300 కొట్టేస్తారా?

ఈ సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్‌రైజర్స్‌ పొట్టి లీగ్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది.

Updated : 25 Apr 2024 09:37 IST

జోరుమీద సన్‌రైజర్స్‌

ఈనాడు, హైదరాబాద్‌: 277/3.. 287/3.. 125/0 (పవర్‌ ప్లే).. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్‌రైజర్స్‌ పొట్టి లీగ్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. విధ్వంసకర బ్యాటింగ్‌.. ఊచకోత ఇన్నింగ్స్‌లతో ప్రత్యర్థి జట్లతో చెడుగుడు ఆడుతున్న సన్‌రైజర్స్‌ సొంతగడ్డపై మరో సమరానికి సిద్ధమైంది. గురువారం ఉప్పల్‌ స్టేడియంలో జరిగే మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో సన్‌రైజర్స్‌ తలపడనుంది. సరిగ్గా పది రోజుల క్రితం బెంగళూరుపై అత్యధిక స్కోరు (287)తో అదరగొట్టిన సన్‌రైజర్స్‌ ఈసారి 300 స్కోరుతో చరిత్ర సృష్టిస్తుందా? అన్నది చూడాలి.

ఉప్పల్‌ స్టేడియంలో ముంబయి ఇండియన్స్‌తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ 277 పరుగులతో ఒక్కసారిగా ఐపీఎల్‌-17లో ఊపు తీసుకొచ్చింది. ఇదేదో గాలివాటం అనుకునేలోపు వారం రోజులు తిరక్కుండానే తన రికార్డును తానే బద్దలు కొట్టింది సన్‌రైజర్స్‌. బెంగళూరుతో 287 పరుగులతో సరికొత్త రికార్డు లఖించింది. అనంతరం దిల్లీ క్యాపిటల్స్‌తో పోరులో పవర్‌ ప్లే (తొలి 6 ఓవర్లలో) 125/0తో అత్యధిక స్కోరుతో చెలరేగింది. ఆరంభంలో హెడ్‌, అభిషేక్‌.. మిడిలార్డర్‌లో క్లాసెన్‌, నితీశ్‌ ఆకాశమే హద్దుగా రెచ్చిపోతుంటే రికార్డుల మోతతో స్టేడియాలు హోరెత్తుతున్నాయి. మరోవైపు కూర్పు కుదరక.. వరుస పరాజయాలతో తీవ్ర ఒత్తిడిలో కూరుకుపోయిన బెంగళూరు ఇప్పటికే ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి దాదాపుగా నిష్క్రమించింది. కోహ్లి, కార్తీక్‌ పోరాడుతున్నా.. మిగతా ఆటగాళ్లు ఘోరంగా విఫలమవడంతో ఆ జట్టుకు ఈ సీజన్‌ చేదు అనుభవాన్నే మిగిల్చింది. కెప్టెన్‌ డుప్లెసి, కామెరూన్‌ గ్రీన్‌ ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడం బెంగళూరుకు అతిపెద్ద ప్రతికూలాంశం. బౌలింగ్‌ విభాగం కూడా గాడితప్పడంతో బెంగళూరుకు 8 మ్యాచ్‌ల్లో ఏడు పరాజయాలు ఎదురయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని