పొట్టి కప్పులో ఎవరు?

వెస్టిండీస్‌, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్‌ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్‌ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ కసరత్తులు చేస్తోంది.

Updated : 25 Apr 2024 08:51 IST

రిషబ్‌ పంత్‌ ఉంటాడా..? హార్దిక్‌ పాండ్యను ఎంపిక చేస్తారా..? శుభ్‌మన్‌ గిల్‌కు అవకాశముందా..? అసలు టీ20 ప్రపంచకప్‌కు టీమ్‌ఇండియా జట్టు ఎలా ఉండనుంది? జూన్‌ 1న ఆరంభమయ్యే ఈ పొట్టి కప్పు కోసం మే 1లోపు జట్లను ప్రకటించాలి. భారత జట్టును మూడు రోజుల్లో ప్రకటించే అవకాశమున్న నేపథ్యంలో.. అసలు ఎవరెవరికి ఛాన్సుందో చూద్దామా..?

ఈనాడు క్రీడావిభాగం: వెస్టిండీస్‌, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్‌ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్‌ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ కసరత్తులు చేస్తోంది. ఇప్పటికే కెప్టెన్‌ రోహిత్‌తో పాటు విరాట్‌ కోహ్లి, సూర్యకుమార్‌, బుమ్రా, సిరాజ్‌, కుల్‌దీప్‌, జడేజాకు జట్టులో స్థానం పక్కా. నిరుడు వన్డే ప్రపంచకప్‌ నేపథ్యంలో 2022 టీ20 ప్రపంచకప్‌ తర్వాత భారత్‌ 28 టీ20లు మాత్రమే ఆడింది. దీంతో జట్టు ఎంపికలో ఐపీఎల్‌ ప్రదర్శనను పరిగణలోకి తీసుకునే అవకాశముంది. రోహిత్‌తో కలిసి ఓపెనింగ్‌ కోసం యశస్వి జైస్వాల్‌, శుభ్‌మన్‌ గిల్‌ పోటీపడుతున్నారు. ఎడమచేతి వాటం కావడం, ఆరంభం నుంచే భారీ షాట్లతో విరుచుకుపడే బ్యాటింగ్‌తో యశస్వినే ముందంజలో ఉన్నాడు. భారత్‌ తరపున 17 టీ20ల్లో 161.93 స్ట్రైక్‌రేట్‌తో 502 పరుగులు చేసిన యశస్వి.. ఐపీఎల్‌కు ముందు ఇంగ్లాండ్‌తో టెస్టుల్లోనూ అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఈ ఐపీఎల్‌లో కాస్త తడబడ్డా ముంబయిపై అజేయ సెంచరీతో తిరిగి ఫామ్‌ అందుకున్నాడు. ఈ ఐపీఎల్‌లో 8 ఇన్నింగ్స్‌లో 298 పరుగులు చేసిన గిల్‌ ప్రత్యామ్నాయ ఓపెనర్‌గా జట్టుకు ఎంపికవొచ్చు.

హార్దిక్‌కు ఎసరు

ధనాధన్‌ ఇన్నింగ్స్‌లతో చెలరేగుతున్న శివమ్‌ దూబె.. హార్దిక్‌ పాండ్య స్థానానికి ఎసరు పెట్టేలాగే కనిపిస్తున్నాడు. 8 ఇన్నింగ్స్‌లో 169 స్ట్రైక్‌రేట్‌తో 311 పరుగులు చేసిన దూబె టీ20 ప్రపంచకప్‌కు కచ్చితంగా ఎంపికవుతాడనే అంచనాలున్నాయి. విండీస్‌లోని మందకొడి పిచ్‌లపై స్పిన్‌ను బాగా ఆడగలిగే దూబె జట్టుకు కీలకమయ్యే ఆస్కారముంది. కానీ ఈ పేస్‌ ఆల్‌రౌండర్‌ ఐపీఎల్‌లో మాత్రం ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా వచ్చి కేవలం బ్యాటింగ్‌ చేస్తున్నాడు. టీమ్‌ఇండియా అతని నుంచి బౌలింగ్‌ కూడా ఆశిస్తోంది. ఐపీఎల్‌కు ముందు అఫ్గానిస్థాన్‌తో సిరీస్‌లో ఆల్‌రౌండర్‌గా రాణించిన దూబె ‘‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌’’గా నిలిచాడు. మరోవైపు హార్దిక్‌ విఫలమవుతున్నాడు. ఈ సీజన్‌లో 8 మ్యాచ్‌ల్లో 151 పరుగులే చేసిన అతను 4 వికెట్లే పడగొట్టాడు. ఫినిషర్‌గా రింకు సింగ్‌ ఎంపిక ఖాయమే! నిరుడు ఐపీఎల్‌లో అదరగొట్టి టీమ్‌ఇండియాలోకి రావడమే కాదు అంతర్జాతీయ క్రికెట్లో (15 టీ20ల్లో 89 సగటు, 176 స్ట్రైక్‌రేట్‌తో 356 పరుగులు)నూ సత్తాచాటుతున్నాడు. ఈ సీజన్‌లో కేకేఆర్‌ బలమైన బ్యాటింగ్‌ ఆర్డర్‌ కారణంగా అతనికి (6 ఇన్నింగ్స్‌లో 107) పెద్దగా అవకాశాలు రావడం లేదు. ఇక ఈ సీజన్‌లో అనూహ్యంగా చెలరేగుతున్న పరాగ్‌ (7 ఇన్నింగ్స్‌లో 318) కూడా రేసులోకి వచ్చాడు.

పంత్‌ ముందంజలో

2022 చివర్లో రోడ్డు ప్రమాదం నుంచి బయటపడి, ఐపీఎల్‌తో తిరిగి పోటీ క్రికెట్లో అడుగుపెట్టిన పంత్‌ (9 ఇన్నింగ్స్‌లో 342) మళ్లీ జాతీయ జట్టులో స్థానం కోసం దూసుకెళ్తున్నాడు. ఒకప్పటిలా మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడుతూ, వికెట్ల వెనకాల కూడా చురుగ్గా కదులుతున్నాడు. ఫిట్‌నెస్‌ పరంగానే పంత్‌కు కాస్త ఇబ్బంది తప్పకపోవచ్చు. దీంతో శాంసన్‌, కేఎల్‌ రాహుల్‌ పేర్లు వినిపిస్తున్నాయి. ఈ ఐపీఎల్‌లో 8 ఇన్నింగ్స్‌ల చొప్పున ఆడిన శాంసన్‌ 314, రాహుల్‌ 302 పరుగులు చేశారు. పంత్‌ కాకపోతే శాంసన్‌నే వికెట్‌కీపర్‌గా ఆడించేందుకు ఎక్కువ అవకాశాలున్నాయి. బ్యాటింగ్‌ స్ట్రైక్‌రేటే అందుకు కారణమని చెప్పొచ్చు. ఇక అనూహ్యంగా చెలరేగిపోతున్న దినేశ్‌ కార్తీక్‌ (7 ఇన్నింగ్స్‌లో 251) కూడా పోటీలో ఉన్నానంటున్నాడు. మూడో పేసర్‌ స్థానం కోసం అవేశ్‌ ఖాన్‌, ముకేశ్‌ కుమార్‌ పోటీపడుతున్నా అర్ష్‌దీప్‌ సింగ్‌కే చోటు దక్కొచ్చు. భారత్‌ ఆడిన గత 28 టీ20ల్లో అర్ష్‌దీప్‌ 25 మ్యాచ్‌లాడాడు.  ఈ ఐపీఎల్‌లో 8 ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీశాడు. ప్రత్యామ్నాయ స్పిన్నర్లుగా రవి బిష్ణోయ్‌, ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ను తీసుకునే ఛాన్స్‌ ఉంది. ఈ ఐపీఎల్‌లో వికెట్ల వేటలో దూసుకెళ్తున్న సీనియర్‌ స్పిన్నర్‌ చాహల్‌ (8 ఇన్నింగ్స్‌లో 13) తనను పరిగణించక తప్పని పరిస్థితి కలిగిస్తున్నాడు. మొత్తానికి 20 మంది ఆటగాళ్ల జాబితాలో రోహిత్‌, యశస్వి, శుభ్‌మన్‌, కోహ్లి, సూర్యకుమార్‌, రింకు, హార్దిక్‌, జడేజా, శివమ్‌ దూబె, అక్షర్‌, పంత్‌, శాంసన్‌, కేఎల్‌ రాహుల్‌, కుల్‌దీప్‌, చాహల్‌, బిష్ణోయ్‌, బుమ్రా, సిరాజ్‌, అర్ష్‌దీప్‌, అవేశ్‌ చోటు దక్కించుకోవచ్చు. వీళ్లలో తుది జట్టులో ఎవరాడతారో చూడాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని