జ్యోతి బృందానికి పసిడి

ఆసియా అథ్లెటిక్స్‌ రిలే ఛాంపియన్‌షిప్‌లో భారత 4×400 మీటర్ల మిక్స్‌డ్‌ జట్టు అదరగొట్టింది. ‘లక్ష్య’ అథ్లెట్‌ జ్యోతికశ్రీ దండి, మహ్మద్‌ అజ్మల్, అమోజ్‌ జాకబ్, శుభ వెంకటేశన్‌లతో కూడిన బృందం 3 నిమిషాల 14.12 సెకన్లలో లక్ష్యాన్ని చేరి స్వర్ణం ఎగరేసుకుపోయింది.

Published : 21 May 2024 02:39 IST

మిక్స్‌డ్‌ రిలేలో జాతీయ రికార్డు 

బ్యాంకాక్‌: ఆసియా అథ్లెటిక్స్‌ రిలే ఛాంపియన్‌షిప్‌లో భారత 4×400 మీటర్ల మిక్స్‌డ్‌ జట్టు అదరగొట్టింది. ‘లక్ష్య’ అథ్లెట్‌ జ్యోతికశ్రీ దండి, మహ్మద్‌ అజ్మల్, అమోజ్‌ జాకబ్, శుభ వెంకటేశన్‌లతో కూడిన బృందం 3 నిమిషాల 14.12 సెకన్లలో లక్ష్యాన్ని చేరి స్వర్ణం ఎగరేసుకుపోయింది. అంతేకాక గతేడాది హాంగ్జౌ ఆసియా క్రీడల్లో రజతం సాధించే క్రమంలో భారత్‌ నెలకొల్పిన జాతీయ రికార్డు (3 నిమిషాల 14.34 సె)ను బద్దలుకొట్టింది. ఈ రేసులో శ్రీలంక  (3 నిమిషాల 17.00 సె), వియత్నాం (3  నిమిషాల 18.45 సె) రెండు, మూడో స్థానాలు సాధించాయి. పసిడి గెలిచినా మిక్స్‌డ్‌ రిలే రేసులో ఒలింపిక్స్‌ బెర్తు సాధించే దిశగా భారత్‌ అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. 3 నిమిషాల 13.56 సెకన్లలో రేసు పూర్తి చేసి ఉంటే అత్యుత్తమ టైమింగ్‌ జాబితాలో భారత్‌ 16వ స్థానంలో నిలిచేది. కానీ అంతకంటే ఎక్కువ సమయంలో రేసు పూర్తి చేసి 21వ స్థానంతో సరిపెట్టుకుంది. నాసు, బహమాస్‌లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్‌ రిలే టోర్నీల ద్వారా ఇప్పటికే 14 జట్లు మిక్స్‌డ్‌ బెర్తులు సంపాదించాయి. జూన్‌ 30లోపు 15-16 స్థానాల్లో ఉండగలిగితే భారత్‌ ఒలింపిక్స్‌కు అర్హత సాధించే అవకాశాలున్నాయి. ఇంకా రెండే టికెట్లు మిగిలున్నాయి. చెక్‌ రిపబ్లిక్‌ (3 నిమిషాల 11.98 సె), ఇటలీ (3 నిమిషాల 13.56 సె) వరుసగా 15, 16 స్థానాల్లో ఉన్నాయి. రాబోయే టోర్నీల్లో సత్తా చాటితేనే భారత్‌కు అవకాశం ఉంటుంది. ఇటీవల బహమాస్‌ ఈవెంట్లో భారత్‌ మిక్స్‌డ్‌ జట్టు తొలి రౌండ్లోనే వెనుదిరిగింది. కానీ 4×400 మీటర్ల రిలేలో పురుషులు, మహిళల విభాగాల్లో పారిస్‌ బెర్తు దక్కించుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని