సన్‌డేంజర్స్‌

ఇది.. సన్‌రైజర్స్‌ జట్టేనా? బ్యాటింగ్‌లో తడబడుతూ.. బౌలింగ్‌పైనే ఆధారపడుతూ సాగిన జట్టు ఇదేనా? ఈ సీజన్‌లో సన్‌రైజర్స్‌కు ఏమైంది?

Updated : 21 Apr 2024 06:54 IST

ఈనాడు క్రీడావిభాగం

ఇది.. సన్‌రైజర్స్‌ జట్టేనా? బ్యాటింగ్‌లో తడబడుతూ.. బౌలింగ్‌పైనే ఆధారపడుతూ సాగిన జట్టు ఇదేనా? ఈ సీజన్‌లో సన్‌రైజర్స్‌కు ఏమైంది?  ఈ బాదుడేంటీ? ఒక మ్యాచ్‌లో అయితే అన్ని పరిస్థితులు కలిసొచ్చి, అద్భుతమైన బ్యాటింగ్‌తో రికార్డు సృష్టించిందని అనుకోవచ్చు. అదే రికార్డును మరో మ్యాచ్‌లో బద్దలు కొడితే ఔరా అని సంభ్రమాశ్చర్యాలకు లోనవక తప్పదు. కానీ ప్రతి మ్యాచ్‌లోనూ అదే దూకుడు కొనసాగిస్తూ.. ప్రతి ఇన్నింగ్స్‌లోనూ సరికొత్త రికార్డులు సృష్టిస్తుంటే ఏం చెప్పగలం? ఆ బ్యాటింగ్‌ను తనివితీరా చూస్తూ ఆస్వాదించడం తప్ప. ధనాధన్‌ షాట్ల పారవశ్యంలో మునిగిపోవడం తప్ప! టీ20లో 200 పరుగులు చేయడం కూడా ఓ గొప్పేనా అనేలా.. 300 చేరుకోవడమే లక్ష్యమనేలా సన్‌రైజర్స్‌ చెలరేగిపోతోంది. మొదట బ్యాటింగ్‌కు వచ్చిందంటే చాలు విధ్వంసమే. స్టేడియం ఊగిపోవాల్సిందే. చేతులెత్తి ఎత్తి అంపైర్లు అలసిపోవాల్సిందే. నృత్యం చేసి చేసి చీర్‌ లీడర్స్‌ కాళ్లు నొప్పి పుట్టాల్సిందే. మొదటి బంతి నుంచే ఊచకోత. చివరి బంతి వరకూ అదే బౌండరీల మోత. ఓ మోస్తారు స్కోరు చేయడం.. మళ్లీ దాన్ని ప్రత్యర్థి అందుకుంటుందేమో అని కంగారు పడటం.. ఇవన్నీ ఎందుకు? ముందుగానే ప్రత్యర్థికి అందని స్కోరు చేస్తే ఎలాంటి ఆందోళన లేకుండా ఉండొచ్చని అనుకున్నారేమో సన్‌రైజర్స్‌ బ్యాటర్లు శివాలెత్తుతున్నారు. తమ బౌలర్లకు ఒత్తిడి తొలగిస్తున్నారు. సన్‌రైజర్స్‌ను మొదట బ్యాటింగ్‌కు ఆహ్వానించాలంటేనే ప్రత్యర్థి జట్లకు భయం పుట్టేలా.. బౌలింగ్‌ చేయాలంటేనే వణుకు వచ్చేలా బ్యాటర్లు రెచ్చిపోతున్నారు. ఉప్పల్‌లో ఆడుతున్నామా? ప్రత్యర్థి మైదానంలో ఉన్నామా? అనే తేడే లేదు. ఎక్కడైనా ఒకటే వీరవిహారం. హైదరాబాద్‌లో ముంబయిపై 277 పరుగులు చేసి అత్యధిక స్కోరు చేసిన జట్టుగా 11 ఏళ్ల రికార్డును బద్దలుకొట్టిన సన్‌రైజర్స్‌.. బెంగళూరులో సునామీ సృష్టించి ఆర్సీబీపై ఏకంగా 287 పరుగులు చేసింది. ఇప్పుడు దిల్లీలో డీసీపై విరుచుకుపడింది. ఆ ఆరంభం చూస్తే 300 ఏంటీ.. 400 అయినా సాధ్యమే అనిపించింది. ఈ సీజన్‌ ముందు సన్‌రైజర్స్‌ ఒక్క సారి కూడా 231కి పైగా స్కోరు చేయలేదు. కానీ ఈ సీజన్‌లో ఇప్పటికే 3 సార్లు 260 దాటేసింది. దిల్లీపై 266 పరుగులు చేసినా సన్‌రైజర్స్‌ తక్కువ స్కోరే సాధించిందనే మాటలు వినిపిస్తున్నాయి. ఆ జట్టు నెలకొల్పుతున్న బ్యాటింగ్‌ ప్రమాణాలు అలాంటివి మరి.

బాదుడంటే..: జట్టులో ఈ మార్పునకు కారణం ఏంటీ అంటే.. ముందుగా దృక్పథంలో వచ్చిన మార్పు గురించి చెప్పుకోవాలి. ఆస్ట్రేలియాకు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌, వన్డే ప్రపంచకప్‌ టైటిళ్లు అందించిన కమిన్స్‌ ఈ సారి సన్‌రైజర్స్‌ సారథిగా వచ్చాడు. సీజన్‌కు ముందే జట్టు దూకుడుగా ఆడుతుందని కమిన్స్‌ హెచ్చరిక జారీ చేశాడు. జట్టుకున్న బీభత్సమైన బ్యాటింగ్‌ ఆర్డర్‌ మరో కారణం. ఈ సీజన్‌తోనే సన్‌రైజర్స్‌ తరపున తొలిసారి ఆడుతున్న హెడ్‌ మామూలుగా రెచ్చిపోవడం లేదు. భారత యువ ఆటగాడు అభిషేక్‌ శర్మ విధ్వంసం వేరే లెవల్‌. ఈ ఇద్దరు కలిసి జట్టుకు సంచలన ఆరంభాలను అందిస్తూ రికార్డు స్కోరుకు బాటలు వేస్తున్నారు. పవర్‌ప్లేలో బాదడమే ఈ ఓపెనర్ల పని. దిల్లీపై 125 పరుగులతో టీ20 మ్యాచ్‌లో పవర్‌ప్లేలో అత్యధిక స్కోరు చేసిన జట్టుగా సన్‌రైజర్స్‌ ప్రపంచ రికార్డు సృష్టించిందంటే కారణం ఈ ఓపెనింగ్‌ జోడీ. ఇప్పటికే ఓ శతకం చేసిన హెడ్‌ 6 ఇన్నింగ్స్‌లో 216 స్ట్రైక్‌రేట్‌తో 324 పరుగులు చేయడం విశేషం. అభిషేక్‌ శర్మ 215కు పైగా  స్ట్రైక్‌రేట్‌తో 7 ఇన్నింగ్స్‌లో 257 పరుగులు సాధించాడు. వీళ్ల స్ఫూర్తితో ఇతర బ్యాటర్లూ రెచ్చిపోతున్నారు. వీళ్లు అందించిన ఆరంభాన్ని తన ఊచకోతతో క్లాసెన్‌ (7 ఇన్నింగ్స్‌లో 198 స్ట్రైక్‌రేట్‌తో 268) మరోస్థాయికి తీసుకెళ్తున్నాడు. తెలుగు కుర్రాడు నితీశ్‌ రెడ్డి (3 ఇన్నింగ్స్‌లో 159 స్ట్రైక్‌రేట్‌తో 115), షాబాజ్‌ అహ్మద్‌ (5 ఇన్నింగ్స్‌లో 161 స్ట్రైక్‌రేట్‌తో 129) కూడా అలవోకగా భారీ షాట్లు ఆడుతున్నారు. ఇక ఫినిషర్‌గా సమద్‌ (5 ఇన్నింగ్స్‌లో 216 స్ట్రైక్‌రేట్‌తో 119) మెరుపు ముగింపునిస్తున్నాడు. ఇలా ప్రతి ఒక్కరూ తమ పాత్రను సమర్థంగా పోషిస్తున్నారు. 300 కొట్టడం తమ లక్ష్యమని ఈ మ్యాచ్‌కు ముందు హెడ్‌ చెప్పాడు. ఇప్పుడది అందలేకపోయినా ఈ సీజన్‌లో మాత్రం కచ్చితంగా సన్‌రైజర్స్‌ రికార్డు సాధించేలాగే ఉంది. ఇక బౌలర్లంటే భయం లేకుండా, పరిస్థితులంటే బెరుకు లేకుండా ఆడటం మరో ప్రధాన కారణం. టీ20 అంటేనే ఎంటర్‌టైన్మెంట్‌. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్‌ ఆ ఎంటర్‌టైన్మెంట్‌ను మరో స్థాయికి తీసుకెళ్తోంది. టీ20    క్రికెట్‌కు ముఖచిత్రంగా, బాదుడుకు సరికొత్త నిర్వచనంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మారుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని