లఖ్‌నవూ.. అక్కడా ఇక్కడా!

ఐపీఎల్‌లో ఎంతో నిలకడగా ఆడే జట్లలో చెన్నై సూపర్‌కింగ్స్‌ ఒకటి. లఖ్‌నవూతో మ్యాచ్‌ అంటే చెన్నైనే ఎక్కువమంది ఫేవరెట్‌గా పరిగణిస్తారు. కానీ ఆ జట్టు చేతిలో సూపర్‌కింగ్స్‌కు వరుసగా రెండు ఓటములు తప్పలేదు.

Updated : 24 Apr 2024 02:16 IST

చెన్నైపై రెండో విజయం
స్టాయినిస్‌ సంచలన శతకం
రుతురాజ్‌ సెంచరీ, దూబె మెరుపులు వృథా

ఐపీఎల్‌లో ఎంతో నిలకడగా ఆడే జట్లలో చెన్నై సూపర్‌కింగ్స్‌ ఒకటి. లఖ్‌నవూతో మ్యాచ్‌ అంటే చెన్నైనే ఎక్కువమంది ఫేవరెట్‌గా పరిగణిస్తారు. కానీ ఆ జట్టు చేతిలో సూపర్‌కింగ్స్‌కు వరుసగా రెండు ఓటములు తప్పలేదు. లఖ్‌నవూలో స్కోరు 160 దాటితే గెలిచినట్లే అంటారు. కానీ అక్కడ 176 పరుగులు చేసి కూడా ఆతిథ్య జట్టు చేతిలో ఓడిపోయింది. వెంటనే తన సొంతగడ్డపై చెన్నై.. అదే ప్రత్యర్థి మీద 210 పరుగుల భారీ స్కోరు సాధించింది. కానీ ఛేదన అసాధ్యంలా కనిపించిన మ్యాచ్‌లోనూ లఖ్‌నవూ తగ్గలేదు. విధ్వంసక శతకం సాధించిన స్టాయినిస్‌.. చెన్నై సారథి రుతురాజ్‌ సెంచరీకి, దూబె మెరుపులకు విలువ లేకుండా చేశాడు.

చెన్నై

పీఎల్‌-17లో లఖ్‌నవూ సూపర్‌జెయింట్స్‌.. చెన్నైకి వరుసగా రెండో మ్యాచ్‌లోనూ చెక్‌ పెట్టింది. తన సొంతగడ్డపైనే కాక ప్రత్యర్థి మైదానంలోనూ ఆ జట్టును ఓడించింది. మంగళవారం ఎల్‌ఎస్‌జీ 6 వికెట్ల తేడాతో సీఎస్‌కేను ఓడించింది. 211 పరుగుల లక్ష్యాన్ని ఆ జట్టు 19.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ మార్కస్‌ స్టాయినిస్‌ (124 నాటౌట్‌; 63 బంతుల్లో 13×4, 6×6) అద్భుత శతకంతో అజేయంగా నిలిచాడు. పూరన్‌ (34; 15 బంతుల్లో 3×4, 2×6) కూడా విలువైన ఇన్నింగ్స్‌ ఆడాడు. చెన్నై బౌలర్లలో పతిరన (2/35) ఆకట్టుకున్నాడు. మొదట రుతురాజ్‌ గైక్వాడ్‌ (108 నాటౌట్‌; 60 బంతుల్లో 12×4, 3×6) శతకానికి శివమ్‌ దూబె (66; 27 బంతుల్లో 3×4, 7×6) మెరుపులు తోడవడంతో చెన్నై 4 వికెట్లకు 210 పరుగులు చేసింది.

పేలవంగా మొదలై..: భారీ లక్ష్య ఛేదనలో లఖ్‌నవూకు ఆశించిన ఆరంభం దక్కలేదు. చెన్నైతోనే జరిగిన గత మ్యాచ్‌లో అదిరే ఆరంభంతో జట్టును గెలిపించిన రాహుల్‌, డికాక్‌ ఈ మ్యాచ్‌లో ఎక్కువసేపు నిలవలేదు. దీపక్‌ చాహర్‌ బౌలింగ్‌లో ఇన్నింగ్స్‌ మూడో బంతినే వికెట్ల మీదికి ఆడుకుని డికాక్‌ (0) వెనుదిరిగితే.. తుషార్‌ బౌలింగ్‌లో సిక్స్‌ కొట్టి ఊపుమీద కనిపించిన రాహుల్‌ను అయిదో ఓవర్లో ముస్తాఫిజుర్‌ ఔట్‌ చేశాడు. అయితే మూడో స్థానంలో వచ్చిన స్టాయినిస్‌.. ఆరంభం నుంచే చెలరేగి ఆడడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా వచ్చిన పడిక్కల్‌ (19 బంతుల్లో 13) మరోసారి పేలవ ప్రదర్శన చేసినా.. స్టాయినిస్‌ ఎల్‌ఎస్‌జీని పోటీలోనే ఉంచాడు. పడిక్కల్‌ను ఔట్‌ చేయడం లఖ్‌నవూకు మంచే చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన పూరన్‌ టాప్‌ గేర్‌ అందుకోవడానికి ఎంతో సమయం పట్టలేదు. స్టాయినిస్‌ కూడా దూకుడు కొనసాగించడంతో 15 ఓవర్లకు 137/3తో ఎల్‌ఎస్‌జీ మంచి స్థితిలోనే నిలిచింది. 5 ఓవర్లలో 74 పరుగులు అవసరమైన స్థితిలో శార్దూల్‌ ఓవర్లో పూరన్‌ వరుసగా 6, 4, 6 బాదాడు. ఈ ఓవర్లో 20 పరుగులొచ్చాయి. దీంతో సమీకరణం అందుబాటులోకి వచ్చింది. కానీ పతిరన తర్వాతి ఓవర్లో పూరన్‌ను ఔట్‌ చేయడమే కాక 7 పరుగులే ఇచ్చి చెన్నైకి ఉపశమనాన్నిచ్చాడు. అయినా లఖ్‌నవూ ఆశలు వదులుకోలేదు. ముస్తాఫిజుర్‌ వేసిన 18వ ఓవర్లో స్టాయినిస్‌, హుడా   (17 నాటౌట్‌) చెరో సిక్స్‌ బాదగా.. పతిరన సైతం 19వ ఓవర్లో 15 పరుగులు సమర్పించుకోవడంతో మ్యాచ్‌ తీవ్ర ఉత్కంఠభరితంగా మారింది. చివరి ఓవర్లో 17 పరుగులు అవసరం కాగా.. 6, 4, 4, 4తో స్టాయినిస్‌ మ్యాచ్‌ను ముగించాడు.

రుతురాజ్‌, దూబె ధనాధన్‌: మొదట టాస్‌ గెలిచిన లఖ్‌నవూ బౌలింగ్‌ ఎంచుకోగా.. అంతకుముందే పిచ్‌ను పరిశీలించిన వ్యాఖ్యాతలు వికెట్‌ నెమ్మదిగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. హెన్రీ వేసిన తొలి ఓవర్లో చెన్నై.. రహానె (1) వికెట్‌ను కోల్పోయి 5 పరుగులే చేయడంతో అంచనాలు నిజమే అనిపించింది. తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన మిచెల్‌ (11), జడేజా (16)ల తడబాటు చూసినా పిచ్‌ నెమ్మదిగా ఉన్నట్లే కనిపించింది. కానీ మరో ఎండ్‌లో కెప్టెన్‌ రుతురాజ్‌ బ్యాటింగ్‌ చూస్తే మాత్రం పిచ్‌లో ఏమీ లేదని అర్థమైపోయింది. ఇక శివమ్‌ దూబె అయితే చెపాక్‌ను ఫ్లాట్‌ పిచ్‌గా మార్చేశాడు. మామూలుగా ఓ మోస్తరు వేగంతో ఆడే రుతురాజ్‌.. ఈ మ్యాచ్‌లో మాత్రం మెరుపు షాట్లతో చెలరేగిపోయాడు. 160కి పైగా స్ట్రైక్‌ రేట్‌తో బ్యాటింగ్‌ చేశాడు. దూబె అయితే సిక్సర్లు కొట్టడానికే ప్రాధాన్యమిచ్చాడు. స్పిన్నర్లు బౌలింగ్‌ చేస్తే దూబెకు పండగే అని.. బిష్ణోయ్‌, కృనాల్‌లతో రెండేసి ఓవర్లే వేయించి ఆపేసిన ఎల్‌ఎస్‌జీ కెప్టెన్‌.. పేసర్లనే కొనసాగించినా ఫలితం లేకపోయింది. యశ్‌ ఠాకూర్‌ వేసిన 16వ ఓవర్లో దూబె వరుసగా మూడు సిక్సర్లు బాదేశాడు. మిగతా బౌలర్లకూ అతను చుక్కలు చూపించాడు. దూబె వచ్చే వరకు ఓ ఎండ్‌లో ధాటిగా ఆడుతూ రుతురాజ్‌ స్కోరింగ్‌ రేట్‌ను పెంచితే.. ఆ తర్వాత అతను సహాయ పాత్రే పోషించాడు. దూబె సిక్సర్ల మోత మోగిస్తూ చెన్నైకి ఊహించని స్కోరునందించాడు. 22 బంతుల్లోనే అతడి అర్ధశతకం పూర్తయింది. మరోవైపు 28 బంతుల్లో అర్ధశతకం సాధించిన రుతురాజ్‌.. అన్నే బంతుల్లో ఇంకో 50 పరుగులు చేసి శతకాన్నందుకున్నాడు. చివరి 8 ఓవర్లలో చెన్నై 108 పరుగులు రాబట్టింది.

చెన్నై ఇన్నింగ్స్‌: రహానె (సి) రాహుల్‌ (బి) హెన్రీ 1; రుతురాజ్‌ నాటౌట్‌ 108; మిచెల్‌ (సి) దీపక్‌ హుడా (బి) యశ్‌ 11; జడేజా (సి) రాహుల్‌ (బి) మోసిన్‌ 16; దూబె రనౌట్‌ 66; ధోని నాటౌట్‌ 4; ఎక్స్‌ట్రాలు 4 మొత్తం: (20 ఓవర్లలో 4 వికెట్లకు) 210; వికెట్ల పతనం: 1-4, 2-49, 3-101, 4-205; బౌలింగ్‌: హెన్రీ 4-0-28-1; మోసిన్‌ 4-0-50-1; రవి బిష్ణోయ్‌ 2-0-19-0; యశ్‌ ఠాకూర్‌ 4-0-47-1; స్టాయినిస్‌ 4-0-49-0; కృనాల్‌ 2-0-15-0

లఖ్‌నవూ ఇన్నింగ్స్‌: డికాక్‌ (బి) చాహర్‌ 0; రాహుల్‌ (సి) రుతురాజ్‌ (బి) ముస్తాఫిజుర్‌ 16; స్టాయినిస్‌ నాటౌట్‌ 124; పడిక్కల్‌ (బి) పతిరన 13; పూరన్‌ (సి) శార్దూల్‌ (బి) పతిరన 34; హుడా నాటౌట్‌ 17; ఎక్స్‌ట్రాలు 9 మొత్తం: (19.3 ఓవర్లలో 4 వికెట్లకు) 213; వికెట్ల పతనం: 1-0, 2-33, 3-88, 4-158; బౌలింగ్‌: దీపక్‌ చాహర్‌ 2-0-11-1; తుషార్‌ దేశ్‌పాండే 3-0-34-0; ముస్తాఫిజుర్‌ 3.3-0-51-1; శార్దూల్‌ 3-0-42-0; మొయిన్‌ అలీ 2-0-21-0; జడేజా 2-0-16-0; పతిరన 4-0-35-2


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని