క్వార్టర్స్‌లో సింధు

మలేసియా మాస్టర్స్‌ సూపర్‌ 500 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది.

Published : 24 May 2024 03:10 IST

మూడో సీడ్‌కు షాకిచ్చిన అష్మిత

కౌలాలంపూర్‌: మలేసియా మాస్టర్స్‌ సూపర్‌ 500 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. గురువారం మహిళల సింగిల్స్‌ రెండో రౌండ్లో ఈ అయిదో సీడ్‌ సింధు 21-13, 12-21, 21-14 తేడాతో సిమ్‌ యు జిన్‌ (కొరియా)పై పోరాడి గెలిచింది. ప్రపంచ 34వ ర్యాంకర్‌ ప్రత్యర్థిపై విజయం కోసం ప్రపంచ 15వ ర్యాంకర్‌ సింధు కష్టపడాల్సి వచ్చింది. తొలి గేమ్‌ ఆరంభంలో 3-7తో వెనుకబడ్డ సింధు ఆ తర్వాత పుంజుకుంది. స్మాష్‌లతో సత్తాచాటింది. 11-10తో విరామానికి వెళ్లిన ఆమె మరింత దూకుడు ప్రదర్శించింది. వరుసగా ఏడు పాయింట్లు గెలిచి గేమ్‌ సొంతం చేసుకుంది. కానీ రెండో గేమ్‌లో సింధుకు షాక్‌ తప్పలేదు. నిర్ణయాత్మక మూడో గేమ్‌లోనూ సింధు 1-5తో వెనకబడింది. ప్రతికూల పరిస్థితుల్లోనూ ఆమె గొప్ప పోరాటాన్ని ప్రదర్శించింది. 16-14తో ఆధిక్యంలోకి వెళ్లిన ఆమె వరుసగా అయిదు పాయింట్లతో గేమ్‌తో పాటు మ్యాచ్‌నూ ముగించింది. మరోవైపు ప్రపంచ 53వ ర్యాంకర్‌ అష్మిత చాలిహా రెండో రౌండ్లో 21-19, 16-21, 21-12తో పదో ర్యాంకర్‌ బీవెన్‌ జంగ్‌ (అమెరికా)ను కంగుతినిపించింది. రెండో గేమ్‌లో ఓడిన తర్వాత బలంగా పుంజుకున్న అష్మిత మూడో గేమ్‌లో అదరగొట్టింది. పురుషుల సింగిల్స్‌లో కిరణ్‌ జార్జ్‌ 13-21, 18-21తో జియా (మలేసియా) చేతిలో ఓడాడు. మహిళల డబుల్స్‌లో గాయత్రి- ట్రీసా 18-21, 22-20, 14-21తో సంగ్‌- చీన్‌ (కొరియా) చేతుల్లో పరాజయం పాలయ్యారు. సిమ్రన్‌- రితిక 17-21, 11-21తో పియర్లి- తినా (మలేసియా) చేతుల్లో, మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సుమీత్‌- సిక్కిరెడ్డి 9-21, 15-21తో చెన్‌- వీ (మలేసియా) చేతుల్లో ఓడారు. 

విదేశీ శిక్షణకు సింధు: పీవీ సింధుతో పాటు యువ షట్లర్‌ లక్ష్యసేన్‌ విదేశీ శిక్షణకు ఆర్థిక సాయం అందించేందుకు క్రీడా మంత్రిత్వ మిషన్‌ ఒలింపిక్‌ సెల్‌ (ఏంవోసీ) ఆమోదం తెలిపింది. పారిస్‌ ఒలింపిక్స్‌కు సన్నాహకంలో భాగంగా సింధు నెల రోజుల పాటు తన కోచ్, సిబ్బందితో జర్మనీలో శిక్షణ పొందనుంది. ఫ్రాన్స్‌లో లక్ష్యసేన్‌ 12 రోజుల పాటు శిక్షణ తీసుకోనున్నాడు. మరోవైపు టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ఆకుల శ్రీజతో పాటు ఆర్చర్‌ తిష క్రీడా పరికరాల కొనుగోలుకూ ఎంవోసీ పచ్చజెండా ఊపింది. వివిధ టోర్నీల్లో పాల్గొనేందుకు గోల్ఫర్‌ అదితి, స్విమ్మర్‌ ఆర్యన్‌కు అనుమతినిచ్చింది. టీటీ ఆటగాడు హర్మీత్‌ దేశాయ్, మహిళల 4×400మీ. రిలే జట్టునూ టాప్స్‌ ప్రధాన బృందంలో చేర్చింది. రెజ్లర్లు నిశ, రీతికలకు కూడా ఈ బృందంలో ఎంవోసీ చోటు కల్పించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని