ప్రీతి రికార్డు పసిడి

ప్రపంచ యూత్‌ వెయిట్‌లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత అమ్మాయి ప్రీతి స్మిత (40 కేజీలు) సత్తా చాటింది. ప్రపంచ రికార్డుతో సహా పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది.

Published : 24 May 2024 02:53 IST

లిమా (పెరూ): ప్రపంచ యూత్‌ వెయిట్‌లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత అమ్మాయి ప్రీతి స్మిత (40 కేజీలు) సత్తా చాటింది. ప్రపంచ రికార్డుతో సహా పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. స్నాచ్‌లో 57 కేజీలు ఎత్తిన ప్రీతి.. క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 76 కేజీలు లిఫ్ట్‌ చేసి ప్రపంచ రికార్డు (75 కేజీలు)ను బద్దలుకొట్టింది. మొత్తం మీద 133 కేజీలతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. మరో భారత లిఫ్టర్‌ జోత్స్న 125 కేజీలతో (స్నాచ్‌ 56 + క్లీన్‌ అండ్‌ జెర్క్‌ 69 కేజీలు) రజతం.. టర్కీ అమ్మాయి ఫాతిమా 120 కేజీలతో (స్నాచ్‌ 55, క్లీన్‌ అండ్‌ జెర్క్‌ 65 కేజీలు) కాంస్యం సాధించారు. 45 కేజీల్లో పాయల్‌ (మొత్తం 147 కేజీలు) రజతం.. పురుషుల 49 కేజీల కేటగిరిలో బాబులాల్‌ (మొత్తం 193 కేజీలు) కాంస్యం గెలిచారు.


సెమీస్‌లో ప్రథమేశ్‌ 

ప్రపంచకప్‌ ఆర్చరీ 

యెచియాన్‌ (దక్షిణ కొరియా): ప్రపంచకప్‌ ఆర్చరీ స్టేజ్‌-2 టోర్నమెంట్లో భారత యువ ఆర్చర్‌ ప్రథమేశ్‌ సెమీఫైనల్‌కు దూసుకెళ్లాడు. పురుషుల కాంపౌండ్‌ వ్యక్తిగత విభాగం క్వార్టర్‌ఫైనల్స్‌లో అతడు 146-145తో నికో వీనెర్‌ (ఆస్ట్రియా)ను ఓడించాడు. సెమీస్‌లో జేమ్స్‌ లూజ్‌ (అమెరికా)తో ప్రథమేశ్‌ తలపడనున్నాడు. మరోవైపు అభిషేక్‌వర్మ రెండో రౌండ్లో.. ప్రియాంశ్‌ ప్రిక్వార్టర్స్‌లో ఇంటిముఖం పట్టారు. మహిళల కాంపౌండ్‌లో టీమ్‌ విభాగంలో ఫైనల్‌ చేరిన తెలుగమ్మాయి జ్యోతి సురేఖ.. వ్యక్తిగత విభాగంలో క్వార్టర్స్‌లోనే ఓడింది. ఆమె 142-145తో సారా లోపెజ్‌ (కొలంబియా)కు తలొంచింది. రికర్వ్‌ టీమ్‌ విభాగం తొలి రౌండ్లో బొమ్మదేవర ధీరజ్, తరుణ్‌దీప్‌ రాయ్, మృనాల్‌ చౌహాన్‌లతో కూడిన భారత జట్టు 3-5తో కెనడా చేతిలో కంగుతింది. రికర్వ్‌ మహిళల టీమ్‌ విభాగంలోనూ భారత్‌కు చుక్కెదురైంది. తొలి రౌండ్లో దీపిక కుమారి, అంకిత బాకత్, భజన్‌ కౌర్‌లతో కూడిన బృందం 4-5తో షూటాఫ్‌లో వియత్నాం చేతిలో ఓడిపోయింది. నిర్ణీత సమయానికి భారత్‌-వియత్నాం చెరో రెండు సెట్లు గెలిచి సమానంగా నిలిచాయి. షూటాఫ్‌లో వియత్నాం 27-25తో భారత్‌పై పైచేయి సాధించింది.


ఫ్రెంచ్‌ ఓపెన్‌ బరిలో నాదల్‌ 

పారిస్‌: రెండేళ్లుగా వేధిస్తున్న గాయాలు. తుంటి శస్త్రచికిత్స కారణంగా ఫిట్‌నెస్‌ సమస్యలు. ఆటలో వెనుకబాటు. దీంతో ఈ ఏడాది ఫ్రెంచ్‌ ఓపెన్‌లో ఆడాలా? వద్దా? అని ఓ దశలో టెన్నిస్‌ దిగ్గజం రఫెల్‌ నాదల్‌ సందిగ్ధంలో పడ్డాడు. ముఖ్యంగా ఇటాలియన్‌ ఓపెన్‌లో పేలవ ఆటతీరుతో ఆలోచనల్లో మునిగిపోయాడు. కానీ తనకు అచ్చొచ్చిన, ఎంతో ఇష్టమైన ఫ్రెంచ్‌ ఓపెన్‌లో ఈ సారి అతను ఆడబోతున్నాడు. శస్త్రచికిత్స కారణంగా నిరుడు ఈ టోర్నీకి నాదల్‌ దూరమైన సంగతి తెలిసిందే. ఇక్కడ 14 సార్లు విజేతగా నిలిచిన అతను.. ఆదివారం ఆరంభమయ్యే ఈ ఎర్రమట్టి కోర్టు టోర్నీ కోసం ప్రాక్టీస్‌ చేస్తున్నాడు. అలాగే గురువారం విడుదల చేసిన టోర్నీ డ్రాలో అతని పేరుంది. అన్‌సీడెడ్‌గా ఆడబోతున్న నాదల్‌ తొలి రౌండ్లో నాలుగో ర్యాంకర్‌ జ్వెరెవ్‌ను ఢీకొడతాడు. 2022లో ఈ టోర్నీ సెమీస్‌లో వీళ్లిద్దరు తలపడగా.. గాయంతో జ్వెరెవ్‌ మధ్యలోనే తప్పుకున్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని