హద్దుల్లేని విధ్వంసం

 ప్రత్యర్థి మారుతోంది. వేదిక మారుతోంది. ఈసారి ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ధ్వంస రచన మాత్రం ఆగట్లేదు! దీన్ని మించిన బాదుడు ఉండదు అని ఓ మ్యాచ్‌లో అనుకుంటే.. తర్వాతి మ్యాచ్‌కే ఆ అభిప్రాయం తప్పని రుజువు చేస్తున్నారు హైదరాబాద్‌ వీరులు!

Updated : 21 Apr 2024 07:24 IST

 మళ్లీ రెచ్చిపోయిన సన్‌రైజర్స్‌
మరోసారి హెడ్‌ మెరుపులు
దిల్లీకి తప్పని ఓటమి

 ప్రత్యర్థి మారుతోంది. వేదిక మారుతోంది. ఈసారి ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ధ్వంస రచన మాత్రం ఆగట్లేదు! దీన్ని మించిన బాదుడు ఉండదు అని ఓ మ్యాచ్‌లో అనుకుంటే.. తర్వాతి మ్యాచ్‌కే ఆ అభిప్రాయం తప్పని రుజువు చేస్తున్నారు హైదరాబాద్‌ వీరులు! క్రికెట్లో ఎన్నో విధ్వంసాలు చూశాం.. కానీ ఇదేం బాదుడురా బాబూ అని విస్తుపోయేలా..! చూస్తోంది ఐపీఎలా.. గల్లీ క్రికెట్టా.. అసలిది క్రికెట్టేనా అని ఆశ్చర్యపోయేలా..! హైలైట్లు చూస్తున్నా ఈ స్థాయిలో సిక్సర్లు, ఫోర్ల వర్షం కురవదు కదా అనిపించేలా.. ఆరెంజ్‌ ఆర్మీ రెచ్చిపోతూనే ఉంది. పరుగెత్తి సింగిల్‌    తీయనేల.. నిలబడి ఫోరో, సిక్సరో బాదేస్తానంటూ ఆస్ట్రేలియా యోధుడు ట్రావిస్‌ హెడ్‌ మరోసారి ఆకాశమే హద్దుగా చెలరేగిన వేళ.. మిగతా బ్యాటర్లూ సిక్సర్లు, ఫోర్ల వేటలో దూసుకెళ్లడంతో ఈ సీజన్‌ ముందు వరకు ఉన్న ఐపీఎల్‌ అత్యధిక స్కోరు (263) రికార్డును మూడోసారి దాటేసింది హైదరాబాద్‌. కొండంత లక్ష్యాన్ని ఛేదించడానికి దిల్లీ కొంచెం పోరాడినా ఫలితం లేకపోయింది.

పీఎల్‌-17లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ది అదే దూకుడు. ఈసారి ఆ జట్టు విధ్వంసానికి బలైన ప్రత్యర్థి దిల్లీ క్యాపిటల్స్‌. ఓపెనర్లు ట్రావిస్‌ హెడ్‌ (89; 32 బంతుల్లో 11×4, 6×6) అభిషేక్‌ శర్మ (46; 12 బంతుల్లో 2×4, 6×6) మరోసారి సంచలన ఆరంభాన్నిస్తే.. షాబాజ్‌ అహ్మద్‌ (59; 29 బంతుల్లో 2×4, 5×6), నితీశ్‌ కుమార్‌ రెడ్డి (37; 27 బంతుల్లో 2×4, 2×6) కూడా చెలరేగడంతో సన్‌రైజర్స్‌ 7 వికెట్లకు 266 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఛేదనలో జేక్‌ ఫ్రేజర్‌ (65; 18 బంతుల్లో 5×4, 7×6) బలమైన పునాదే వేసినా.. అతను ఔటయ్యాక గాడి తప్పిన దిల్లీ.. లక్ష్యానికి దూరమైంది. అభిషేక్‌ పోరెల్‌ (42; 22 బంతుల్లో 7×4, 1×6) పంత్‌ (44; 35 బంతుల్లో 5×4, 1×6) కూడా పోరాడాడు. డీసీ 19.1 ఓవర్లలో 199 పరుగులకు ఆలౌటవడంతో సన్‌రైజర్స్‌ 67 పరుగుల తేడాతో నెగ్గింది. సన్‌రైజర్స్‌ బౌలర్లలో నటరాజన్‌ (4/19) అద్భుత ప్రదర్శన చేశాడు. మార్కండే (2/26), నితీశ్‌ (2/17) కూడా రాణించారు.

అతనున్నంతసేపు..: ఛేదనలో ఇంపాక్ట్‌ ప్లేయర్‌ పృథ్వీ షా (16) తొలి నాలుగు బంతులకు నాలుగు ఫోర్లు కొట్టడంతో దిల్లీ శిబిరంలో ఉత్సాహం నెలకొంది. కానీ అయిదో బంతికి అతణ్ని సుందర్‌ పెవిలియన్‌ చేర్చాడు. మరో ఓపెనర్‌ వార్నర్‌ (1)ను భువనేశ్వర్‌ ఎంతోసేపు నిలవనీయలేదు. 25/2తో ఛేదనను పేలవంగా ఆరంభించిన దిల్లీ చిత్తుగా ఓడుతుందనిపించింది. కానీ జేక్‌ ఫ్రేజర్‌.. సంచలన బ్యాటింగ్‌తో చూస్తుండగానే మ్యాచ్‌ గమనాన్ని మార్చేశాడు. సుందర్‌ వేసిన ఇన్నింగ్స్‌ మూడో ఓవర్లో అతను వరుసగా 4, 4, 6, 4, 6, 6 బాదేశాడు. ఆ తర్వాత కూడా జేక్‌ దూకుడు కొనసాగడం, పోరెల్‌ కూడా ధాటిగా ఆడడంతో పవర్‌ప్లేలో 88/2తో మంచి స్థితికి చేరుకుంది. జేక్‌ దూకుడు చూస్తే దిల్లీ సంచలన విజయం సాధిస్తుందా అనిపించింది. స్పిన్నర్‌ మార్కండే వేసిన తర్వాతి ఓవర్లో జేక్‌ వరుసగా మూడు సిక్సర్లు బాదడంతో స్కోరు వంద దాటేసింది. కానీ అదే ఊపులో మరో షాట్‌ ఆడబోయి అతను ఔట్‌ కావడంతో మ్యాచ్‌ మలుపు తిరిగింది. పోరెల్‌ను సైతం మార్కండే తన తర్వాతి ఓవర్లో ఔట్‌ చేయగా.. డీసీ ఎన్నో ఆశలు పెట్టుకున్న స్టబ్స్‌ (10) నిరాశపరచడంతో సన్‌రైజర్స్‌ ఘనవిజయం ఖాయమైపోయింది. బ్యాటింగ్‌లో రాణించిన తెలుగు కుర్రాడు నితీశ్‌.. బంతితోనూ రాణించి ప్రమాదకర స్టబ్స్‌ను ఔట్‌ చేశాడు. ఆ తర్వాత పంత్‌ పోరాటం ఓటమి అంతరాన్ని తగ్గించడానికే ఉపయోగపడింది. నటరాజన్‌ 19వ ఓవర్లో 3 వికెట్లతో మెయిడెన్‌ వేయడం విశేషం. చివరి ఓవర్‌ (నితీశ్‌) తొలి బంతికి పంత్‌ ఔట్‌ కావడంతో దిల్లీ కథ ముగిసింది.

వీర విధ్వంసం: ఏ ముహూర్తాన ట్రావిస్‌ హెడ్‌ అనే బ్యాటర్‌ సన్‌రైజర్స్‌ జట్టులోకి వచ్చాడో కానీ.. ఆ రోజు నుంచి ప్రత్యర్థి బౌలర్లకు బడిత పూజే! హెడ్‌ను చూసి స్ఫూర్తి పొందుతున్నాడో ఏమో.. మరో ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ కూడా పూనకం వచ్చినట్లు బంతి మీద పడిపోతున్నాడు. దీంతో సిక్సర్ల మోత మోగిపోతోంది. ఇప్పటికే ఈ సీజన్లో మూడు మ్యాచ్‌ల్లో రెచ్చిపోయి ఈ జోడీ.. శనివారం ఇంకా దూకుడుగా ఆడింది. ఐపీఎల్‌లో ఇప్పటిదాకా ఎన్నడూ చూడని విధ్వంస చిత్రాన్ని ఈ జోడీ దిల్లీపై చూపించింది. 0, 6, 4, 4, 1, 4, 6, 6, 0, 4, 1, 4, 4, 4, 0, 4, 4, 6, 6, 1, 1, 6, 1, 6, 6, 6, 1, 0, 1, 6, 4, 4, 4, 4, 0, 6, 6.. తొలి వికెట్‌ పడడానికి ముందు హెడ్‌, అభిషేక్‌ కలిసి సాగించిన ధ్వంస రచన ఇది. 19, 21, 22, 21, 20.. ఓవర్‌కు 20కి అటు ఇటుగా పరుగులు చేస్తూ కేవలం 5 ఓవర్లలోనే స్కోరును వంద దాటించేసిందీ జోడీ. పవర్‌ ప్లే అయ్యేసరికే స్కోరు 125కు చేరుకుంది. ఇన్నింగ్స్‌ మూడో ఓవర్లోనే, కేవలం 16 బంతుల్లో హెడ్‌ అర్ధశతకం పూర్తయింది. అభిషేక్‌ సైతం 11 బంతుల్లోనే 46 పరుగులు చేసి ఐపీఎల్‌ రికార్డు అర్ధశతకం ముంగిట నిలిచాడు. అయితే తన 7 బంతుల్లో 26 పరుగులు సమర్పించుకున్న కుల్‌దీప్‌.. అభిషేక్‌ జోరుకు అడ్డుకట్ట వేసి దిల్లీకి ఉపశమనాన్నందించాడు. అదే ఓవర్లో అతను మార్‌క్రమ్‌ (1)ను కూడా ఔట్‌ చేశాడు. క్లాసెన్‌ రెండు భారీ సిక్సర్లు బాదడంతో 9వ ఓవర్లోనే సన్‌రైజర్స్‌ 150 దాటేసింది. దీంతో ఆ జట్టు మరోసారి లీగ్‌ రికార్డు స్కోరును బద్దలు కొడుతూ 300 ముచ్చట కూడా తీర్చేస్తుందా అన్న ఆలోచన మొదలైంది. కానీ హెడ్‌ను కుల్‌దీప్‌, క్లాసెన్‌ను అక్షర్‌ పెవిలియన్‌ చేర్చడంతో దిల్లీకి పెను ముప్పు తొలగింది. తక్కువ వ్యవధిలో 4 వికెట్లు పడడంతో 2-3 ఓవర్ల పాటు స్కోరు వేగం పడిపోయింది. కానీ నితీశ్‌ కుమార్‌ రెడ్డితో కలిసి షాబాజ్‌ అనూహ్యంగా చెలరేగడంతో మళ్లీ స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. ఈ జోడీ అయిదో వికెట్‌కు 47 బంతుల్లో 67 పరుగులు జోడించింది. 17వ ఓవర్‌ చివరి బంతికే నితీశ్‌ ఔటయ్యేసరికి స్కోరు 221/5. తర్వాత సమద్‌ (13)తో కలిసి షాబాజ్‌ చెలరేగి ఆడి స్కోరును 260 దాటించాడు.

హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌: హెడ్‌ (సి) స్టబ్స్‌ (బి) కుల్‌దీప్‌ 89; అభిషేక్‌ (సి) అక్షర్‌ (బి) కుల్‌దీప్‌ 46; మార్‌క్రమ్‌ (సి) అక్షర్‌ (బి) కుల్‌దీప్‌ 1; క్లాసెన్‌ (బి) అక్షర్‌ 15; నితీశ్‌ (సి) వార్నర్‌ (బి) కుల్‌దీప్‌ 37; షాబాజ్‌ నాటౌట్‌ 59; సమద్‌ (సి) నోకియా (బి) ముకేశ్‌ 13; కమిన్స్‌ రనౌట్‌ 1; సుందర్‌ నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 5 మొత్తం: (20 ఓవర్లలో   7 వికెట్లకు) 266; వికెట్ల పతనం: 1-131, 2-133, 3-154, 4-154, 5-221, 6-250, 7-256; బౌలింగ్‌: ఖలీల్‌ అహ్మద్‌ 3-0-51-0; లలిత్‌ 2-0-41-0; నోకియా 3-0-31-0; కుల్‌దీప్‌ 4-0-55-4; ముకేశ్‌ 4-0-57-1; అక్షర్‌ 4-0-29-1

దిల్లీ ఇన్నింగ్స్‌: పృథ్వీషా (సి) సమద్‌ (బి) సుందర్‌ 16; వార్నర్‌ (సి) కమిన్స్‌ (బి) భువనేశ్వర్‌ 1; జేక్‌ ఫ్రేజర్‌ (సి) క్లాసెన్‌ (బి) మార్కండే 65; అభిషేక్‌ పోరెల్‌ (స్టంప్డ్‌) క్లాసెన్‌ (బి) మార్కండే 42; స్టబ్స్‌ (సి) షాబాజ్‌ (బి) నితీశ్‌10; పంత్‌ (సి) నటరాజన్‌ (బి) నితీశ్‌ 44; లలిత్‌ (బి) నటరాజన్‌ 7; అక్షర్‌ పటేల్‌ (సి) కమిన్స్‌ (బి) నటరాజన్‌ 6; నోకియా (బి) నటరాజన్‌ 0; కుల్‌దీప్‌ ఎల్బీ (బి) నటరాజన్‌ 0; ముకేశ్‌ నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 8 మొత్తం: (19.1 ఓవర్లలో ఆలౌట్‌) 199; వికెట్ల పతనం: 1-16, 2-25, 3-109, 4-135, 5-154, 6-166, 7-199, 8-199, 9-199; బౌలింగ్‌: సుందర్‌ 2-0-46-1; భువనేశ్వర్‌ 4-0-33-1; కమిన్స్‌ 4-0-35-0; నటరాజన్‌ 4-1-19-4; మార్కండే 2-0-26-2; షాబాజ్‌ 1-0-22-0; నితీశ్‌కుమార్‌ 2.1-0-17-2

16

అర్ధశతకానికి హెడ్‌ ఆడిన బంతులు. సన్‌రైజర్స్‌ తరపున అత్యంత వేగవంతమైన అర్ధసెంచరీ రికార్డు (ఈ సీజన్‌లోనే ముంబయిపై అభిషేక్‌)ను హెడ్‌ సమం చేశాడు.

24

పవర్‌ప్లేలో సన్‌రైజర్స్‌ కొట్టిన బౌండరీలు. పురుషుల టీ20ల్లో ఇదే ప్రపంచ రికార్డు. శ్రీలంక రికార్డు (2014లో ససెక్స్‌పై 20) కనుమరుగైంది. తొలి ఆరు ఓవర్లలో సన్‌రైజర్స్‌ 11 సిక్సర్లు కొట్టడమూ రికార్డే.

5

100 పరుగులు దాటేందుకు సన్‌రైజర్స్‌కు అవసరమైన ఓవర్లు. పురుషుల టీ20ల్లో అత్యంత వేగంగా ఆ ఘనత సాధించిన జట్టుగా సన్‌రైజర్స్‌ నిలిచింది. గత రికార్డు దక్షిణాఫ్రికా (2023లో వెస్టిండీస్‌పై 5.3 ఓవర్లలో) పేరు మీద ఉంది. అలాగే తక్కువ ఓవర్ల (8.4)లో 150 పరుగులు చేసిన రికార్డు కూడా సన్‌రైజర్స్‌దే.  

125

పవర్‌ప్లేలో సన్‌రైజర్స్‌ స్కోరు. పురుషుల టీ20ల్లో పవర్‌ప్లేలో నమోదైన అత్యధిక స్కోరు ఇదే. నాటింగ్‌హమ్‌షైర్‌ (2017లో డర్హంపై 106) రికార్డును సన్‌రైజర్స్‌ తిరగరాసింది.

158/4

తొలి పది ఓవర్లలో సన్‌రైజర్స్‌ స్కోరు. ఐపీఎల్‌లో పది ఓవర్లలో అత్యధిక స్కోరు చేసిన జట్టుగా తన రికార్డు (ముంబయిపై 148)ను సన్‌రైజర్స్‌ మెరుగుపర్చుకుంది.

15

అర్ధసెంచరీకి ఫ్రేజర్‌ ఆడిన బంతులు. ఈ సీజన్‌లో ఇదే వేగవంతమైన అర్ధసెంచరీ. దిల్లీ తరపున మోరిస్‌ (17) రికార్డును అతను బద్దలుకొట్టాడు.   ఓవరాల్‌గా ఐపీఎల్‌లో ఇది మూడో వేగవంతమైన అర్ధశతకం. యశస్వి (13), కేఎల్‌ రాహుల్‌, కమిన్స్‌ (14) ముందున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని