ఐపీఎల్‌ దగ్గరి దారి కాకూడదు

భారత జట్టుకు ఆడాలనే కుర్రాళ్లకు ఐపీఎల్‌ దగ్గరి దారి కాకూడదని టీమ్‌ఇండియా మాజీ ఓపెనర్, కేకేఆర్‌ మార్గనిర్దేశకుడు గౌతమ్‌ గంభీర్‌ అభిప్రాయపడ్డాడు. ‘‘భారత్‌ తరపున ఎంతమంది యువ ఆటగాళ్లు టెస్టు క్రికెట్‌ ఆడాలనుకుంటున్నారు?

Updated : 21 May 2024 02:43 IST

చెన్నై: భారత జట్టుకు ఆడాలనే కుర్రాళ్లకు ఐపీఎల్‌ దగ్గరి దారి కాకూడదని టీమ్‌ఇండియా మాజీ ఓపెనర్, కేకేఆర్‌ మార్గనిర్దేశకుడు గౌతమ్‌ గంభీర్‌ అభిప్రాయపడ్డాడు. ‘‘భారత్‌ తరపున ఎంతమంది యువ ఆటగాళ్లు టెస్టు క్రికెట్‌ ఆడాలనుకుంటున్నారు? ఇప్పుడదే ఆందోళన కలిగిస్తోంది. టీమ్‌ఇండియాకు ఆడాలంటే ఐపీఎల్‌ దగ్గరి దారి కాకూడదని ఆశిస్తున్నా. ప్రస్తుతం అంతర్జాతీయ టీ20ల్లో చూసుకుంటే కేవలం రెండు లేదా మూడు జట్లు మాత్రమే భారత్‌కు పోటీనివ్వగలిగే స్థాయిలో ఉన్నాయి. చాలా జట్లు భారత ప్రమాణాలను అందుకోలేకపోతున్నాయి. ఇప్పుడు అంతర్జాతీయ టీ20 క్రికెట్‌ కంటే కూడా ఐపీఎల్‌ మరింత పోటాపోటీగా మారింది. దేశవాళీ ఆటగాళ్ల నైపుణ్యాలు మారాయి. వీళ్లు ఐపీఎల్‌లో ఆడాలని అనుకుంటున్నారు. వీళ్లలో చాలా మంది టీ20 క్రికెట్‌ ఆడటంపైనే దృష్టి పెడుతున్నారు’’ అని టీమ్‌ఇండియా స్పిన్నర్‌ అశ్విన్‌ యూట్యూబ్‌ షోలో గంభీర్‌ తెలిపాడు. తాను దూకుడుగానే ఉండాలని అనుకుంటున్నానని, వినోదాన్ని పంచేందుకు తానేమీ బాలీవుడ్‌ నటుణ్ని కాదని గంభీర్‌ చెప్పాడు. ‘‘నిబంధనలను నేను అతిక్రమించడం లేదు. దూకుడుగా ఉండాలని అనుకుంటున్నా. ఇందులో తప్పేముంది? అదే నా వ్యక్తిత్వం. విజయమంటే వ్యామోహం. అదే నా సమస్య. నేను నవ్వడం లేదని, ఎప్పుడూ సీరియస్‌గా ఉంటానని అంటుంటారు. కానీ జనాలు నేను నవ్వితే కాదు గెలిస్తే చూడటానికి వస్తున్నారు. నేను వినోదాన్ని అందించాలనుకోవడం లేదు. నేనేమీ బాలీవుడ్‌ నటుణ్ని కాదు. జట్టును గెలిపించుకుని, డ్రెస్సింగ్‌ గదిలోకి వెళ్లాలన్నదే నా పని’’ అని గంభీర్‌ పేర్కొన్నాడు.


అన్నింటికీ క్రమశిక్షణ అవసరం: గోపీచంద్‌ 

పట్నా: క్రీడలైనా, చదువులైనా క్రమశిక్షణ అవసరమని జాతీయ బ్యాడ్మింటన్‌ చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ అన్నాడు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల్ని ఉద్దేశించి మాట్లాడుతూ ‘‘క్రీడలు, విద్య రెండూ ఒక్కటే. రెండింటికీ క్రమశిక్షణ, అంకితభావం తప్పనిసరి. ముందుకు సాగేకొద్దీ మార్గనిర్దేశకత్వం అవసరం’’ అని గోపీచంద్‌ తెలిపాడు.


బోపన్న.. వాళ్లిద్దరిలో ఒకరితో 

దిల్లీ: పారిస్‌ ఒలింపిక్స్‌ టెన్నిస్‌ పురుషుల డబుల్స్‌లో రోహన్‌ బోపన్నతో కలిసి ఆడే అదృష్టం ఎవరికి దక్కుతుందో..? యుకి బాంబ్రి లేదా శ్రీరామ్‌ బాలాజీలలో ఒకరిని అతడు ఎంపిక చేసుకునే అవకాశముంది. ఏటీపీ డబుల్స్‌ ర్యాంకుల్లో ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉన్న బోపన్న ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తాడు. అతడితో కలిసి ఒలింపిక్స్‌ బరిలో దిగేది ఎవరన్నది భారత టెన్నిస్‌ సంఘం నిర్ణయిస్తుంది. ‘‘తమ భాగస్వామిని ఎంచుకునే స్వేచ్ఛ టాప్‌ ఆటగాడికి ఉంటుంది. అఖిల భారత టెన్నిస్‌ సమాఖ్య సెలక్షన్‌ కమిటీ ఈ విషయంలో బోపన్నతో చర్చిస్తుంది. ఎవరితో ఆడాలని అతడు అనుకుంటే దాని ప్రకారమే నిర్ణయం తీసుకుంటాం’’ అని ఐటా కార్యదర్శి అనిల్‌ ధూపర్‌ చెప్పాడు. కెరీర్‌ చరమాంకంలో గొప్పగా ఆడుతున్న 44 ఏళ్ల బోపన్నకు దాదాపు పారిసే చివరి ఒలింపిక్స్‌. 2016 రియో క్రీడల్లో సానియామీర్జా జతగా అతడు కొద్దిలో కాంస్య పతకాన్ని కోల్పోయాడు. మరోవైపు సింగిల్స్‌లో బరిలో దిగాలంటే సుమిత్‌ నగాల్‌ (ప్రస్తుత ర్యాంకు 94) ఫ్రెంచ్‌ ఓపెన్‌లో సత్తా చాటాలి. ఒలింపిక్స్‌ సింగిల్స్‌ డ్రాలో 64 మంది పోటీపడతారు. 


రెండో స్థానంలో అర్జున్‌ 

షార్జా: తెలంగాణ గ్రాండ్‌మాస్టర్‌ అర్జున్‌  ఇరిగేశి షార్జా మాస్టర్స్‌ చెస్‌ టోర్నీలో మరో విజయాన్ని అందుకున్నాడు. సోమవారం ఆరో రౌండ్లో డానియల్‌ యుఫా (రష్యా)పై 42 ఎత్తుల్లో గెలిచాడు. మరో మూడు రౌండ్లే మిగిలున్న ఈ టోర్నీలో అర్జున్‌ 4.5 పాయింట్లతో ఉమ్మడిగా రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.


ప్రైవేటు సంభాషణలు ప్రసారం చేయలేదు: స్టార్‌ 

దిల్లీ: వీక్షణల కోసం క్రికెటర్ల వ్యక్తిగత సంభాషణలు ప్రసారం చేస్నున్నారంటూ ప్రసారదారుపై టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మండిపడ్డ సంగతి తెలిసిందే. అయితే రోహిత్‌కు సంబంధించిన ఎలాంటి ప్రైవేట్‌ సంభాషణలు ప్రసారం చేయలేదని, అతడి గోప్యతకు భంగం కలిగించలేదని స్టార్స్‌ స్పోర్ట్స్‌ స్పష్టం చేసింది. కోల్‌కతా సహాయ కోచ్‌ అభిషేక్‌ నాయర్‌తో రోహిత్‌ మాట్లాడుతున్నప్పుడు తీసిన వీడియో ఈ నెల 11న వైరల్‌ అయింది. అందులో రోహిత్‌ ముంబయి తరఫున తన భవిష్యత్తు గురించి చర్చించినట్లు కనిపించింది. మే 16న లఖ్‌నవూతో మ్యాచ్‌కు ముందు అతడు ధవళ్‌ కులకర్ణితో మాట్లాడుతూ కనిపించాడు. ఆ సందర్భంగా కెమెరా తనవైపు ఉండడం చూసి అతడు ఆడియో ఆపేయాలని విజ్ఞప్తి చేశాడు. రోహిత్‌ ఆరోపణల నేపథ్యంలో స్టార్‌ స్పోర్ట్స్‌ స్పందించింది. ‘‘ఆ వీడియో (కులకర్ణితో సంభాషణ) మే 16న వాంఖడే స్టేడియంలో సాధన సందర్భంగా తీసింది. అక్కడ వీడియో తీయడానికి స్టార్‌స్పోర్ట్స్‌కు అధికారం ఉంది. సీనియర్‌ ఆటగాడు తన స్నేహితులతో మాట్లాడుతుండడాన్ని చూపించామంతే. ప్రసారం చేయలేదు’’ అని ఛానెల్‌ పేర్కొంది. 


నగాల్‌ ఔట్‌ 

జెనీవా: భారత స్టార్‌ ఆటగాడు సుమిత్‌ నగాల్‌ జెనీవా ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నమెంట్లో తొలి రౌండ్లోనే ఓడిపోయాడు. ఫ్రెంచ్‌ ఓపెన్‌కు సన్నాహకంగా జరుగుతున్న ఈ టోర్నీలో నగాల్‌ 6-7 (7-9), 3-6తో సెబాస్టియన్‌ బయిజ్‌ (అర్జెంటీనా) చేతిలో పరాజయం చవిచూశాడు. మే 26న ఆరంభమయ్యే ఫ్రెంచ్‌ ఓపెన్‌కు నగాల్‌ ఇప్పటికే అర్హత సాధించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని