ఈ కుర్రాడు.. అసామాన్యుడు

కాదు అనుకున్నది చేసి చూపించడం.. ఓటమి తప్పదు అనుకున్న చోట గెలిచి రావడం ఆ కుర్రాడి నైజం. అంచనాలకు మించి రాణించడం.. అద్భుతమైన ఆటతీరుతో అబ్బురపరచడం అతనికి అలవాటు.

Updated : 23 Apr 2024 08:39 IST

కాదు అనుకున్నది చేసి చూపించడం.. ఓటమి తప్పదు అనుకున్న చోట గెలిచి రావడం ఆ కుర్రాడి నైజం. అంచనాలకు మించి రాణించడం.. అద్భుతమైన ఆటతీరుతో అబ్బురపరచడం అతనికి అలవాటు. 12 ఏళ్లకే గ్రాండ్‌మాస్టర్‌గా నిలిచినా.. 17 ఏళ్లకే ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పోటీపడే ఛాన్స్‌ కొట్టేసినా అతనికే చెల్లింది. చెస్‌ బోర్డు ఎదురుగా ఉంటే.. ఆ పావులతో అతను గెలుపు ఎత్తులు వేస్తాడు. ప్రత్యర్థి ఎవరైనా సరే భయమన్నదే లేకుండా చిత్తుచేస్తాడు. ఆ కుర్రాడే దొమ్మరాజు గుకేశ్‌. ఎత్తుల్లో ఎదుగుతున్న అసామాన్యుడు అతడు.

ఈనాడు క్రీడావిభాగం

‘‘ఈ టోర్నీలో భారత అవకాశాలు స్వల్పమే. మన కుర్రాళ్లు గెలుస్తారని చెప్పలేం’’.. క్యాండిడేట్స్‌ టోర్నీ ఆరంభానికి ముందు దిగ్గజ క్రీడాకారుడు విశ్వనాథన్‌ ఆనంద్‌ చేసిన వ్యాఖ్యలివి. అయిదు సార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన ఆనంద్‌ అలాంటి అభిప్రాయం వెల్లడించడం, టోర్నీలో 2018లో గెలిచిన కరువానా, వరుసగా గత రెండు సార్లు నెగ్గిన నెపోమ్నియాషి ఉండటంతో మన కుర్రాళ్లకు కష్టమే అనిపించింది. కానీ గుకేశ్‌ సవాళ్లను దాటి, అడ్డంకులను అధిగమించి అనుకున్నది సాధించాడు. ఫిడే సర్క్యూట్‌లో అత్యుత్తమ ప్రదర్శనతో క్యాండిడేట్స్‌ టోర్నీకి అర్హత సాధించిన గుకేశ్‌కు తెలుగు మూలాలున్నాయి. అతని ముత్తాతలు ఏపీలోని పుత్తూరు సమీపంలో ఉండేవాళ్లు. చెన్నైలో స్థిరపడ్డ రజినీకాంత్‌, పద్మ దంపతులకు 2006లో గుకేశ్‌ జన్మించాడు. ఇప్పుడీ స్థాయి వరకు చేరిన గుకేశ్‌ ప్రయాణంలో ఒడుదొడుకులున్నాయి. అతనితో పాటు తల్లిదండ్రులూ ఎన్నో త్యాగాలు చేశారు. ముఖ్యంగా ఈఎన్‌టీ సర్జన్‌ అయిన తండ్రి రజినీకాంత్‌ తన కెరీర్‌నే పక్కనపెట్టేశాడు. తనయుడి కెరీర్‌ కోసం, అతనితో కలిసి టోర్నీలకు విదేశాలకు వెళ్లేందుకు 2017-18లో ఆయన ప్రాక్టీస్‌ ఆపేశారు. మైక్రోబయాలజిస్ట్‌ అయిన తల్లి సంపాదనతోనే ఇల్లు గడిచేది. 2019లో గుకేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌ కావడంతో అతనితో పాటు అమ్మానాన్న కూడా కొత్త లక్ష్యాలను పెట్టుకుని సాగారు.

అలా మొదలై: ఏడేళ్ల వయసులో చెస్‌కు పేరొందిన వేలమ్మల్‌ పాఠశాలలో ఆటపై గుకేశ్‌ ప్రేమ మొదలైంది. 64 గళ్ల బోర్డుపై ఇష్టం అతణ్ని కుదురుగా ఉండనివ్వలేదు. అతనిలో ప్రతిభను గుర్తించిన తల్లిదండ్రులు అండగా నిలిచారు. నాలుగో తరగతి తర్వాత గుకేశ్‌ పూర్తిస్థాయిలో పాఠశాలకు వెళ్లకుండా, ఆటపైనే దృష్టి పెట్టాడు. అక్కడి నుంచి గుకేశ్‌ అంచెలంచెలుగా ఎదిగాడు. ఎత్తులు వేయడంలో త్వరగానే పట్టు సాధించిన అతను అండర్‌-12 ప్రపంచ చెస్‌ యూత్‌ ఛాంపియన్‌గా నిలిచాడు. స్పాన్సర్లు లేకున్నా, ఆర్థికంగా ఇబ్బందులు ఎదురైనా ఆగిపోలేదు. గ్రాండ్‌మాస్టర్‌ అయ్యాక మరింత కష్టపడటం మొదలెట్టాడు. 2020 నుంచి వెస్ట్‌బ్రిడ్జ్‌ ఆనంద్‌ చెస్‌ ఆకాడమీ (వాకా)లో విశ్వనాథన్‌ ఆనంద్‌ మార్గనిర్దేశనంతో గుకేశ్‌ మరో స్థాయికి చేరాడు. స్పాన్సర్‌గా వెస్ట్‌బ్రిడ్జ్‌ క్యాపిటల్‌ కూడా ముందుకు రావడం కలిసొచ్చింది. గెలుపుతో స్ఫూర్తి పొందేవాళ్లను చూసుంటాం. కానీ ఓటమి నుంచి ప్రేరణ పొంది, కసిగా ఆడాలనేది గుకేశ్‌ మంత్రం. స్వీయ నమ్మకంతో ఎలాంటి కఠిన పరిస్థితుల్లోనే చెక్కుచెదరకుండా ఏకాగ్రతతో, ఆత్మవిశ్వాసంతో నిలబడుతున్నాడు. 2022లో దిగ్గజం కార్ల్‌సన్‌పై విజయం సాధించాడు. 2022 ఒలింపియాడ్‌లో మొదటి బోర్డుపై వ్యక్తిగత స్వర్ణం గెలిచాడు. నిరుడు ఆసియా క్రీడల్లో పురుషుల జట్టుతో రజతం సొంతం చేసుకున్నాడు. గతేడాది అత్యధికంగా 2,758 రేటింగ్‌ సాధించిన గుకేశ్‌.. ప్రస్తుతం 2,743 వద్ద ఉన్నాడు. ప్రపంచ చెస్‌లో 2750 రేటింగ్‌ దాటిన పిన్న వయస్సు క్రీడాకారుడూ అతనే.

అతనో రకం: ఇప్పుడు చెస్‌ శిక్షణలో కంప్యూటర్లది కీలక పాత్ర. ఓ గేమ్‌లోని పరిస్థితులను అంచనా వేసి, ఏ ఎత్తు సరైందో అని కంప్యూటర్‌ ప్రోగ్రాంతో కూడిన చెస్‌ ఇంజన్లు చెబుతున్నాయి. కరోనా తర్వాత చదరంగంలో కంప్యూటర్ల వాడకం ఇంకా పెరిగింది. కానీ గుకేశ్‌ మాత్రం మరో రకం. ఈ కంప్యూటర్‌ యుగంలోనూ సంప్రదాయ శిక్షణ, క్లాసికల్‌ ఫార్మాట్‌పై ప్రేమ అతణ్ని భిన్నంగా నిలుపుతోంది. పిన్న వయస్సు (12 ఏళ్ల 7 నెలల 17 రోజులు)లోనే గ్రాండ్‌మాస్టర్‌గా నిలిచిన భారత ఆటగాడిగా చరిత్ర సృష్టించిన గుకేశ్‌.. కేవలం 17 రోజుల తేడాతో ప్రపంచ రికార్డు కోల్పోయాడు. ప్రపంచంలో మూడో అతి పిన్న వయస్సు గ్రాండ్‌మాస్టర్‌గా నిలిచాడు. అలాంటి ఆటగాడు ఆరంభం నుంచి కోచ్‌ల శిక్షణలో, బోర్డుపై గేమ్‌లు ఆడుతూ ఎదిగాడు. ఎలో రేటింగ్‌ 2500 దాటిన తర్వాతే గుకేశ్‌ చెస్‌ ఇంజన్ల సాయం తీసుకున్నాడు. 36 ఏళ్లలో తొలిసారి విశ్వనాథన్‌ ఆనంద్‌ను వెనక్కినెట్టి నిరుడు గుకేశ్‌ భారత టాప్‌ ర్యాంకు ఆటగాడిగా నిలిచాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు