జుట్టు కత్తిరించడమే మార్గమనుకుని..

పారిస్‌ ఒలింపిక్స్‌ క్వాలిఫయర్స్‌ ఆరంభానికి ముందు రోజు బరువును తగ్గించుకోవడం కోసం చాలా ఇబ్బందిపడ్డానని వినేశ్‌ తెలిపింది. 50 కేజీల విభాగంలో పోటీపడాల్సి ఉండగా నిర్ణీత బరువు కంటే కాస్త ఎక్కువ ఉండడంతో కలవరం రేగిందని ఆమె తెలిపింది.

Published : 24 Apr 2024 01:55 IST

 

ముంబయి: పారిస్‌ ఒలింపిక్స్‌ క్వాలిఫయర్స్‌ ఆరంభానికి ముందు రోజు బరువును తగ్గించుకోవడం కోసం చాలా ఇబ్బందిపడ్డానని వినేశ్‌ తెలిపింది. 50 కేజీల విభాగంలో పోటీపడాల్సి ఉండగా నిర్ణీత బరువు కంటే కాస్త ఎక్కువ ఉండడంతో కలవరం రేగిందని ఆమె తెలిపింది. ‘‘క్వాలిఫయర్స్‌ టోర్నీ ఆరంభానికి ముందురోజు రాత్రి చాలా టెన్షన్‌ పడ్డా. కావాల్సిన బరువు కంటే కాస్త ఎక్కువ బరువు ఉండడమే కారణం. కనీసం 700 గ్రాములు బరువును తగ్గించాల్సి వచ్చింది. ఇందుకోసం రోజంతా ఏమీ తినలేదు. బిష్కెక్‌కు వెళ్లేటప్పుడు కేవలం 500 మిల్లీ లీటర్ల నీళ్లే తాగా. శరీర బరువు తగ్గించడం కోసం కోచ్‌ అకోస్‌ తీవ్రంగా ప్రయత్నించాడు. వేడి గదిలో ఉంచి.. ఆకులతో కూడిన చెట్టుకొమ్మను వేడి నీళ్లలో ముంచి శరీరంపై కొట్టాడు కూడా. చెమటలు పట్టించడం ద్వారా బరువును కోల్పోయేలా చేయడం ఆయన ఉద్దేశం. దీని వల్ల ఎక్కువ ఇబ్బందిగా అనిపించింది. శరీరం మండిపోయింది. ఉక్కిరిబిక్కిరి అయ్యా. బరువు తగ్గించాలని జుట్టు కూడా కత్తిరించే ప్రయత్నం చేశాడు. బరువు తగ్గించుకునేందుకు ఫోన్‌లో చాలామంది సలహాలు ఇస్తుంటే భరించలేక ఫోన్‌ ఆపి పడుకున్నా. మరుసటి రోజు ఉదయం అందరికంటే ముందే పోటీ వేదికకు చేరుకున్నా. ఒకవేళ బరువు ఎక్కువ ఉంటే నిర్ణీత సమయంలో తగ్గించుకోవచ్చన్నది ఆలోచన. కానీ బరువు కొలిచినప్పుడు 49.9 కిలోలు చూపించడంతో ఊపిరి పీల్చుకున్నాం’’ అని ఫొగాట్‌ వివరించింది. 2022 తర్వాత అంతర్జాతీయ పోటీల్లో బరిలో దిగన వినేశ్‌.. క్వాలిఫయర్స్‌లో సత్తా చాటి పారిస్‌ ఒలింపిక్స్‌ బెర్తు దక్కించుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని