బెంగళూరు ఓటమి నం.7

బ్యాటర్‌ కర్ణ్‌ శర్మ, బౌలర్‌ స్టార్క్‌. 6 బంతుల్లో 21 పరుగులు కావాలి. ఆర్సీబీ పనైపోయిందనే అనుకున్నారంతా. కానీ అనూహ్యం.. నాలుగు బంతుల్లో మూడు సిక్సర్లు బాదేశాడు కర్ణ్‌. 2 బంతుల్లో 3 చేస్తే చాలు బెంగళూరుదే విజయం.

Updated : 22 Apr 2024 07:07 IST

ఆర్సీబీ ప్లేఆఫ్స్‌ ఆశలు గల్లంతు!
1 పరుగు తేడాతో కేకేఆర్‌ చేతిలో ఓటమి
మెరిసిన శ్రేయస్‌, సాల్ట్‌
మలుపు తిప్పిన రసెల్‌
విల్‌ జాక్స్‌, రజత్‌ పోరాటం వృథా

బ్యాటర్‌ కర్ణ్‌ శర్మ, బౌలర్‌ స్టార్క్‌. 6 బంతుల్లో 21 పరుగులు కావాలి. ఆర్సీబీ పనైపోయిందనే అనుకున్నారంతా. కానీ అనూహ్యం.. నాలుగు బంతుల్లో మూడు సిక్సర్లు బాదేశాడు కర్ణ్‌. 2 బంతుల్లో 3 చేస్తే చాలు బెంగళూరుదే విజయం. కోల్‌కతాకు ఆశల్లేవనే అనిపించింది. కానీ అయిదో బంతికి కర్ణ్‌ ఔట్‌. చివరి బంతికి ఒకటే పరుగు. రెండో పరుగు తీస్తూ ఫెర్గూసన్‌ రనౌట్‌! ఓవర్‌ ఆరంభానికి ముందు అనుకున్నట్లే ఆర్సీబీ పనైపోయింది. 8 మ్యాచ్‌ల్లో ఏడో ఓటమితో ఐపీఎల్‌-17లో ప్లేఆఫ్స్‌కు దాదాపుగా దూరమైంది బెంగళూరు.

కోల్‌కతా

ఐపీఎల్‌- 17లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఇక ప్లేఆఫ్స్‌ చేరడం కష్టమే! ఆదివారం చివరి బంతి వరకూ ఉత్కంఠతో సాగిన మ్యాచ్‌లో ఆ జట్టు ఒక్క పరుగు తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ చేతిలో ఓడింది. మొదట కేకేఆర్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 222 పరుగుల భారీస్కోరు చేసింది. ఫిల్‌ సాల్ట్‌ (48; 14 బంతుల్లో 7×4, 3×6) చెలరేగగా.. శ్రేయస్‌ అయ్యర్‌ (50; 36 బంతుల్లో 7×4, 1×6) సమయోచిత అర్ధశతకంతో రాణించాడు. చివర్లో రమణ్‌దీప్‌ (24 నాటౌట్‌; 9 బంతుల్లో 2×4, 2×6) పిడుగులా పడ్డాడు. కామెరూన్‌ గ్రీన్‌ (2/35), యశ్‌ దయాల్‌ (2/56) మెరిశారు. ఛేదనలో బెంగళూరు 20 ఓవర్లలో 221 పరుగులకు ఆలౌటైంది. విల్‌ జాక్స్‌ (55; 32 బంతుల్లో 4×4, 5×6), రజత్‌ పటీదార్‌ (52; 23 బంతుల్లో 3×4, 5×6) పోరాటం వృథా అయింది. ‘‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’’ రసెల్‌ (3/25) బెంగళూరును దెబ్బకొట్టాడు. హర్షిత్‌ రాణా (2/33), సునీల్‌ నరైన్‌ (2/34) కూడా సత్తాచాటారు.

ఆశలు రేపి..: ఛేదనలో దూకుడుగా సాగిన బెంగళూరు కీలక సమయాల్లో వికెట్లు చేజార్చుకుంది. ఓపెనర్లు కోహ్లి (18), డుప్లెసిస్‌ (7) త్వరగానే ఔటైనా.. విల్‌ జాక్స్‌, రజత్‌ పోరాటంతో ఆర్సీబీ పుంజుకుంది. ముఖ్యంగా జాక్స్‌ రెచ్చిపోయాడు. స్టార్క్‌ ఓవర్లో మూడు సిక్సర్లు, ఓ ఫోర్‌ బాదేశాడు. ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా వచ్చిన స్పిన్నర్‌ సుయాశ్‌కు రజత్‌ చుక్కలు చూపించాడు. ఒకే ఓవర్లో రెండేసి సిక్సర్లు, ఫోర్లు కొట్టాడు. ప్రమాదకర నరైన్‌నూ రజత్‌ లెక్కచేయలేదు. అతని బౌలింగ్‌లో రెండు సిక్సర్లతో రజత్‌ 21 బంతుల్లోనే అర్ధశతకం అందుకున్నాడు. 11 ఓవర్లకు 137/2తో.. ఇంకో 9 ఓవర్లలో 86 పరుగులు చేస్తే గెలిచే స్థితిలో ఆర్సీబీ నిలిచింది. కానీ ఆ తర్వాతి రెండు ఓవర్లు మ్యాచ్‌ను మలుపు తిప్పాయి. బౌలింగ్‌కు వస్తూనే రసెల్‌ ఒకే ఓవర్లో జాక్స్‌, రజత్‌ను ఔట్‌చేశాడు. ఆ వెంటనే గ్రీన్‌ (6), మహిపాల్‌ (4)ను నరైన్‌ ఒకే ఓవర్లో పెవిలియన్‌ చేర్చాడు. అయినా దినేశ్‌ కార్తీక్‌ (25) ఉండటంతో ఆర్సీబీ నమ్మకంతోనే ఉంది. కానీ కేకేఆర్‌ బౌలర్లు గొప్పగా బంతులేసి పరుగులు కట్టడి చేశారు. 18వ ఓవర్లో ప్రభుదేశాయ్‌ (24)ను ఔట్‌ చేసిన హర్షిత్‌ ఆరు పరుగులే ఇచ్చాడు. సమీకరణం 12 బంతుల్లో 31 పరుగులుగా మారింది. రసెల్‌ బౌలింగ్‌లో ఓ సిక్సర్‌, ఫోర్‌తో ఆశలు రేపిన కార్తీక్‌.. ఆ వెంటనే స్లో బౌన్సర్‌కు బోల్తాపడ్డాడు.

ఉత్కంఠతో ముగిసి..: ఆర్సీబీ విజయానికి ఆఖరి ఓవర్లో 21 పరుగులు అవసరమయ్యాయి. స్టార్క్‌ బౌలింగ్‌. క్రీజులో ఉన్న 36 ఏళ్ల స్పిన్నర్‌ కర్ణ్‌శర్మ (20)పై పెద్దగా అంచనాల్లేవు. కానీ అనూహ్యంగా తొలి బంతికి అతను సిక్సర్‌ కొట్టాడు. రెండో బంతికి వికెట్‌ కీపర్‌ క్యాచ్‌ కోసం కేకేఆర్‌ సమీక్ష కోరింది. బంతి బ్యాట్‌కు ఆనింది కానీ, వికెట్‌కీపర్‌ అందుకునే ముందు నేలకు తాకిందని అంపైర్‌ నాటౌటిచ్చాడు. ఆ తర్వాత రెండు బంతులకూ నమ్మశక్యం కాని రీతిలో కర్ణ్‌ సిక్సర్లు కొట్టాడు. 2 బంతుల్లో 3 పరుగులు చేస్తే చాలు ఆర్సీబీదే విజయం. కానీ అయిదో బంతికి స్టార్క్‌ అద్భుతమైన రిటర్న్‌ క్యాచ్‌తో కర్ణ్‌ శర్మను ఔట్‌ చేయడంతో మరింత ఉత్కంఠ నెలకొంది. చివరి బంతికి 3 పరుగులు చేయాల్సిన దశలో రెండో పరుగు తీసే ప్రయత్నంలో ఫెర్గూసన్‌ రనౌట్‌తో ఆర్సీబీకి ఓటమి తప్పలేదు.

మెరుపులతో మొదలై: అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతాకు సాల్ట్‌ మెరుపు ఆరంభాన్ని ఇవ్వగా.. రమణ్‌దీప్‌ అదిరే ముగింపునిచ్చాడు. మధ్యలో శ్రేయస్‌ నిలబడ్డాడు. నరైన్‌ (15 బంతుల్లో 10) ఈ సారి నెమ్మదించగా.. బాదే బాధ్యతను సాల్ట్‌ తీసుకున్నాడు. ఉన్నంతసేపు ఉప్పెనలా ముంచెత్తిన అతను.. ఫెర్గూసన్‌ వేసిన నాలుగో ఓవర్లో వరుసగా 6, 4, 4, 6, 4, 4తో విధ్వంసం సృష్టించాడు. కానీ సాల్ట్‌ను సిరాజ్‌ ఔట్‌ చేయడం.. ఒకే ఓవర్లో నరైన్‌, రఘువంశీ (3)ని యశ్‌ వెనక్కిపంపడంతో కోల్‌కతా పవర్‌ప్లేను 75/3తో ముగించింది. రఘువంశీ క్యాచ్‌ను గ్రీన్‌ అద్భుత రీతిలో అందుకున్నాడు. అక్కడి నుంచి ఇన్నింగ్స్‌ను శ్రేయస్‌ నడిపించాడు. బంతి చక్కగా బ్యాట్‌ మీదకు రావడంతో బౌండరీలు సాధించాడు. కానీ రింకు (24) నిష్క్రమించడం, రసెల్‌ (27 నాటౌట్‌) నెమ్మదిగా మొదలెట్టడంతో స్కోరుబోర్డు వేగం మందగించింది. 16 ఓవర్లకు 155/5తో నిలిచిన కేకేఆర్‌ 200 పరుగులూ చేయడం కష్టమనిపించింది. గేరు మార్చిన శ్రేయస్‌ అర్ధశతకం తర్వాత ఔటైపోయాడు. కానీ సిరాజ్‌ బౌలింగ్‌లో రమణ్‌దీప్‌ వరుసగా 6, 6, 4 బాదేశాడు. చివరి ఓవర్లో రసెల్‌ కూడా దంచాడు. చివరి 4 ఓవర్లలో కేకేఆర్‌ 67 పరుగులు పిండుకుంది.

కోల్‌కతా ఇన్నింగ్స్‌: సాల్ట్‌ (సి) రజత్‌ (బి) సిరాజ్‌ 48; నరైన్‌ (సి) కోహ్లి (బి) యశ్‌ 10; రఘువంశీ (సి) గ్రీన్‌ (బి) యశ్‌ 3; వెంకటేశ్‌ (సి) లొమ్రార్‌ (బి) గ్రీన్‌ 16; శ్రేయస్‌ (సి) డుప్లెసిస్‌ (బి) గ్రీన్‌ 50; రింకు (సి) యశ్‌ (బి) ఫెర్గూసన్‌ 24; రసెల్‌ నాటౌట్‌ 27; రమణ్‌దీప్‌ నాటౌట్‌ 24; ఎక్స్‌ట్రాలు 20; మొత్తం: (20 ఓవర్లలో 6 వికెట్లకు) 222; వికెట్ల పతనం: 1-56, 2-66, 3-75, 4-97, 5-137, 6-179; బౌలింగ్‌: సిరాజ్‌ 4-0-40-1; యశ్‌ దయాల్‌ 4-0-56-2; ఫెర్గూసన్‌ 4-0-47-1; కర్ణ్‌ శర్మ 4-0-33-0; గ్రీన్‌ 4-0-35-2

బెంగళూరు ఇన్నింగ్స్‌: కోహ్లి (సి) అండ్‌ (బి) హర్షిత్‌ 18; డుప్లెసిస్‌ (సి) వెంకటేశ్‌ (బి) వరుణ్‌ 7; విల్‌ జాక్స్‌ (సి) రఘువంశీ (బి) రసెల్‌ 55; రజత్‌ (సి) హర్షిత్‌ (బి) రసెల్‌ 52; గ్రీన్‌ (సి) రమణ్‌దీప్‌ (బి) నరైన్‌ 6; ప్రభుదేశాయ్‌ (సి) రఘువంశీ (బి) హర్షిత్‌ 24; లొమ్రార్‌ (సి) అండ్‌ (బి) నరైన్‌ 4; దినేశ్‌ కార్తీక్‌ (సి) సాల్ట్‌ (బి) రసెల్‌ 25; కర్ణ శర్మ (సి) అండ్‌ (బి) స్టార్క్‌ 20; సిరాజ్‌ నాటౌట్‌ 0; ఫెర్గూసన్‌ రనౌట్‌ 1; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం: (20 ఓవర్లలో ఆలౌట్‌) 221; వికెట్ల పతనం: 1-27, 2-35, 3-137, 4-138, 5-151, 6-155, 7-187, 8-202, 9-220; బౌలింగ్‌: హర్షిత్‌ రాణా 4-0-33-2; స్టార్క్‌ 3-0-55-1; వరుణ్‌ చక్రవర్తి 4-0-36-1; నరైన్‌ 4-0-34-2; సుయాశ్‌ 2-0-33-0; రసెల్‌ 3-0-25-3

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని