అప్పటి నుంచే ఆ ఆలోచన

అఫ్గానిస్థాన్‌తో ఫిఫా ప్రపంచకప్‌ క్వాలిఫయర్‌ మ్యాచ్‌ అనంతరం తొలిసారి రిటైర్మెంట్‌ ఆలోచన వచ్చిందని, తుది నిర్ణయం తీసుకోవడానికి ఓ నెల సమయం పట్టిందని భారత స్టార్‌ సునీల్‌ ఛెత్రి చెప్పాడు.

Published : 18 May 2024 03:37 IST

దిల్లీ: అఫ్గానిస్థాన్‌తో ఫిఫా ప్రపంచకప్‌ క్వాలిఫయర్‌ మ్యాచ్‌ అనంతరం తొలిసారి రిటైర్మెంట్‌ ఆలోచన వచ్చిందని, తుది నిర్ణయం తీసుకోవడానికి ఓ నెల సమయం పట్టిందని భారత స్టార్‌ సునీల్‌ ఛెత్రి చెప్పాడు. జూన్‌ 6న కువైట్‌తో ప్రపంచకప్‌ క్వాలిఫయర్స్‌ మ్యాచే తన కెరీర్‌లో ఆఖరిదని ఛెత్రి ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘‘శారీరకమైన కారణంతో రిటైర్‌ కావట్లేదు. ఇప్పటికీ చాలా ఫిట్‌గా ఉన్నా. మైదానంలో చురుగ్గా కదులుతున్నా. మానసిక అలసటే వీడ్కోలుకి కారణం. అఫ్గానిస్థాన్‌తో క్వాలిఫయర్స్‌ మ్యాచ్‌ ముగిశాక ఓ రోజు ఫుట్‌బాల్‌ ఆపేయాల్సిన సమయం వచ్చిందని మనసులో అనిపించింది. చాలా రోజులు అన్ని రకాలుగా ఆలోచించి తుది నిర్ణయం తీసుకున్నా. సరైన నిర్ణయమే తీసుకున్నాను. దేశానికి 150 మ్యాచ్‌లు ఆడడం మామూలు విషయం కాదు’’ అని ఛెత్రి తెలిపాడు. ఒకటి రెండేళ్లు దేశవాళీ టోర్నీల్లో ఆడతానని ఆ తర్వాత పూర్తిగా మైదానానికి దూరమవుతానని అతడు చెప్పాడు. ‘‘ఐఎస్‌ఎల్‌లో బెంగళూరు ఎఫ్‌సీకి  ఇంకో ఏడాది కచ్చితంగా ప్రాతినిథ్యం వహిస్తా. ఆ తర్వాత ఆటను ఆపేసి విశ్రాంతి తీసుకుంటా’’ అని ఛెత్రి పేర్కొన్నాడు. 

కోహ్లితో చర్చించి..: స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లితో సునీల్‌ ఛెత్రికి ప్రత్యేక అనుబంధం ఉంది. అందుకే తన వీడ్కోలు నిర్ణయాన్ని కూడా అతడు కోహ్లితో చర్చించి తీసుకున్నాడు. ఈ విషయాన్ని ఛెత్రినే చెప్పాడు. ‘‘రిటైర్‌మెంట్‌ నిర్ణయానికి ముందు కోహ్లితో మాట్లాడాను. ఎందుకంటే అతడు నాకెంతో ఆప్తుడు. ఒక ఆటగాడి ప్రయాణంలో ఎన్ని ఒడుదొడుకులు ఉంటాయో మా ఇద్దరికి అవగాహన ఉంది’’ అని ఛెత్రి తెలిపాడు. ఛెత్రి వీడ్కోలుపై విరాట్‌ కూడా స్పందించాడు. ‘‘సునీల్‌ గొప్ప ఆటగాడు. చాలా సంవత్సరాలుగా అతడితో అనుబంధం ఉంది. తాను వీడ్కోలు చెప్పబోతున్నట్లు అతడు సందేశం పంపాడు. ఈ నిర్ణయంతో అతడు మానసికంగా చాలా సంతోషంగా ఉంటాడని అనిపించింది’’ అని విరాట్‌ తెలిపాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు