దీపాన్షుకు జావెలిన్‌ స్వర్ణం

ఆసియా అండర్‌-20 అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్స్‌ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్‌ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు.

Published : 25 Apr 2024 03:18 IST

ఆసియా అండర్‌-20 అథ్లెటిక్స్‌

 

దిల్లీ: ఆసియా అండర్‌-20 అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్స్‌ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్‌ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. 70.29 మీటర్ల త్రోతో దీపాన్షు విజేతగా నిలిచాడు. రోహన్‌ (70.03) రజతం సాధించాడు. పురుషుల 1500మీ పరుగులో ప్రియాన్షు రజతం (3:50.85) గెలుచుకున్నాడు. పురుషుల డిస్కస్‌ త్రోలో రితిక్‌ రజతం సొంతం చేసుకున్నాడు. మహిళల 3000మీ పరుగులో ప్రాచి అంకుష్‌ త్రుటిలో కాంస్యం చేజార్చుకుంది. ఆమె నాలుగో స్థానంలో నిలిచింది.


ఫ్రెంచ్‌ ఓపెన్‌లో ఆడతానో లేదో..

మాడ్రిడ్‌: పూర్తిగా ఫిట్‌గా లేకున్నా రఫెల్‌ నాదల్‌ మాడ్రిడ్‌ ఓపెన్‌లో ఆడనున్నాడు. అతడు ఫ్రెంచ్‌ ఓపెన్‌లో ఆడడంపై మాత్రం అనిశ్చితి కొనసాగుతోంది. ఫిట్‌నెస్‌ ప్రస్తుతం ఉన్నట్లే ఉంటే ఫ్రెంచ్‌ ఓపెన్‌లో ఆడబోనని నాదల్‌ చెప్పాడు. ‘‘శారీరకంగా ఈ వారం అంత బాగా అనిపించట్లేదు. అది మాడ్రిడ్‌ కాకపోతే.. ఈ వారం ఆ టోర్నీలో ఆడేవాణ్ని కాదు. తర్వాతి మూడు వారాల్లో ఏం జరుగుతుందో తెలియదు. పోరాడుతూనే ఉంటా. పారిస్‌లో ఆడడం కోసం చేయాల్సిందంతా చేస్తా. ఇప్పుడున్నట్లే ఉంటే మాత్రం ఫ్రెంచ్‌ ఓపెన్‌లో ఆడను’’ అని అన్నాడు. టెన్నిస్‌లో తనకు ఇదే చివరి ఏడాది కావొచ్చని 37 ఏళ్ల నాదల్‌ ఇంతకుముందు చెప్పాడు.


ముంబయి విజయం

మార్గోవా: ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ ఫుట్‌బాల్‌ తొలి అంచె సెమీఫైనల్లో ముంబయి సిటీ విజయం సాధించింది. బుధవారం 3-2తో గోవా ఎఫ్‌సీని ఓడించింది. బోరిస్‌ సింగ్‌ (16వ నిమిషం), బ్రాండన్‌ ఫెర్నాండెజ్‌ (56వ) గోల్స్‌తో ఆధిక్యంలోకి వెళ్లిన గోవానే గెలిచేలా కనిపించింది. ఆఖరి 6 నిమిషాల్లో అద్భుతంగా పుంజుకున్న ముంబయి అనూహ్య విజయాన్ని అందుకుంది. చాగటె స్వల్ప వ్యవధిలో రెండు గోల్స్‌ సాధించగా.. మరో గోల్‌ను విక్రమ్‌ కొట్టాడు.


రెజ్లింగ్‌ అథ్లెట్ల కమిషన్‌ ఛైర్మన్‌గా నర్సింగ్‌

వారణాసి: భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) అథ్లెట్ల కమిషన్‌ ఛైర్మన్‌గా నర్సింగ్‌ యాదవ్‌ ఎన్నికయ్యాడు. ఈ కమిషన్‌లోని ఏడు స్థానాలకు ఎనిమిది మంది పోటీపడగా బుధవారం ఎన్నికలు నిర్వహించారు. ఇందులో గెలిచిన సాహిల్‌ (దిల్లీ), స్మిత (కేరళ), భార్తి (ఉత్తరప్రదేశ్‌), ఖుష్బు (గుజరాత్‌), నిక్కి (హరియాణా), శ్వేత (బెంగాల్‌) కలిసి నర్సింగ్‌ను అధ్యక్షుడిగా ఎంచుకున్నారు. డబ్ల్యూఎఫ్‌ఐపై నిషేధం ఎత్తివేసే సమయంలో ఈ ఏడాది జులై 1లోపు అథ్లెట్ల కమిషన్‌ను ఏర్పాటు చేయాలని యునైటెడ్‌ ప్రపంచ రెజ్లింగ్‌ షరతు విధించింది. ఈ నేపథ్యంలో డబ్ల్యూఎఫ్‌ఐ ఇప్పుడా ప్రక్రియ పూర్తిచేసింది. కామన్వెల్త్‌ క్రీడల్లో పసిడి గెలిచిన నర్సింగ్‌ యాదవ్‌ 2012 ఒలింపిక్స్‌లోనూ పోటీపడ్డాడు. 2016 రియో ఒలింపిక్స్‌కూ అర్హత సాధించాడు. కానీ గాయం కారణంగా అర్హత టోర్నీకి దూరమైన రెండు సార్లు ఒలింపిక్‌ పతక విజేత సుశీల్‌ కుమార్‌.. నర్సింగ్‌తో ట్రయల్‌ కోసం దిల్లీ కోర్టును ఆశ్రయించాడు. కానీ అతని విన్నపాన్ని కోర్టు తిరస్కరించింది. మరోవైపు ఒలింపిక్స్‌కు ముందు రెండు డోప్‌ పరీక్షల్లోనూ నర్సింగ్‌ పాజిటివ్‌గా తేలడంతో అతనిపై క్రీడా ఆర్బిట్రేషన్‌ కోర్టు నాలుగేళ్ల నిషేధం విధించింది. డోపీగా తేలేలా తనపై కుట్ర చేశారని జాతీయ డోపింగ్‌ నిరోధక సంస్థ (నాడా)కు నర్సింగ్‌ నివేదించడంతో అతణ్ని ఒలింపిక్స్‌కు పంపించారు. కానీ ఆర్బిట్రేషన్‌ కోర్టు తీర్పుతో నర్సింగ్‌ ఒలింపిక్స్‌లో పోటీపడకుండానే రియో నుంచి వచ్చేశాడు.


కాంట్రాక్టు పోతేనేం.. ఆడితే చాలు!

చెన్నై: క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) సెంట్రల్‌ కాంట్రాక్టుల నుంచి తనను తప్పించడంపై ఎలాంటి బాధా లేదని.. దేశానికి ఆడితే చాలని మార్కస్‌ స్టాయినిస్‌ అన్నాడు. ఐపీఎల్‌లో లఖË్నవూ సూపర్‌ జెయింట్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌.. మంగళవారం చెన్నైపై అద్భుత శతకం (63 బంతుల్లో 124 నాటౌట్‌)తో జట్టుకు సంచలన విజయాన్నందించాడు. అయితే ఐపీఎల్‌లో సత్తా చాటుతున్న స్టాయినిస్‌కు ఇటీవలే ప్రకటించిన సెంట్రల్‌ కాంట్రాక్టుల జాబితాలో సీఏ మొండిచేయి చూపించింది. కాంట్రాక్టులో ఉండడం కంటే ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహించడమే తనకు ముఖ్యమని స్టాయినిస్‌ అన్నాడు. ‘‘ఆస్ట్రేలియా కోచ్‌ మెక్‌డొనాల్డ్‌తో నాకు మంచి సంబంధాలున్నాయి. నాకు కాంట్రాక్టు దక్కదని ముందే తెలుసు. నా స్థానంలో ఓ యువ ఆటగాడికి అవకాశం దక్కితే నేను సంతోషిస్తా. ఇది నాకు సమస్యే కాదు. కానీ ఆట పరంగా నేనెప్పుడూ జట్టుకు అందుబాటులో ఉండాలనుకుంటా. గొప్ప పోటీ ఉండే ఐపీఎల్‌ లాంటి టోర్నీ ఉండడం మా అదృష్టం. అందుకే నేను ఈ లీగ్‌ను ఎంతో ఇష్టపడతా’’ అని స్టాయినిస్‌ చెప్పాడు.


విజేతలు సిఫ్ట్‌, నీరజ్‌

దిల్లీ: ఒలింపిక్‌ సెలెక్షన్‌ ట్రయల్స్‌ 50 మీటర్ల రైఫిల్‌ త్రీ పొజిషన్స్‌ విభాగంలో సిఫ్ట్‌ కౌర్‌ సమ్రా, నీరజ్‌ కుమార్‌ విజేతలుగా నిలిచారు. బుధవారం మహిళల ఫైనల్లో సిఫ్ట్‌ (466.3) ప్రథమ స్థానం సాధించింది. ఆశి చోక్సీ (462.6) రన్నరప్‌గా నిలిచింది. అంజుమ్‌ మౌద్గిల్‌ (449.2), నిశ్చల్‌ (433.6), శ్రియాంక సదాంగి (416.7) వరుసగా తర్వాతి స్థానాలు సాధించారు. పురుషుల విభాగంలో నీరజ్‌ (462.2), స్వప్నిల్‌ కుశాలె (460.9), ఐశ్వరి తోమర్‌ (450.5), చైన్‌ సింగ్‌ (439.8), అఖిల్‌ షెరాన్‌ (429.1) వరుసగా మొదటి అయిదు స్థానాల్లో నిలిచారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని