దిల్లీ గట్టెక్కింది

ఐపీఎల్‌-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్‌.. ప్లేఆఫ్స్‌ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్‌ టైటాన్స్‌ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది.

Updated : 25 Apr 2024 06:43 IST

4 పరుగుల తేడాతో గెలుపు
 పోరాడి ఓడిన గుజరాత్‌
సుదర్శన్‌, మిల్లర్‌, రషీద్‌ శ్రమ వృథా
చెలరేగిన పంత్‌, అక్షర్‌

ఐపీఎల్‌-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్‌.. ప్లేఆఫ్స్‌ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్‌ టైటాన్స్‌ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. పవర్‌ప్లేలో తడబాటు చూసి దిల్లీ 160 స్కోరు చేస్తే గొప్ప అనుకుంటే.. రిషబ్‌ పంత్‌ (88 నాటౌట్‌; 43 బంతుల్లో 5×4, 8×6), అక్షర్‌ పటేల్‌ (66; 43 బంతుల్లో 5×4, 4×6) అనూహ్యంగా చెలరేగడంతో ప్రత్యర్థికి ఏకంగా 225 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది. కానీ అంత స్కోరు చేసినా దిల్లీకి టెన్షన్‌ తప్పలేదు. విజయానికి అత్యంత చేరువగా వచ్చిన టైటాన్స్‌ కేవలం 4 పరుగుల తేడాతో ఓడింది. రాజస్థాన్‌పై జట్టుకు సంచలన విజయాన్నందించిన రషీద్‌ ఖాన్‌ ఆఖర్లో మరోసారి గొప్పగా పోరాడినా ఫలితం లేకపోయింది.


దిల్లీ

ఐపీఎల్‌-17లో మరోసారి భారీ స్కోర్లు నమోదై, ఉత్కంఠభరితంగా ముగిసిన మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్‌.. గుజరాత్‌ టైటాన్స్‌ను ఓడించింది. మొదట పంత్‌, అక్షర్‌ల మెరుపులతో డీసీ 4 వికెట్లకు 224 పరుగుల భారీ స్కోరు సాధించింది. టైటాన్స్‌ బౌలర్లలో సందీప్‌ వారియర్‌ (3/15) అదరగొట్టాడు. అనంతరం ఛేదనలో గుజరాత్‌ గొప్పగా పోరాడినప్పటికీ.. చివరికి 220/8కి పరిమితమైంది. సాయి సుదర్శన్‌ (65; 39 బంతుల్లో 7×4, 2×6), డేవిడ్‌ మిల్లర్‌ (55; 23 బంతుల్లో 6×4, 3×6), సాహా (39; 25 బంతుల్లో 5×4, 1×6), రషీద్‌ ఖాన్‌ (21 నాటౌట్‌; 11 బంతుల్లో 3×4, 1×6)ల శ్రమ వృథా అయింది. డీసీ బౌలర్లలో కుల్‌దీప్‌ యాదవ్‌ (2/29), రసిక్‌ సలామ్‌ (3/44) ఆకట్టుకున్నారు. 9 మ్యాచ్‌ల్లో దిల్లీకిది నాలుగో విజయం కాగా.. అన్నే మ్యాచ్‌లాడిన గుజరాత్‌ అయిదో పరాజయాన్ని ఖాతాలో వేసుకుంది.

ఆశలు రేపినా..: భారీ లక్ష్య ఛేదనలో ఆరంభంలోనే కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ (6) ఔట్‌ కావడంతో గుజరాత్‌ పోటీలో అయినా ఉంటుందా అనుకుంటే.. సాహా, ఇంపాక్ట్‌ ప్లేయర్‌ సాయి సుదర్శన్‌ చెలరేగి ఆడి జట్టులో ఆశలు రేపారు. నెమ్మదిగా ఆడే సుదర్శన్‌ ఈ మ్యాచ్‌లో మాత్రం రెచ్చిపోయాడు. అతను ఎడాపెడా బౌండరీలు బాదగా.. సాహా కూడా వీలు చిక్కినపుడల్లా బంతిని బౌండరీ బాట పట్టించడంతో పవర్‌ప్లే అయ్యేసరికి 67/1తో పటిష్ఠ స్థితిలో నిలిచింది. పదో ఓవర్లో సాహా ఔటయ్యేసరికి స్కోరు 98. అజ్మతుల్లా (1) ఎంతోసేపు నిలవకపోయినా.. సుదర్శన్‌కు తోడైన మిల్లర్‌ కూడా ధాటిగా ఆడడంతో 12 ఓవర్లకు 119/3తో గుజరాత్‌ లక్ష్యం దిశగా అడుగులు వేసింది. అయితే తర్వాతి ఓవర్లో సుదర్శన్‌ ఔటైపోయాడు. షారుక్‌ (8), తెవాతియా (4) కూడా ఇలా వచ్చి అలా వెళ్లిపోవడంతో దిల్లీ తేలిగ్గా గెలిచేస్తుందనిపించింది. కానీ మిల్లర్‌ ఓ ఎండ్‌లో పోరాటాన్ని కొనసాగించాడు. భారీ షాట్లు ఆడుతూ లక్ష్యాన్ని కరిగించాడు. నోకియా వేసిన 17వ ఓవర్లో అతను ఒక ఫోర్‌, మూడు సిక్సర్లు బాదేశాడు. విజయానికి 16 బంతుల్లో 44 పరుగులు అవసరమైన స్థితిలో అతను ఔటైపోయినా.. సాయికిశోర్‌ (13), రషీద్‌ పోరాడడంతో గుజరాత్‌ విజయానికి చేరువైంది. చివరి ఓవర్లో 19 పరుగులు అవసరం కాగా.. తొలి రెండు బంతులకు రషీద్‌ ఫోర్లు కొట్టాడు. తర్వాతి 2 బంతులకు పరుగు రాలేదు. అయిదో బంతికి రషీద్‌ సిక్స్‌ కొట్టగా.. చివరి బంతికి 5 అవసరమయ్యాయి. కానీ అతను సింగిలే తీయడంతో దిల్లీ ఊపిరి పీల్చుకుంది.

అక్షర్‌ అనూహ్యంగా..: మొదట టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న గుజరాత్‌.. పవర్‌ ప్లే అయ్యేవరకు ఆ నిర్ణయంపై చాలా సంతోషించే ఉంటుంది. ఆస్ట్రేలియా సంచలనం జేక్‌ ఫ్రేజర్‌ (23) ధాటిగా ఆడుతూ ఆరంభంలో టైటాన్స్‌ బౌలర్లను బెదరగొట్టినా.. అతడి వికెట్‌ పడ్డాక డీసీ ఇ న్నింగ్స్‌ గాడి తప్పింది. ఉన్నంతసేపు కళ్లు చెదిరే షాట్లు ఆడిన జేక్‌.. సందీప్‌ వారియర్‌ బౌలింగ్‌లో మరో స్క్వేర్‌ లెగ్‌ భారీ షాట్‌ ఆడబోయి బౌండరీ వద్ద నూర్‌కు చిక్కాడు. అదే ఓవర్లో పృథ్వీ (11) సైతం అక్కడే, నూర్‌కే క్యాచ్‌ ఇచ్చాడు. హోప్‌ (5) సైతం వారియర్‌కే వికెట్‌ సమర్పించుకోవడంతో పవర్‌ప్లే ముగిసేసరికి 44/3తో దిల్లీ తీవ్ర ఇబ్బందుల్లో పడింది. కానీ ఆ తర్వాత ఇబ్బందులన్నీ గుజరాత్‌వే. ఆశ్చర్యకరంగా మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన స్పిన్‌ ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ సంచలన ఆటతో ఇన్నింగ్స్‌ స్వరూపాన్నే మార్చేశాడు. ప్రమాదకర రషీద్‌ తొలి ఓవర్లోనే భారీ సిక్సర్‌ బాదిన అక్షర్‌.. ఆ తర్వాత కూడా స్పిన్నర్ల బౌలింగ్‌లో అలవోకగా షాట్లు ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. పంత్‌ సైతం ఆరంభం నుంచే ధాటిగా ఆడాడు. ఇద్దరూ పోటీ పడి ఫోర్లు, సిక్సర్లు బాదడంతో 11.4 ఓవర్లకే 100, 16.4 ఓవర్లకే 150 మార్కును అందుకుంది. అక్షర్‌ 37 బంతుల్లో, పంత్‌ 34 బంతుల్లో అర్ధశతకాలు పూర్తి చేసుకున్నారు. 17వ ఓవర్లో అక్షర్‌ ఔట్‌ కాగా.. తర్వాత వచ్చిన స్టబ్స్‌ ప్రతి బంతినీ కసిదీరా బాదేశాడు. ఇక పంత్‌ అయితే మోహిత్‌ వేసిన ఆఖరి ఓవర్లో విశ్వరూపం చూపించాడు. చివరి 5 బంతులకు 6, 4, 6, 6, 6, బాదేశాడు. దీంతో దిల్లీ అనూహ్యంగా 224 పరుగులు చేసింది.


దిల్లీ ఇన్నింగ్స్‌: పృథ్వీ (సి) నూర్‌ (బి) వారియర్‌ 11; జేక్‌ ఫ్రేజర్‌ (సి) నూర్‌ (బి) వారియర్‌ 23; అక్షర్‌ (సి) సాయికిశోర్‌ (బి) నూర్‌ 66; హోప్‌ (సి) రషీద్‌ (బి) వారియర్‌ 5; పంత్‌ నాటౌట్‌ 88; స్టబ్స్‌ నాటౌట్‌ 26; ఎక్స్‌ట్రాలు 5 మొత్తం: (20 ఓవర్లలో 4 వికెట్లకు) 224; వికెట్ల పతనం: 1-35, 2-36, 3-44, 4-157; బౌలింగ్‌: అజ్మతుల్లా 4-0-33-0; సందీప్‌ వారియర్‌ 3-0-15-3; రషీద్‌ ఖాన్‌ 4-0-35-0; నూర్‌ 3-0-36-1; మోహిత్‌ శర్మ 4-0-73-0; షారుక్‌ 1-0-8-0; సాయికిశోర్‌ 1-0-22-0

గుజరాత్‌ ఇన్నింగ్స్‌: సాహా (సి) అక్షర్‌ (బి) కుల్‌దీప్‌ 39; శుభ్‌మన్‌ (సి) అక్షర్‌ (బి) నోకియా 6; సుదర్శన్‌ (సి) అక్షర్‌ (బి) రసిక్‌ 65; అజ్మతుల్లా (సి) ఫ్రేజర్‌ (బి) అక్షర్‌ 1; మిల్లర్‌ (సి) రసిక్‌ (బి) ముకేశ్‌ 55; షారుక్‌ (సి) పంత్‌ (బి) రసిక్‌ 8; తెవాతియా (సి) పంత్‌ (బి) కుల్‌దీప్‌ 4; రషీద్‌ నాటౌట్‌ 21; సాయికిశోర్‌ (బి) రసిక్‌ 13; మోహిత్‌ నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 8 మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 220; వికెట్ల పతనం: 1-13, 2-95, 3-98, 4-121, 5-139, 6-152, 7-181, 8-206; బౌలింగ్‌: ఖలీల్‌ 2-0-26-0; నోకియా 3-0-48-1; రసిక్‌ సలామ్‌ 4-0-44-3; ముకేశ్‌ 4-0-41-1; అక్షర్‌ పటేల్‌ 3-0-28-1; కుల్‌దీప్‌ 4-0-29-2

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని