భారత ఫుట్‌బాల్‌ గుండెచప్పుడు

సునీల్‌ ఛెత్రి.. భారత ఫుట్‌బాల్‌ గుండె చప్పుడు! దాదాపు రెండు దశబ్దాల పాటు అత్యుత్తమ ఆటతో జట్టు భారాన్ని మోసిన వీరుడు. మెరుపు విన్యాసాలతో అభిమానులను మైదానాలకు ఆకర్షించిన సమ్మోహన శక్తి.

Published : 17 May 2024 03:09 IST

ఈనాడు క్రీడావిభాగం

సునీల్‌ ఛెత్రి.. భారత ఫుట్‌బాల్‌ గుండె చప్పుడు! దాదాపు రెండు దశబ్దాల పాటు అత్యుత్తమ ఆటతో జట్టు భారాన్ని మోసిన వీరుడు. మెరుపు విన్యాసాలతో అభిమానులను మైదానాలకు ఆకర్షించిన సమ్మోహన శక్తి. భారత ఫుట్‌బాల్‌లో అతడు లేని లోటును పూడ్చడం చాలా కష్టమే.

భారత ఫుట్‌బాల్‌ జట్టు అనగానే మొదట వినిపించేది సునీల్‌ ఛెత్రి పేరే. సాధారణంగా ఎవరినైనా మన జాతీయ ఫుట్‌బాల్‌ జట్టులో ఎవరు తెలుసా అని అడిగితే చెప్పేది అతని గురించే. అంతలా భారత ఫుట్‌బాల్‌ ముఖచిత్రంలా మారాడు ఛెత్రి. క్రికెట్లో దిగ్గజాలకు కొదవలేదు. కానీ ఫుట్‌బాల్‌ విషయానికి వస్తే ప్రస్తుత తరానికి వెంటనే గుర్తొచ్చేది ఛెత్రినే. అతడి ముద్ర అలాంటిది. మేటి క్రీడాకారుడు బైచుంగ్‌ భుటియా తర్వాత భారత్‌ నుంచి అతడి స్థాయిని ఇంకెవరూ అందుకోలేరేమో అని అనుకుంటున్న దశలో ఛెత్రి దూసుకొచ్చాడు. 2011లో భుటియా రిటైర్మెంట్‌ అనంతరం భారత ఫుట్‌బాల్‌కు కర్త, కర్మ, క్రియ అతడే. అతడు భుటియాను అందుకోవడమే కాదు.. అతణ్ని మించి ఎన్నో ఘనతలు సాధించాడు. ప్రపంచ ఫుట్‌బాల్‌లో భారత్‌ స్థానం గురించి వేరే చెప్పక్కర్లేదు. అతి చిన్న దేశాలు సైతం మనకంటే ఎన్నో రెట్లు మెరుగైన స్థితిలో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో భారత జట్టుకు ఛెత్రి ప్రధాన ఆకర్షణయ్యాడు. అభిమానులు జట్టు ఆటను చూసేందుకు ఓ ముఖ్య కారకుడయ్యాడు. జట్టు పది మ్యాచ్‌లు గెలిస్తే అందులో కనీసం ఎనిమిదింట్లో అతడి పాత్ర కీలకమైందంటే అతిశయోక్తి కాదు. ఈ స్టార్‌ ఫార్వర్డ్‌కు దూసుకెళ్లడమే తెలుసు. ఎన్నో సవాళ్లు ఎదురైనా, ఆటకు సరైన ఆదరణ దక్కకపోయినా.. తన భుజాలపై భారత ఫుట్‌బాల్‌ను మోశాడు.  ప్రపంచ వేదికలపై భారత ఉత్తమ ప్రదర్శనకు కారణమయ్యాడు.

రక్తంలోనే..: ఛెత్రి రక్తంలోనే ఫుట్‌బాల్‌ ఉంది. 1984 ఆగస్టు 3న సికింద్రాబాద్‌లోనే ఛెత్రి జన్మించాడు. అతని తండ్రి కేబీ ఛెత్రి ఆర్మీలో పనిచేసేవారు. ఆయన ఆర్మీ ఫుట్‌బాల్‌ జట్టుకు ఆడేవారు. సునీల్‌ తల్లి సుశీల, ఇద్దరు సోదరీమణులు నేపాల్‌ జట్టుకు ప్రాతినిథ్యం వహించడం విశేషం. సునీల్‌కు మొదట్లో ఫుట్‌బాల్‌పై ఇష్టం లేదు. టీనేజర్‌గా ఉన్నప్పుడు అల్లరిగా ఉండేవాడు. ఇతరులను ఆట పట్టించడమే పనిగా చేసుకున్నాడు. కానీ తండ్రికేమో సునీల్‌ను ఛాంపియన్‌గా చూడాలనే తపన. తాను సాధించలేదని తనయుడు అందుకోవాలనే కోరిక. కానీ మంచి కళాశాలలో ప్రవేశం కోసం ఫుట్‌బాల్‌ మొదలెట్టిన ఛెత్రి.. ఆటతో ప్రేమలో పడ్డాడు. సిటీ క్లబ్‌ దిల్లీ తరపున 2001లో అడుగుపెట్టాడు. 2002లో మోహన్‌ బగాన్‌తో ఒప్పందం అతని కెరీర్‌లో కీలక మలుపు.  2011 ఆసియా కప్‌ తర్వాత భైచుంగ్‌ రిటైర్మెంట్‌తో సారథ్య పగ్గాలు చేపట్టిన ఛెత్రి అప్పటి నుంచి జట్టును నడిపిస్తున్నాడు. ఆటగాళ్లను ప్రోత్సహిస్తూ జట్టుగా కలిపేస్తూ సాగుతున్నాడు. అతని గోల్‌ స్కోరింగ్‌ నైపుణ్యాలు, నాయకత్వ పటిమ గురించి ఎంత చెప్పినా తక్కువే. మిత్రుడు కోహ్లి సలహాతో శాకాహారిగా మారిన అతను.. ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటూ.. దాదాపు రెండు దశాబ్దాలుగా ఆటలో కొనసాగుతున్నాడు. ఛెత్రి 2011లో అర్జున, 2019లో పద్మశ్రీ, 2021లో ఖేల్‌రత్న పురస్కారాలు అందుకున్నాడు. ఖేల్‌రత్న పొందిన మొట్టమొదటి ఫుట్‌బాల్‌ ఆటగాడు అతనే.


మా ఆట చూడండని..

క్రికెట్‌ను పిచ్చిగా ఆరాధించే ఈ దేశంలో ప్రస్తుతం అభిమానులు కాస్తయినా ఫుట్‌బాల్‌ జట్టును అనుసరిస్తున్నారంటే ప్రధాన కారణం సునీల్‌ ఛెత్రినే అనడంలో సందేహం లేదు. కానీ రెండు దశాబ్దాల పాటు భారత ఫుట్‌బాల్‌ భారాన్ని మోసిన అతడు.. పెద్ద టోర్నీలు జరుగుతున్నా తమ ఆటను చూడడానికి అభిమానులు స్టేడియాలకు రావట్లేదని ఓ దశలో ఎంతో బాధపడ్డాడు.  ‘‘మమ్మల్ని తిట్టండి, విమర్శించండి.. కానీ దయ చేసి స్టేడియాలకు రండి’’ అంటూ 2018 ఇంటర్‌ కాంటినెంటల్‌ టోర్నీ సందర్భంగా భావోద్వేగంతో స్పందించాడు. అతడు ఎంతో ఆవేదనతో చేసిన వ్యాఖ్యలు అభిమానులను కదిలించాయి. తర్వాతి మ్యాచ్‌ల్లో స్టేడియాలు నిండిపోయాయి. వాళ్లనేమీ నిరాశపరచని ఛెత్రి.. టోర్నీ ఆద్యంతం రాణించి జట్టుకు కప్పును అందించాడు. ఇప్పుడు ఛెత్రి రిటైర్మెంట్‌తో ఆటను అభిమానులకు చేరువ చేసే ఓ స్టార్‌ను భారత ఫుట్‌బాల్‌ కోల్పోయినట్లే. ఈ వెలితిని పూడ్చడం అంత తేలిక కాదు. దేశంలో ఫుట్‌బాల్‌ పురోగతి స్తంభించిన ప్రస్తుత పరిస్థితుల్లో మరో ఛెత్రి వచ్చేదెప్పుడో..!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని