కష్ట కాలంలో కోహ్లి మాటలే..

ఒకప్పుడు ఐపీఎల్‌లో పేలవ ప్రదర్శనతో విమర్శలెదుర్కొన్న రాజస్థాన్‌ రాయల్స్‌ ఆల్‌రౌండర్‌ రియాన్‌ పరాగ్‌.. ఈ సీజన్లో నిలకడగా రాణిస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు.

Updated : 23 Apr 2024 04:28 IST

దిల్లీ: ఒకప్పుడు ఐపీఎల్‌లో పేలవ ప్రదర్శనతో విమర్శలెదుర్కొన్న రాజస్థాన్‌ రాయల్స్‌ ఆల్‌రౌండర్‌ రియాన్‌ పరాగ్‌.. ఈ సీజన్లో నిలకడగా రాణిస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు. 7 మ్యాచ్‌ల్లో 63.6 సగటుతో 3 అర్ధశతకాలు సహా అతను 318 పరుగులు సాధించాడు. తాను ఒకప్పుడు పేలవ ఫామ్‌లో ఉండగా.. స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి చెప్పిన మాటలు తనలో ఎంతో భరోసాను నింపాయని పరాగ్‌ తెలిపాడు. ‘‘నా రెండో ఐపీఎల్‌ సీజన్లో పేలవ దశను ఎదుర్కొన్నా. దాన్నుంచి ఎలా బయటపడాలని కోహ్లిని అడిగా. అతను 10-15 నిమిషాల పాటు నాతో మాట్లాడాడు. తన అనుభవాలను నాతో పంచుకున్నాడు. అవి నాకెంతో సాయం చేశాయి’’ అని పరాగ్‌ చెప్పాడు. ఒకప్పటి రాజస్థాన్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ తన ఎదుగుదలలో కీలక పాత్ర పోషించినట్లు పరాగ్‌ తెలిపాడు.


మార్ష్‌ మిగిలిన మ్యాచ్‌లకు కూడా..

దిల్లీ: ఐపీఎల్‌-17లో గాయంతో కొన్ని మ్యాచ్‌లు ఆడలేకపోయిన దిల్లీ క్యాపిటల్స్‌ ఆల్‌రౌండర్‌ మిచెల్‌ మార్ష్‌.. టోర్నీలో మిగిలిన మ్యాచ్‌లకు కూడా దూరమయ్యాడు. దిల్లీ కోచ్‌ రికీ పాంటింగ్‌ సోమవారం ఈ విషయాన్ని వెల్లడించాడు. ఈ టోర్నీలో నాలుగు మ్యాచ్‌లే ఆడిన మిచెల్‌.. చీలమండ గాయంతో ఏప్రిల్‌ 12న స్వదేశానికి వెళ్లిపోయాడు. అక్కడే చికిత్స చేయించుకుంటున్న అతడు తిరిగి ఐపీఎల్‌కు వచ్చే అవకాశం లేదని పాంటింగ్‌ తెలిపాడు. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మార్ష్‌ 61 పరుగులు చేసి.. ఒక వికెట్‌ పడగొట్టాడు. 32 ఏళ్ల మార్ష్‌.. టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనే ఆస్ట్రేలియా జట్టుకు సారథ్యం వహించే అవకాశాలున్నాయి.


కరీబియన్‌లో నెమ్మది పిచ్‌లు: వార్నర్‌

దిల్లీ: ఐపీఎల్‌తో పోల్చుకుంటే కరీబియన్‌లోని పిచ్‌లు నెమ్మదిగా ఉంటాయని దిల్లీ క్యాపిటల్స్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ అన్నాడు. నెమ్మది వికెట్లపై మిడిలార్డర్‌ బ్యాటర్ల పాత్ర కీలకమవుతుందని వార్నర్‌ తెలిపాడు. ఈ ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్‌కు అమెరికా- వెస్టిండీస్‌ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న నేపథ్యంలో కరీబియన్‌ పిచ్‌లపై వార్నర్‌ స్పందిస్తూ.. ‘‘విండీస్‌లో వికెట్లు నెమ్మదిగా ఉంటాయి. కొంచెం స్పిన్‌ తిరుగుతాయి. ఇప్పుడు ఐపీఎల్‌లో ఉన్నట్లుగా ఫ్లాట్‌గా ఉంటాయని అనుకోను. అక్కడ చాలా క్రికెట్‌ ఆడిన అనుభవం నాకుంది. సీపీఎల్‌ కూడా ఆడా. పిచ్‌లపై బంతి తక్కువ ఎత్తులో, నెమ్మదిగా వస్తుంది. అక్కడ 2010 ప్రపంచకప్‌ ఆడినప్పుడు కూడా పెద్ద స్కోర్లు రాలేదు. అలాంటప్పుడు మిడిలార్డర్‌ బ్యాటర్లు కీలకమవుతారు. అప్పట్లో మైక్‌ హసి పరిస్థితులకు తగ్గట్లు ఆడి బాగా పరుగులు సాధించాడు’’ అని చెప్పాడు


లేవర్స్‌ కప్‌లో నాదల్‌

బెర్లిన్‌: ఈ సీజన్లో రిటైర్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయన్న సంకేతాలు ఇచ్చిన స్పెయిన్‌ టెన్నిస్‌ దిగ్గజం రఫెల్‌ నాదల్‌ లేవర్స్‌ కప్‌ టీమ్‌ ఈవెంట్లో ఆడబోతున్నాడు. ఇటీవల బార్సిలోనా ఓపెన్లో రెండో రౌండ్లోనే ఓడిన 37 ఏళ్ల రఫా.. బార్సిలోనాకు రావడం దాదాపు ఇదే చివరిసారని చెప్పాడు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్‌లో 20న బెర్లిన్‌లో ఆరంభమయ్యే లేవర్స్‌ కప్‌లో టీమ్‌ ఐరోపా తరఫున కెరీర్‌లో చివరిగా బరిలో దిగే అవకాశాలున్నాయి. తన స్నేహితుడు రోజర్‌ ఫెదరర్‌ లేవర్స్‌ కప్‌లోనే చివరిగా బరిలో దిగాడు. అందుకే తాను కూడా అలాగే ఆడాలని రఫా భావిస్తున్నట్లు సమాచారం. ‘‘లేవర్స్‌ కప్‌లో ఆడబోతుండడం చాలా సంతోషంగా అనిపిస్తోంది. ఈ టోర్నీతో నాకెన్నో మధురానుభవాలు ఉన్నాయి. ముఖ్యంగా రెండేళ్ల క్రితం లండన్‌లో రోజర్‌ ఫెదరర్‌తో చివరిగా ఆడినప్పటి జ్ఞాపకాలను మర్చిపోలేను’’ అని నాదల్‌ చెప్పాడు. 14సార్లు ఛాంపియన్‌ రఫా.. మే 20న ఆరంభమయ్యే ఫ్రెంచ్‌ ఓపెన్లో ఆడనున్నాడు.


సోమవారం రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నుంచి పద్మశ్రీ పురస్కారం అందుకుంటున్న టెన్నిస్‌ ఆటగాడు రోహన్‌ బోపన్న

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని