సంక్షిప్త వార్తలు(5)

బిష్కెక్‌ ప్రపంచ క్వాలిఫయర్స్‌లో భారత రెజ్లర్లు ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేయకపోవడంతో టర్కీలో జరిగే ఆఖరి క్వాలిఫయర్స్‌ కోసం మరోసారి ట్రయల్స్‌ నిర్వహించి జట్టును ఎంపిక చేయాలని రెజ్లింగ్‌ సమాఖ్య యోచిస్తోంది.

Published : 22 Apr 2024 02:54 IST

ఆ రెజ్లర్లకు మరోసారి ట్రయల్స్‌! 

దిల్లీ: బిష్కెక్‌ ప్రపంచ క్వాలిఫయర్స్‌లో భారత రెజ్లర్లు ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేయకపోవడంతో టర్కీలో జరిగే ఆఖరి క్వాలిఫయర్స్‌ కోసం మరోసారి ట్రయల్స్‌ నిర్వహించి జట్టును ఎంపిక చేయాలని రెజ్లింగ్‌ సమాఖ్య యోచిస్తోంది. పారిస్‌ ఒలింపిక్స్‌ కోసం 18 కోటాలు అందుబాటులో ఉండగా ఇటీవల బిష్కెక్‌ టోర్నీలో భారత్‌ కేవలం 4 స్థానాలే దక్కించుకోగలిగింది. వినేశ్‌ ఫొగాట్‌ (50 కేజీ), అంతిమ్‌ ఫంగాల్‌ (53 కేజీ), అన్షు మలిక్‌ (57 కేజీ), రీతిక (76 కేజీ) ఈ కోటాలు సాధించారు. మే 9న టర్కీలో మొదలయ్యే టోర్నీలో 14 విభాగాల్లో బెర్తులు సాధించడానికి భారత్‌కు అవకాశం ఉంది. గత కొన్నేళ్లుగా ఒలింపిక్స్‌లో తప్పకుండా అర్హత సాధిస్తున్న పురుషుల ఫ్రీస్టయిల్‌లో.. మన రెజ్లర్లెవరూ ఇప్పటిదాకా బెర్తు దక్కించుకోకపోవడం రెజ్లింగ్‌ సంఘాన్ని కలవరపరుస్తోంది. ఈ నేపథ్యంలో 14 కేటగిరిల్లో మరోసారి ట్రయల్స్‌ నిర్వహించి టర్కీకి జట్టును పంపాలని సంఘం భావిస్తోంది.


ఉగాండా కోచ్‌గా అభయ్‌శర్మ

దిల్లీ: టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనే ఉగాండా జట్టుకు మాజీ దేశవాళీ ఆటగాడు అభయ్‌శర్మ చీఫ్‌ కోచ్‌గా వ్యవహరించనున్నాడు. ఉగాండా కోచ్‌గా అభయ్‌ త్వరలోనే బాధ్యతలు చేపటనున్నట్లు తెలుస్తోంది. 54 ఏళ్ల అభయ్‌కు ఇండియా-ఎ, భారత అండర్‌-19 జట్లకు ఫీల్డింగ్‌ కోచ్‌గా వ్యవహరించిన అనుభవముంది. భారత మహిళల జట్టుతో కూడా పనిచేశాడు. ఈ ఏడాది జూన్‌లో అమెరికా- వెస్టిండీస్‌లో జరిగే పొట్టి కప్పుకు ఆఫ్రికా నుంచి నమీబియా, ఉగాండా అర్హత సాధించాయి. టీ20 కప్‌ సన్నాహాల్లో భాగంగా 15 రోజుల పాటు శ్రీలంకలో ఉగాండా జట్టు సాధన చేయనుంది. స్థానిక జట్లతో మ్యాచ్‌ ప్రాక్టీస్‌ మ్యాచ్‌లు ఆడుతుంది.


నిరాశపరిచిన భారత రేస్‌ వాకర్లు

అంటల్యా (టర్కీ): ప్రపంచ అథ్లెటిక్స్‌ రేస్‌ వాకింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత అథ్లెట్లు నిరాశ పరిచారు. పదిమంది ఈ ఈవెంట్లో పాల్గొంటే సెర్విన్‌ సెబాస్టియన్‌ మాత్రమే టాప్‌-20లో చోటు దక్కించుకోగలిగాడు. అంతేకాక ఒక్కరు కూడా పారిస్‌ ఒలింపిక్స్‌ అర్హత ప్రమాణాన్ని (గంటా 20 నిమిషాల 10 సెకన్లు) అందుకోలేకపోయారు. పురుషుల 20 కి.మీ నడకలో సెబాస్టియన్‌ (గంటా 21 నిమిషాల 39 సెకన్లు) 20వ స్థానంలో నిలిచాడు. అతడి తర్వాత వికాస్‌ సింగ్‌ (గంటా 21 నిమిషాల 59 సెకన్లు) కాస్త మెరుగ్గా 23వ స్థానాన్ని దక్కించుకున్నాడు. మహిళల విభాగంలో పూజ కుమావత్‌ (గంటా 40 నిమిషాల 27 సెకన్లు) మాత్రమే ఉత్తమంగా 42వ స్థానంలో నిలిచింది. కానీ ఆమెతో పాటు మంజు రాణి (గంట 40 నిమిషాల 31 సెకన్లు), ముత్తురత్నం (గంటా 40 నిమిషాల 33 సెకన్లు) రమణ్‌దీప్‌ కౌర్‌ (గంట 42 నిమిషాల 12 సెకన్లు), పాయల్‌ (గంట 42 నిమిషాల 32 సెకన్లు)లలో ఎవరూ ఒలింపిక్‌ అర్హత మార్కు (గంటా 29 నిమిషాల 20 సెకన్లు) దారిదాపుల్లోకి రాలేకపోయారు.


అదే అతిపెద్ద సవాలు: వినేశ్‌

బిష్కెక్‌ (కిర్గిస్తాన్‌): వచ్చే నాలుగు నెలల పాటు బరువును కాపాడుకోవడమే అతిపెద్ద సవాల్‌ అని భారత స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌ తెలిపింది. ఆసియా ఒలింపిక్‌ క్వాలిఫయర్స్‌లో అదరగొట్టిన వినేశ్‌ (50 కేజీలు).. పారిస్‌ ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. ఒలింపిక్స్‌ కోసం వినేశ్‌ అత్యల్ప వెయిట్‌ కేటగిరీకి మారింది. ‘‘నా బరువును మెరుగ్గా నిర్వహించుకోవాలి. చాలా కష్టపడి 50 కేజీల బరువుకు తగ్గా. ఇదే బరువును కొనసాగించేందుకు శక్తి మేరకు ప్రయత్నిస్తా. అయితే నా కండరాలు బలంగా ఉండటంతో బరువు పెరగకుండా ఉండటం అంత సులువు కాదు. వచ్చే నాలుగు నెలల్లో ప్రతి రోజూ నాకు ముఖ్యమే’’ అని వినేశ్‌ పేర్కొంది.


భారత రెజ్లర్లు విఫలం

బిష్కెక్‌: ఆసియా ఒలింపిక్‌ క్వాలిఫయర్‌లో భారత గ్రీకో రోమన్‌ రెజ్లర్లు పేలవ ప్రదర్శన చేశారు. ఒక్కరు కూడా ఒలింపిక్‌ బెర్త్‌ సంపాదించలేకపోయారు. పోటీలో ఉన్న భారత రెజ్లర్లలో సునీల్‌ (87కేజీ) ఒక్కడే ఓ బౌట్లో నెగ్గగలిగాడు. మిగతా అందరూ తొలి రౌండ్లోనే పరాజయం పాలయ్యారు. సునీల్‌ క్వార్టర్‌ఫైనల్లో పోరాడి ఓడాడు. అశు (67కేజీ), సుమిత్‌ (60కేజీ), వికాస్‌ (77కేజీ), నితేశ్‌ (97కేజీ), నవీన్‌ (130కేజీ) మొదటి రౌండ్‌ దాటలేకపోయారు. భారత గ్రీకో రోమన్‌ రెజ్లర్లు చివరిసారి 2016లో ఒలింపిక్స్‌లో పోటీపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని