మను ఆధిపత్యం

ఒలింపిక్‌ సెలక్షన్‌ ట్రయల్స్‌లో స్టార్‌ షూటర్‌ మను బాకర్‌ ఆధిపత్యం ప్రదర్శించింది.

Published : 20 May 2024 01:58 IST

భోపాల్‌: ఒలింపిక్‌ సెలక్షన్‌ ట్రయల్స్‌లో స్టార్‌ షూటర్‌ మను బాకర్‌ ఆధిపత్యం ప్రదర్శించింది. మొత్తం రెండు విభాగాల్లో ఆమె నాలుగు విజయాలు సాధించింది .ఆదివారం మధ్యప్రదేశ్‌ స్టేట్‌ అకాడమీ షూటింగ్‌ రేంజ్‌లో జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ట్రయల్‌-4 తుదిపోరులో మను 240.8 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. పలక్‌ (236.4) రెండో స్థానాన్ని దక్కించుకుంది. మహిళల 10 మీటర్ల ఎయిర్‌రైఫిల్‌ ఫైనల్లో ఇలవేనిల్‌ (254.3)తో మొదటి స్థానాన్ని సాధించింది. ఆమె ప్రపంచ రికార్డు (254) కన్నా మెరుగైన ప్రదర్శన చేయడం విశేషం. రమిత (253.3), మెహులి ఘోష్‌ (230.2) రెండు, మూడో స్థానాలు దక్కించుకున్నారు. పురుషుల 10 మీటర్ల రైఫిల్‌లో దివ్యాంశ్‌ పన్వర్‌ (253.3), అర్జున్‌ బబుతా (250), రుద్రాంక్ష్ పాటిల్‌ (229.5) తొలి మూడు స్థానాలు సాధించారు. పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌లో రవీందర్‌ సింగ్‌ (242.2) అగ్రస్థానంలో నిలవగా.. వరుణ్‌ తోమర్‌ (239.4), శరభ్‌జ్యోత్‌ (218.9) తర్వాతి స్థానాలు సాధించారు. నాలుగు ట్రయల్స్‌లో టాప్‌-3 స్కోర్లతో పాటు ఒలింపిక్‌ కోటా బోనస్‌ పాయింట్లను లెక్కలోకి తీసుకుని పారిస్‌కు వెళ్లే షూటర్ల జాబితాను భారత షూటింగ్‌ సమాఖ్య ప్రకటించనుంది.


రొమాగ్నా గ్రాండ్‌ప్రి విజేత వెర్‌స్టాపెన్‌

ఇమోలా (ఇటలీ): ఎమిలియా రొమాగ్నా గ్రాండ్‌ప్రి ఫార్ములావన్‌ రేసును మ్యాక్స్‌ వెర్‌స్టాపెన్‌ కైవసం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన ఈ రేసులో ఈ రెడ్‌బుల్‌ డ్రైవర్‌ 25 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. లాండో నోరిస్‌ (మెక్‌లారెన్‌) నుంచి పోటీ ఎదురైనా తడబడకుండా దూసుకెళ్లి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ ఏడాది ఏడు గ్రాండ్‌ప్రి రేసుల్లో వెర్‌స్టాపెన్‌కు ఇది అయిదో విజయం. రొమాగ్నా రేసులో నోరిస్‌ (18 పాయింట్లు) రన్నరప్‌గా నిలవగా.. లీక్లెర్క్‌ (ఫెరారీ, 15) మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు.


ఆర్సీబీ మిగిలిన జట్లకు స్ఫూర్తి: కార్తీక్‌ 

బెంగళూరు: పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచినా.. పుంజుకుని వరుస విజయాలతో ప్లేఆఫ్స్‌కు వచ్చిన రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మిగిలిన జట్లకు స్ఫూర్తిగా నిలుస్తుందని ఆ జట్టు వికెట్‌కీపర్‌ దినేశ్‌ కార్తీక్‌ అన్నాడు. ‘‘ఇలాంటి విజయాలను అభిమానులు ఎక్కువ కాలం గుర్తుంచుకుంటారు. బెంగళూరు తొలి ఎనిమిది మ్యాచ్‌ల్లో ఒక్కటే గెలిచినా.. ఆ తర్వాత వరుసగా 6 నెగ్గి ప్లేఆఫ్స్‌కు రావడం అసాధారణం. రాబోయే సీజన్లలోనూ వెనుకబడిన జట్లు ఆర్సీబీని చూసి స్ఫూర్తి పొందుతాయని అనుకుంటున్నా. మమ్మల్ని అనుసరిస్తున్న అభిమానులు మేం సాధించగలమని నమ్మారు. ఈ ప్రయాణం ఎంతో ప్రత్యేకం. మా జట్టును ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటారు’’ అని డీకే పేర్కొన్నాడు. గత కొన్ని మ్యాచ్‌ల్లో ఆడిన తీరు ఆర్సీబీలో ఆత్మవిశ్వాసాన్ని నింపిందని.. అదే జోరును చెన్నైతో మ్యాచ్‌లో ప్రదర్శించామని కార్తీక్‌ చెప్పాడు. అత్యుత్తమ ఫీల్డింగ్‌ కూడా తమ విజయాలకు కారణమని అతడు తెలిపాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని