ట్రయల్స్‌ వద్దు.. పారిస్‌కు పంపండి

సెలెక్షన్‌ ట్రయల్స్‌లో పాల్గొనాలంటూ తమపై ఒత్తిడి తేవొద్దంటూ పారిస్‌ ఒలింపిక్‌ కోటా బెర్తులు సంపాదించిన క్రీడాకారిణులు భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ)కు విజ్ఞప్తి చేశారు.

Updated : 18 May 2024 04:20 IST

డబ్ల్యూఎఫ్‌ఐకి రెజ్లర్ల విజ్ఞప్తి

దిల్లీ: సెలెక్షన్‌ ట్రయల్స్‌లో పాల్గొనాలంటూ తమపై ఒత్తిడి తేవొద్దంటూ పారిస్‌ ఒలింపిక్‌ కోటా బెర్తులు సంపాదించిన క్రీడాకారిణులు భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ)కు విజ్ఞప్తి చేశారు. ఈ సమయంలో చిన్న అడుగు, ప్రతి పని ఒలింపిక్స్‌లో భారత్‌ పతక అవకాశాలపై ప్రభావం చూపిస్తాయని అభిప్రాయపడ్డారు. అన్షు మలిక్‌ (57 కేజీలు), నిషా దహియా (68 కేజీలు), రీతిక హుడా (76 కేజీలు)తో సహా అయిదుగురు భారత రెజ్లర్లకు ఒలింపిక్‌ కోటా బెర్తులు లభించాయి. అయితే సెలెక్షన్‌ ట్రయల్స్‌ గురించి చర్చించేందుకు ఈనెల 21న డబ్ల్యూఎఫ్‌ఐ సమావేశం నిర్వహించనుంది. డబ్ల్యూఎఫ్‌ఐ వర్గాల ప్రకారం గత సెలెక్షన్స్‌లో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన క్రీడాకారిణుల మధ్య మ్యాచ్‌లు నిర్వహిస్తారు. వీరిలో మొదటి స్థానంలో నిలిచిన క్రీడాకారిణితో ఒలింపిక్‌ కోటా రెజ్లర్‌ పోటీపడాలి. విజయం సాధించిన వారికి ఒలింపిక్స్‌ అవకాశం లభిస్తుంది. ‘‘ప్రతి చిన్న పని, ప్రతి అడుగులో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటికే చాలా అంతర్జాతీయ, జాతీయ టోర్నీలు.. ట్రయల్స్‌లో పాల్గొన్నాం. ఈ ట్రయల్స్‌ ద్వారా మా ఫిట్‌నెస్‌ను అంచనా వేయాల్సిన అవసరం లేదు. ఒలింపిక్స్‌కు ముందు మాకు మానసిక ప్రశాంతత కావాలి. రెండు నెలల సన్నాహం చాలా తక్కువే. ఈ సమయంలో ప్రతి రోజూ కీలకం. ఇప్పుడు జాతీయ స్థాయి ట్రయల్స్‌కు పిలిస్తే ప్రణాళికలు దెబ్బతింటాయి. భారత్‌ పతక అవకాశాలు ప్రభావితం అవుతాయి’’ అని అన్షు, నిషా, రీతిక తెలిపారు.


అర్జున్‌కు మిశ్రమ ఫలితాలు

షార్జా: తెలంగాణ కుర్రాడు అర్జున్‌ ఇరిగేశికి షార్జా మాస్టర్స్‌ చెస్‌ టోర్నమెంట్లో మిశ్రమ ఫలితాలు లభించాయి. అతడు ఒక రౌండ్లో ఓడి.. మరో రౌండ్లో గెలిచాడు. రెండో రౌండ్లో నికోలాస్‌ థియోడ్రో (గ్రీస్‌) చేతిలో ఓటమి చవిచూసిన అర్జున్‌.. మూడో రౌండ్లో నికోల్జీ కచెరావా (స్విట్జర్లాండ్‌)పై విజయం సాధించాడు. రాజా రిత్విక్‌ రెండో రౌండ్లో లెవోన్‌ ల్యూక్‌.. మూడో రౌండ్లో సహచర ఆటగాడు సేతురామన్‌తో గేమ్‌లను డ్రా చేసుకున్నాడు. మరోవైపు రెండో రౌండ్లో మరీజీ (ఫ్రాన్స్‌) చేతిలో ఓడిన ద్రోణవల్లి హారిక.. మూడో రౌండ్లో ఫెర్నాండో (అర్జెంటీనా)తో గేమ్‌ను డ్రా చేసుకుంది. 


బంగ్లాతో భారత్‌ వార్మప్‌

దుబాయ్‌: టీ20 ప్రపంచకప్‌ ఆరంభానికి ముందు టీమ్‌ఇండియా.. బంగ్లాదేశ్‌తో వార్మప్‌ మ్యాచ్‌ ఆడనుంది. జూన్‌ 1న అమెరికాలో ఈ సన్నాహక మ్యాచ్‌ జరుగనుంది. భారత్, బంగ్లా వార్మప్‌ మ్యాచ్‌ వేదిక, సమయాన్ని ఐసీసీ త్వరలోనే ప్రకటించనుంది. అమెరికా- వెస్టిండీస్‌ ఆతిథ్యమిచ్చే పొట్టి కప్పులో పాల్గొంటున్న 20 జట్లలో 17 టీమ్‌లు వార్మప్‌ మ్యాచ్‌లు ఆడతాయి. ఈనెల 27 నుంచి జూన్‌ 1 మధ్యలో టెక్సాస్, ఫ్లోరిడా, ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగోలో మ్యాచ్‌లు నిర్వహిస్తారు. మ్యాచ్‌ల షెడ్యూల్‌ను శుక్రవారం ఐసీసీ ప్రకటించింది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇంగ్లాండ్, రన్నరప్‌ పాకిస్థాన్, సెమీఫైనలిస్ట్‌ న్యూజిలాండ్‌ వార్మప్‌ మ్యాచ్‌లు ఆడట్లేదు. ఈనెల 22న ప్రారంభమయ్యే నాలుగు మ్యాచ్‌ల ద్వైపాక్షిక సిరీస్‌లో పాక్‌కు ఇంగ్లాండ్‌ ఆతిథ్యమివ్వనుంది. అయిదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కోసం పాక్‌లో పర్యటించిన కివీస్‌.. జూన్‌ 8న అఫ్గానిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌లో నేరుగా బరిలో దిగనుంది.


బాక్సింగ్‌లో నాలుగు కాంస్యాలు

అస్తానా (కజకిస్థాన్‌): ఎలోర్డా కప్‌ బాక్సింగ్‌లో భారత బాక్సర్లు నలుగురు కాంస్యాలతో సరిపెట్టుకున్నారు. శుక్రవారం సెమీఫైనల్స్‌లో యాయిఫాబా సింగ్‌ సోయ్‌బమ్‌ (48 కిలోలు) 3-4 తేడాతో అస్కత్‌ (కజకిస్థాన్‌) చేతిలో ఓడిపోగా.. 67 కిలోల విభాగంలో అభిషేక్‌ యాదవ్‌ 3-4 తేడాతో ముర్సల్‌ నుర్బెక్‌ (కజకిస్థాన్‌) చేతిలో పరాజయంపాలై కాంస్య పతకాలకు పరిమితమయ్యారు. విశాల్‌ (86 కిలోలు), గౌరవ్‌ చౌహాన్‌ (+92 కిలోలు) కూడా సెమీస్‌లో ఓడారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు