ఫైనల్లో జ్యోతి జట్టు

ఆర్చరీ ప్రపంచకప్‌లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్‌ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది.

Updated : 25 Apr 2024 09:38 IST

జాతీయ రికార్డుతో మెరిసిన ధీరజ్‌

షాంఘై: ఆర్చరీ ప్రపంచకప్‌లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్‌ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. బుధవారం సెమీస్‌లో జ్యోతి, అదితి, పర్ణీత్‌ కౌర్‌ త్రయం 235-230 తేడాతో ఎస్తోనియాపై విజయం సాధించింది. ఈ పోరులో టాప్‌సీడ్‌ భారత్‌ అయిదో సీడ్‌ ప్రత్యర్థిపై మెరుగైన ప్రదర్శన చేసింది. తొలి రౌండ్‌లో 59-60తో వెనుకబడ్డప్పటికీ గొప్పగా పుంజుకున్న భారత అమ్మాయిలు రెండో రౌండ్‌లో 59-55తో ఓవరాల్‌గా మూడు పాయింట్ల ఆధిక్యం సాధించారు. మూడో రౌండ్లోనూ 60-57తో జోరు ప్రదర్శించారు. చివరి రౌండ్లో 57-58తో నిలిచినా విజయం ఖాయమైంది. అభిషేక్‌ వర్మ, ప్రథమేశ్‌, ప్రియాన్ష్‌తో కూడిన కాంపౌండ్‌ పురుషుల జట్టు కూడా తుదిపోరుకు అర్హత సాధించింది. సెమీస్‌లో నాలుగో సీడ్‌ భారత్‌ 235-233తో టాప్‌సీడ్‌ దక్షిణ కొరియాను కంగుతినిపించింది. శనివారం కాంపౌండ్‌ టీమ్‌ ఫైనల్లో భారత మహిళల జట్టు ఇటలీతో, పురుషుల జట్టు నెదర్లాండ్స్‌తో తలపడతాయి. మరోవైపు రికర్వ్‌ వ్యక్తిగత విభాగం క్వాలిఫయర్స్‌లో మరో తెలుగు ఆర్చర్‌ బొమ్మదేవర ధీరజ్‌ అదరగొట్టాడు. 693 పాయింట్లతో జాతీయ రికార్డు (తరుణ్‌దీప్‌ రాయ్‌- 689)ను తిరగరాశాడు. మూడో సీడ్‌ సాధించాడు. తరుణ్‌దీప్‌ (684) ఏడో స్థానంలో నిలిచాడు. పురుషుల జట్టు రెండో స్థానాన్ని దక్కించుకుంది. రికర్వ్‌ మహిళల క్వాలిఫయర్స్‌లో అంకిత (664), భజన్‌ కౌర్‌ (657), దీపిక కుమారి (656) వరుసగా 15, 29, 30వ స్థానాల్లో నిలిచారు. జట్టు ఆరో స్థానాన్ని కైవసం చేసుకుంది.


శ్రీశంకర్‌ మోకాలికి శస్త్రచికిత్స

దిల్లీ: భారత స్టార్‌ లాంగ్‌ జంపర్‌ మురళీ శ్రీశంకర్‌ మోకాలికి దోహాలో శస్త్రచికిత్స జరిగింది. గాయం వల్ల అతడు ఇంతకుముందే పారిస్‌ ఒలింపిక్స్‌కు దూరమయ్యాడు. ‘‘శస్త్రచికిత్స విజయవంతమైంది. కష్ట కాలంలో నాపై ప్రేమ చూపించిన అందరికీ  కృతజ్ఞతలు. శస్త్రచికిత్స జరిగి 18 గంటలైంది. అప్పుడే నేను నడుస్తున్నాను’’ అని శ్రీశంకర్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నాడు. 25 ఏళ్ల శ్రీశంకర్‌ ఈ నెలలో పాలక్కడ్‌లో సాధన చేస్తుండగా గాయపడ్డాడు. 2023 జులైలోనే అతడు ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. నిరుడు జూన్‌లో డైమండ్‌ లీగ్‌లో శ్రీశంకర్‌ మూడో స్థానంలో నిలిచాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని