దీప్తి.. విజయ స్ఫూర్తి

తల్లిదండ్రులు కూలి పని చేస్తేనే ఇళ్లు గడిచే నేపథ్యం ఆమెది. ఒకవైపు పేదరికం.. మరోవైపు మానసిక లోపం! చాలా ఇబ్బందులు పడింది.. అవమానాలు ఎదుర్కొంది.. అయినా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు.

Updated : 21 May 2024 06:39 IST

తల్లిదండ్రులు కూలి పని చేస్తేనే ఇళ్లు గడిచే నేపథ్యం ఆమెది. ఒకవైపు పేదరికం.. మరోవైపు మానసిక లోపం! చాలా ఇబ్బందులు పడింది.. అవమానాలు ఎదుర్కొంది.. అయినా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. ఇంటిని.. ఊరును విడిచిపెట్టి సరికొత్త దారిలో పయనించింది. అకుంఠిత దీక్ష, మొక్కవోని పట్టుదలతో ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. అథ్లెటిక్స్‌లో అత్యున్నత శిఖరాలను అధిరోహించిన ఆ అమ్మాయే జీవాంజి దీప్తి.

ఈనాడు - హైదరాబాద్‌

దీప్తిది వరంగల్‌ జిల్లా కల్లెడ గ్రామం. తండ్రి యాదగిరి, తల్లి ధనలక్ష్మిని కుమార్తెకు ఎదురయ్యే అవమానాలు మరింత కుంగదీసేవి. అయితే భారత జూనియర్‌ జట్టు చీఫ్‌ కోచ్‌ నాగపురి రమేశ్‌ దృష్టిలో పడటం దీప్తి కెరీర్‌కు మలుపు. వరంగల్‌లో పాఠశాల మీట్‌లో దీప్తిని చూసిన అతడు శిక్షణ కోసం హైదరాబాద్‌కు పంపించమని తల్లిదండ్రులకు సూచించాడు. బస్సు ఛార్జీలకు కూడా డబ్బులు లేకపోవడంతో తానే భరించి ఆమెను హైదరాబాద్‌ తీసుకొచ్చి శిక్షణ ఇప్పించాడు. ‘లక్ష్య’ మార్గనిర్దేశకుడు పుల్లెల గోపీచంద్‌ చొరవతో ఆమె మానసిక లోపమున్న అథ్లెట్ల పోటీల్లో పాల్గొంది. అంతర్జాతీయ స్థాయిలో ఆ పోటీల్లో బరిలో దిగేందుకు అవసరమైన లైసెన్స్‌ కోసం మొరాకో, ఆస్ట్రేలియా టోర్నీల్లో పాల్గొనాల్సి వచ్చింది. అందుకోసం గోపీచంద్‌  రూ.3 లక్షలు వెచ్చించి దీప్తి భవితకు బాటలు వేశాడు. 

మొరాకో నుంచి కోబె వరకు: ఆర్థికంగా మద్దతు, అత్యున్నత శిక్షణ దొరకడంతో దీప్తి ప్రదర్శన బాగా మెరుగైంది. అంతర్జాతీయ స్థాయిలో అదరగొట్టింది. 2022లో మొరాకోలో జరిగిన ప్రపంచ పారా గ్రాండ్‌ప్రిలో ఆమె టీ20, 400 మీటర్ల పరుగులో పసిడితో మెరిసింది. దీప్తికి తొలి అంతర్జాతీయ స్వర్ణమిదే. 400తో పాటు 200 మీటర్లలోనూ ఆమె సత్తా చాటింది. అదే ఏడాది బ్రిస్బేన్‌ వేదికగా వర్చుస్‌ ఆసియానియా క్రీడల్లో 200 మీటర్లలో 26.82 సెకన్లలో లక్ష్యాన్ని చేరి పసిడి గెలిచిన ఆమె.. 400 మీటర్లను 57.58 సెకన్లలో పూర్తి చేసి స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. అదే జోరు కొనసాగిస్తూ వెళ్లిన దీప్తి.. 2023 పారా ఆసియా క్రీడల ప్రదర్శనతో మరో ఎత్తుకు ఎదిగింది. ఈ క్రీడల్లో 400 మీటర్లను 56.69 సెకన్లలో రేసు పూర్తి చేసి అగ్రస్థానంతో పాటు ఆసియా రికార్డును సొంతం చేసుకుందామె. ఆ విజయం తర్వాత దీప్తిపై ప్రశంసల వర్షం కురిసింది. జిల్లా కలెక్టర్, ప్రజా ప్రతినిధులు ఇంటికొచ్చి అభినందించడం దీప్తి కుటుంబం కలలో కూడా ఊహించని దృశ్యాలే. గోపీచంద్‌ సిఫార్సుతో ‘లక్ష్య’ గొడుగు కిందకి వచ్చిన దీప్తికి మరింత మెరుగైన శిక్షణ లభించింది. అంతర్జాతీయ స్థాయి వసతులు, శిక్షణ అందించడంతో అత్యున్నత శిఖరాలకు చేరుకుంది. పారాలింపిక్స్‌కు అర్హత సాధించిన దీప్తి.. ‘లక్ష్య’ అండ, మద్దతుతో పతకం నెగ్గడం ఖాయమని గోపీచంద్, రమేశ్‌ ఆశాభావం వ్యక్తంజేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని