యువరాజు వచ్చేశాడు

 భారత్‌లో ఆదివారం అర్ధరాత్రి. అందరూ గాఢ నిద్రలో ఉండగా.. అక్కడ కెనడాలో ఓ యువరాజు ప్రతిష్ఠాత్మకమైన కిరీటాన్ని ధరించాడు.

Updated : 23 Apr 2024 07:32 IST

 క్యాండిడేట్స్‌ చెస్‌ టోర్నీలో గుకేశ్‌ గెలుపు
 పిన్న వయసు విజేతగా ప్రపంచ రికార్డు
 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు అర్హత

 భారత్‌లో ఆదివారం అర్ధరాత్రి. అందరూ గాఢ నిద్రలో ఉండగా.. అక్కడ కెనడాలో ఓ యువరాజు ప్రతిష్ఠాత్మకమైన కిరీటాన్ని ధరించాడు. 17 ఏళ్ల వయసులోనే 64 గళ్ల కురుక్షేత్రంలో.. 7 మంది బలమైన ప్రత్యర్థులను ఓడించి విజేతగా నిలిచాడు. ప్రపంచ మహా సమరానికి సై అంటున్న ఆ యువరాజు పేరు.. దొమ్మరాజు గుకేశ్‌. ఈ చెన్నై టీనేజర్‌ సంచలనం సృష్టించాడు. ప్రపంచంలోని అత్యుత్తమ చదరంగ క్రీడాకారులు తలపడ్డ క్యాండిడేట్స్‌ టోర్నీలో జయకేతనం ఎగురవేశాడు. ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌షిప్‌కు అర్హత సాధించాడు.
ఈ ఘనత సాధించిన అతి పిన్న వయసు ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.

టొరంటో

గుకేశ్‌ సాధించాడు. అవును.. ప్రపంచ చదరంగ వేదికపై మరోసారి భారత సత్తా చాటాడు. క్యాండిడేట్స్‌ టోర్నీలో విజేతగా నిలిచాడు. ప్రపంచ టైటిల్‌ కోసం డిఫెండింగ్‌ ఛాంపియన్‌ డిన్‌ లిరెన్‌ (చైనా)తో తలపడేందుకు అర్హత సాధించాడు. విశ్వనాథన్‌ ఆనంద్‌ (2014) తర్వాత క్యాండిడేట్స్‌ టోర్నీ గెలిచిన రెండో భారత ఆటగాడు గుకేశ్‌. ఆదివారం అర్ధరాత్రి తర్వాత జరిగిన చివరిదైన 14వ రౌండ్లో హికరు నకముర (అమెరికా)తో గేమ్‌ను డ్రా చేసుకున్న గుకేశ్‌ విజేతగా అవతరించాడు. మొత్తం 9 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. 13 రౌండ్లు ముగిసే సరికి గుకేశ్‌ 8.5 పాయింట్లతో నిలవగా.. నకముర, కరువానా (అమెరికా), నెపోమ్నియాషి (రష్యా) తలో 8 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నారు. గేమ్‌లో గెలిస్తే మిగతా వాళ్ల గేమ్‌లతో సంబంధం లేకుండా టైటిల్‌ గుకేశ్‌ సొంతమవుతుందనే పరిస్థితి. ఒకవేళ డ్రా చేసుకుంటే.. అప్పుడు కరువానా, నెపోమ్నియాషి మధ్య గేమ్‌లో ఎవరైనా గెలిస్తే అప్పుడు గుకేశ్‌తో సమానమయ్యేవాళ్లు. అలా జరిగితే విజేత తేలేవరకు టైబ్రేక్‌ నిర్వహించేవాళ్లు. చివరి రౌండ్లో నల్లపావులతో గుకేశ్‌ మెరుగైన ప్రదర్శన చేశాడు.    నకమురాను నిలువరించాడు. 71 ఎత్తుల్లో ఈ గేమ్‌ డ్రాగా ముగిసింది. ఇక ఆ తర్వాత   కరువాన, నెపోమ్నియాషి గేమ్‌ కూడా డ్రా  కావడంతో గుకేశ్‌ ఖాతాలో టైటిల్‌ చేరింది. ఈ టోర్నీలో గుకేశ్‌ కేవలం ఒక్క గేమ్‌లోనే (ఏడో రౌండ్లో అలీరెజాతో) ఓడిపోయాడు. 5 గేమ్‌ల్లో గెలిచిన అతను, మరో 8 గేమ్‌లు డ్రా చేసుకున్నాడు. నకముర, నెపోమ్నియాషి, కరువానా తలో 8.5 పాయింట్లతో వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాల్లో నిలిచారు. ప్రజ్ఞానంద (7) అయిదు, విదిత్‌ గుజరాతి (6) ఆరో స్థానంతో టోర్నీని ముగించారు. గుకేశ్‌కు సుమారు రూ.78.5 లక్షల నగదు బహుమతి కూడా దక్కింది.

రన్నరప్‌గా హంపి

మహిళల క్యాండిడేట్స్‌ టోర్నీలో తెలుగమ్మాయి కోనేరు హంపి రన్నరప్‌గా నిలిచింది. ఆఖరి రౌండ్లో ఆమె 62 ఎత్తుల్లో తింగ్‌జీ లీ (చైనా)పై గెలిచింది. లీ, వైశాలి కూడా 7.5 పాయింట్లతో హంపికి సమంగా నిలిచారు. కానీ మెరుగైన టైబ్రేక్‌ స్కోరు ఆధారంగా హంపికి రెండో స్థానం దక్కింది.  చైనా అమ్మాయి జ్యోంగి తాన్‌(9) టైటిల్‌ గెలుచుకుంది.

అందుకే క్యాండిడేట్స్‌..

ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌షిప్‌లో ఇద్దరే పోటీపడతారు. ఒకరు డిఫెండింగ్‌ ఛాంపియన్‌.. మరొకరు ఛాలెంజర్‌. క్యాండిడేట్స్‌ టోర్నమెంట్‌ నెగ్గిన ఆటగాడే ఛాలెంజర్‌. క్వాలిఫికేషన్‌ ప్రకియ ద్వారా ఎనిమిది మంది ఆటగాళ్లను క్యాండిడేట్స్‌ టోర్నీకి ఎంపిక చేస్తారు.

1

పిన్న వయసులో క్యాండిడేట్స్‌ టోర్నీ గెలిచి, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు అర్హత సాధించిన ఆటగాళ్లలో గుకేశ్‌ (17 ఏళ్లు) స్థానం. కాస్పరోవ్‌ (1984లో 22 ఏళ్లు) రికార్డును గుకేశ్‌ బద్దలుకొట్టాడు.

ఫిడే క్యాండిడేట్స్‌ టోర్నీ గెలిచిన అత్యంత పిన్నవయస్కుడిగా గుకేశ్‌ నిలిచినందుకు భారత్‌ ఎంతో గర్విస్తోంది. టోర్నీలో గుకేశ్‌ సాధించిన ఘనత అతడి అసాధారణ ప్రతిభ, అంకితభావానికి నిదర్శనం. అతడి విశేష ప్రదర్శన, ప్రయాణం కోట్ల మందికి ప్రేరణ.

 ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని