ (బి) కృనాల్‌ 1; మొయిన్‌ అలీ (సి) బదోని (బి) రవి బిష్ణోయ్‌ 30; ధోని నాటౌట్‌ 28; ఎక్స్‌ట్రాలు 4 మొత్తం: (20 ఓవర్లలో 6 వికెట్లకు) 176; వికెట్ల పతనం: 1-4, 2-33, 3-68, 4-87, 5-90, 6-141 బౌలింగ్‌: మ్యాట్‌ హెన్రీ 3-0-26-0; మోసిన్‌ ఖాన్‌ 4-0-37-1; యశ్‌ ఠాకూర్‌ 4-0-45-1; కృనాల్‌ పాండ్య 3-0-16-2; రవి బిష్ణోయ్‌ 4-0-44-1; స్టాయినిస్‌ 2-0-7-1

లఖ్‌నవూ ఇన్నింగ్స్‌: డికాక్‌ (సి) ధోని (బి) ముస్తాఫిజుర్‌ 54; రాహుల్‌ (సి) జడేజా (బి) పతిరన 82; పూరన్‌ నాటౌట్‌ 23; స్టాయినిస్‌ నాటౌట్‌ 8; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం: (19 ఓవర్లలో 2 వికెట్లకు) 180; వికెట్ల పతనం: 1-134, 2-161; బౌలింగ్‌: దీపక్‌ చాహర్‌ 3-0-26-0; తుషార్‌ దేశ్‌పాండే 4-0-42-0; ముస్తాఫిజుర్‌ 4-0-43-1; జడేజా 3-0-32-0; పతిరన 4-0-29-1; మొయిన్‌ అలీ 1-0-5-0

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని